లక్షల ఉద్యోగాలిస్తున్నా మొసలి కన్నీరు | Amaravati: Chandrababu Naidu Fake Allegations Over Jobs Unemployment | Sakshi
Sakshi News home page

లక్షల ఉద్యోగాలిస్తున్నా మొసలి కన్నీరు

Published Sat, Feb 12 2022 4:01 AM | Last Updated on Sat, Feb 12 2022 5:32 PM

Amaravati: Chandrababu Naidu Fake Allegations Over Jobs Unemployment - Sakshi

సాక్షి, అమరావతి: నిరుద్యోగులను నట్టేట ముంచి ఉద్యోగాల ఊసే లేకుండా ఐదేళ్లు గడిపిన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇప్పుడు లక్షల సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తున్నా కలెక్టరేట్ల ముట్టడి, నిరసనలంటూ తమ పార్టీ కార్యకర్తలతో డ్రామాలాడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. జాబు రావాలంటే బాబు రావాలని టీడీపీ నేతలు ఆనాడు ఇంటింటికీ తిరిగి చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నా నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఉద్యోగాల భర్తీ అంటూ జీవోలిచ్చి మభ్యపెట్టారు.

ఏపీపీఎస్సీ ద్వారా 32 నోటిఫికేషన్లు విడుదల చేసి పోస్టులు మాత్రం భర్తీ చేయలేదు. గ్రూప్‌ – 2, గ్రూప్‌ – 3 తదితర కొన్ని నోటిఫికేషన్లకు పరీక్షలు నిర్వహించినా అక్రమాలు వెల్లువెత్తాయి. కోచింగ్‌ సెంటర్ల యాజమాన్యాలు ఏపీపీఎస్సీలో తిష్టవేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంస్కరణలు చేపట్టి ఎప్పటికప్పుడు పారదర్శకంగా పోస్టులను భర్తీ చేస్తోంది. గత సర్కారు హయాంలో నిలిచిపోయిన నోటిఫికేషన్లను సైతం న్యాయ వివాదాలు పరిష్కరించి నియామకాలను పూర్తి చేసింది. మరోవైపు పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందిస్తోంది. ప్రత్యేకించి కరోనా సమయంలో చిన్న, సూక్ష్మ పరిశ్రమలను నిలబెట్టేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని ప్రోత్సాహకాలతో పాటు గత సర్కారు బకాయిలు కూడా విడుదల చేయడంతో యువత అవకాశాలు మెరుగుపడ్డాయి. వీటితోపాటు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ చేదోడు, ఆసరా, చేయూత తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. 

+ రెండున్నరేళ్లలో రికార్డు స్థాయిలో 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాట ప్రకారం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టింది. గత సర్కారు హయాంలో నోటిఫికేషన్లకే పరిమితమై న్యాయ వివాదాల్లో చిక్కుకున్న వాటిని పరిష్కరించి 3,946 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసింది. 1,237 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్లు జారీ వెలువడ్డాయి. సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టి ఒకే ఒక్క నోటిఫికేషన్‌ ద్వారా నెలల వ్యవధిలోనే ప్రక్రియను సజావుగా పూర్తి చేసింది. రెండున్నరేళ్లలో కొత్తగా 1,84,264 ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే 1.25 లక్షల మందికిపైగా ఉద్యోగులున్నారు. ప్రతి గ్రామంలో చదువుకున్న యువతకు ఉపాధి కల్పిస్తామన్న హామీని సీఎం జగన్‌ నెరవేర్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు 3.97 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా కేవలం రెండున్నరేళ్లలోనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1.84 లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలనివ్వడం గమనార్హం. 

+ డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు న్యాయం
టీడీపీ హయాంలో పాఠశాల విద్యాశాఖ ద్వారా 21 వేల పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులను ఊరించి కేవలం 9,275 పోస్టులకే 2018 సెప్టెంబర్‌లో జీవో ఇచ్చారు. చివరకు నోటిఫికేషన్లు వచ్చేసరికి అది కాస్తా 7,902 పోస్టులకు కుదించుకుపోయింది. న్యాయ వివాదాలు చుట్టుముట్టడంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక చొరవ తీసుకొని పరిష్కరించి నియామకాలు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్ధులకు కూడా మానవతా దృక్పథంతో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. అదే సమయంలో పరీక్షలు రాసిన క్వాలిఫైడ్‌ అభ్యర్ధులకు పక్క రాష్ట్రంలో న్యాయం జరగకపోవడం గమనార్హం. టీడీపీ హయాంలో నిరుద్యోగులను మభ్యపెట్టేలా జీవోలిచ్చి నియామక ప్రక్రియ ముందుకు వెళ్లకుండా న్యాయ వివాదాల్లోకి నెట్టారు. ఫలితంగా వేలాది పోస్టులు అలాగే ఉండిపోయాయి. యూనివర్సిటీ పోస్టులదీ అదే పరిస్థితి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ అంటూ ఇచ్చిన నోటిఫికేషన్లు న్యాయవివాదాల్లో చిక్కుకుని నేటికీ ఎటూ తేలలేదు. చివరకు వాటి స్థానంలో కొత్తగా రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 


+ పరిశ్రమలకు ఊతంతో భారీగా ఉపాధి
రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు ఊతమిస్తూ రూ.2,086.42 కోట్ల ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత సర్కారు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను సైతం ఈ ప్రభుత్వమే చెల్లించింది. రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ఎంఎస్‌ఎంఈలకు రూ.2,086 కోట్లు విడుదల చేసింది. రెండున్నరేళ్లలో రాష్ట్రంలో కొత్తగా 19,997 ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు అయ్యాయి. 1,09,829 మందికి ఉపాధి కల్పించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో లబ్ధి పొందుతున్న యూనిట్లలో 62 శాతం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీలది కాగా 42 శాతం అక్కచెల్లెమ్మలది కావడం గమనార్హం. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రూ. 30,175 కోట్ల పెట్టుబడితో 68 భారీ, మెగా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. దీని ద్వారా 46,119 మందికి ఉపాధి లభిస్తోంది. ఇదే కాకుండా రూ. 36,384 కోట్ల పెట్టుబడితో త్వరలో ప్రారంభం కానున్న మరో 62 భారీ, మెగా ప్రాజెక్ట్‌లు 76,916 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఎలక్ట్రానిక్‌ రంగంలో భారీ పెట్టుబడులకు బ్లూస్టార్, డైకిన్, యాంబర్, డిక్సన్, ఫాక్స్‌కాన్, సెల్‌కాన్, కార్బన్‌ లాంటి సంస్థలు ముందుకొచ్చాయి. రికార్డు సమయంలో రెండు పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేసి ప్రారంభించింది. నాలుగు ఫిషింగ్‌ హార్బర్లకు శంకుస్థాపన చేయగా మరో ఐదు హార్బర్లకు టెండర్లు పిలిచారు. 

+ స్వయం ఉపాధికి ప్రోత్సాహం
స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. చిరు వ్యాపారులు అధిక వడ్డీల బారిన పడి చితికిపోకుండా జగనన్న తోడు పథకం దోహదం చేస్తోంది. ఈ పథకం ద్వారా వడ్డీ లేకుండా రూ.10 వేల చొప్పున బ్యాంకు రుణాలను అందచేస్తోంది. జగనన్న చేదోడు పథకం ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు రూ.10 వేల చొప్పున వరుసగా రెండో ఏడాది కూడా సాయాన్ని ఇటీవలే అందించింది. జగనన్న వాహన మిత్ర ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ. 10 వేలు చొప్పున ఇస్తోంది. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 – 60 ఏళ్ల అగ్రవర్ణ  మహిళలకు ఏటా రూ.15 వేలు చొప్పున అందించి అండగా నిలుస్తోంది. వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం, వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా తదితర పథకాలతో వారి కాళ్లపై వారు నిలదొక్కుకుని కుటుంబాన్ని పోషించుకునేలా సాయాన్ని అందచేస్తోంది.

+ 4.77 లక్షల కుటుంబాలకు శాశ్వత ‘ఉపాధి’
వ్యాపార దిగ్గజ సంస్థలైన హిందూస్థాన్‌ లీవర్, ఐటీసీ, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబల్, రిలయెన్స్, అజియో, అమూల్‌ లాంటి సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుని గత రెండేళ్లలో 4.77 లక్షల కుటుంబాలకు శాశ్వత జీవనోపాధులను కల్పించింది. వైఎస్సార్‌ ఆసరా, చేయూత పథకాల ద్వారా ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సాయంతోపాటు వ్యాపార సంస్థల అదనపు తోడ్పాటుతో లక్షల కుటుంబాలు రిటైల్‌ వ్యాపారాలను ఏర్పాటు చేసుకున్నాయి.

+ పొదుపు సంఘాలకు జీవం..
రాష్ట్రంలో 10.67 లక్షల పొదుపు సంఘాలు ఉండగా దాదాపు 1.03 కోట్ల మంది మహిళలు వీటిల్లో సభ్యులుగా ఉన్నారు. టీడీపీ హయాంలో డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా చంద్రబాబు వంచించడంతో పొదుపు సంఘాల వ్యవస్థ కుప్పకూలింది. జీరో వడ్డీ పథకానికి నిధుల విడుదలను సైతం చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో నిరర్థక ఆస్తులుగా మారాయి. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌ ఆసరా పథకంతో పాటు జీరో వడ్డీ పథకానికి సీఎం జగన్‌ ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేయడంతో పొదుపు సంఘాలు గాడిన పడ్డాయి. ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 99 శాతం మంది పొదుపు మహిళలు బ్యాంకు రుణాలను సకాలంలో చెల్లిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement