
సీఎం వైఎస్ జగన్‌తో సినీ నటుడు అలీ
సాక్షి, అమరావతి: మెగాస్టార్ చిరంజీవిని, ఆయనతోపాటు వచ్చిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు, రెబల్‌స్టార్ ప్రభాస్, సినీ దర్శకులు ఎస్‌ఎస్ రాజమౌళి, కొరటాల శివ తదితర సినీ ప్రముఖులను ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత గౌరవించారని సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత అలీ చెప్పా రు. అవమానించడానికి ఎవరైనా ఆహ్వానిస్తారా అని ప్రశ్నించారు. ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, దానిని ఎవరూ విశ్వసించరని చెప్పారు. అలీ కుటుంబ సమేతంగా మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. తర్వాత మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి భేటీ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఇంటి బయటకు వచ్చి మెగాస్టార్‌ను ఆహ్వానించి.. ఆయనపై తనకున్న గౌరవాన్ని చాటి చెప్పారని గుర్తు చేశారు. భోజనం చేసిన తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్‌తో చిరంజీవి చర్చించారన్నారు. ఆ తర్వాత సీఎంవో ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవితో కలిసి సినీ ప్రముఖులు సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారని చెప్పారు. ఆ సమావేశంలో తాను కూడా ఉన్నానని, అప్పుడు వ్యక్తిగతంగా సీఎం వైఎస్ జగన్‌తో మాట్లాడలేకపోయానని చెప్పారు. సామాన్యులకు తక్కువ ధరకే వినోదం అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆశయమన్నారు. రూ.కోటితో తీసిన సినిమా.. రూ.వంద కోట్లతో తీసిన సినిమా రెండూ లాభాలు గడించేలా విధానపరమైన నిర్ణయం సీఎం వైఎస్ జగన్ తీసుకుంటారన్నారు. త్వరలోనే తెలుగు సినిమా కష్టాలు తీరతాయని ధీమా వ్యక్తం చేశారు.
‘అప్పటి ఎన్నికల్లో పోటీ చేయమన్నారు’
2004 నుంచే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డితోనూ, సీఎం వైఎస్ జగన్‌తోనూ తనకు అనుబంధం ఉందని అలీ చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో ఏమీ ఆశించకుండా వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరినా.. సమయం లేకపోవడంతో పోటీ చేయలేకపోయానన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో మంగళవారం కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్‌ను కలిశానని చెప్పారు. తనకు త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారని, ఇందుకు సంబంధించిన ప్రకటన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి త్వరలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పారు.