సాక్షి,హిందూపురం(అనంతపురం): ఐదు నుంచి ఆరు అంగుళాల గోధుమ వర్ణంతో వంపు తిరిగిన పొడవాటి ముక్కు.. తెలుపు రంగులో మెడ, తల, వీపు.. ఎరుపు, గుళాబీ మిళితమైన రెక్కల కొనలు.. రెక్కల మధ్య, మెడ కింద ముదురు ఆకుపచ్చ రంగు, కాళ్లు తొడల వరకు తెలుపు రంగుతో కూడిన పక్షులు చిలమత్తూరు మండలం వీరాపురంలో సందడి చేస్తున్నాయి. ఇవి రష్యా దేశంలోని సైబీరియన్ ప్రాంతానికి చెందిన స్టార్క్ పెయింటెడ్ పక్షులు. సమ శీతోష్ణస్థితి కలిగిన ప్రాంతాల్లో జీవించే ఈ పక్షులు సంతానోత్పత్తి కోసం వేల మైళ్ల దూరం నుంచి ఏటా వీరాపురం వస్తుంటాయి.
ముందుగా జనవరిలోనే కొన్ని పక్షులు వచ్చి ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తాయి. అనుకూలంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత తమ దేశానికి వెళ్లి మిగతా పక్షులతో తిరిగి వస్తాయి. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిసిన నేపథ్యంలో వీరాపురంతో పాటు వెంకటాపురం, పరిసర ప్రాంతాల చెరువుల్లో నీరు చేరింది. అటవీ శాఖ అధికారులు చెరువుల్లోకి చేప పిల్లలను సైతం వదిలారు. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి నెలలోపు ఇక్కడకు పక్షులు వలస వచ్చి చెట్లపై నివాసాలు ఏర్పాటు చేసుకుని సందడి చేస్తున్నాయి. నెలరోజుల తర్వాత ఆడ పక్షి మూడు లేదా నాలుగు గుడ్లు పెడుతుంది. గుడ్ల వద్ద ఒక పక్షి కాపలా ఉంటే.. మరో పక్షి ఆహారం సేకరించుకుని వస్తుంది. ఆరు నుంచి ఎనిమిది వారాల వ్యవధిలో గుడ్లు పొదుగుతాయి. రెండు నెలలు పాటు పిల్లలకు ఆహారం అందజేస్తాయి. పిల్ల పక్షులు ఎగిరే దశకు చేరుకున్నాక అవే ఆహారం కోసం వెళ్లి వస్తాయి. సంతానం ఎదిగిన తర్వాత అన్నీ కలిసి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ లోపు తిరిగి స్వస్థలానికి వెళ్లిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment