పోల‘వరం’ మరో నాలుగేళ్లకే | Andhra Pradesh CM Chandrababu Naidu Visits Polavaram Project, More Details Inside | Sakshi
Sakshi News home page

పోల‘వరం’ మరో నాలుగేళ్లకే

Published Tue, Jun 18 2024 3:17 AM | Last Updated on Tue, Jun 18 2024 12:26 PM

Andhra CM Chandrababu Naidu visits Polavaram Project

అదీ అంతా సవ్యంగా జరిగితేనే పూర్తి: సీఎం చంద్రబాబు 

రూ.13,683 కోట్లు ఖర్చు చేసి 72 శాతం పూర్తి చేశా 

పనులు వేగంగా జరిగి ఉంటే 2020 నాటికి పూర్తయ్యేది 

డయాఫ్రమ్‌ వాల్‌ నాలుగు చోట్ల దెబ్బతింది 

మరమ్మతులకే రూ.447 కోట్లు ఖర్చవుతుంది 

సమాంతరంగా కొత్తగా నిర్మిస్తే రూ.996 కోట్ల వ్యయం

సాక్షి ప్రతినిధి, ఏలూరు:  పోలవరం పూర్తి కావాలంటే మరో నాలుగు సీజన్లు అంటే నాలుగు సంవత్సరాలు పడుతుందని అధికారులు చెబుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అది కూడా అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలు ప్రాజెక్టుకు శాపాలుగా మారాయని ఆరోపించారు.  సోమవారం పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం చంద్రబాబు ఎంపిక చేసిన మీడియాతో మాట్లా­డారు. తొలుత స్పిల్‌వే బ్లాక్‌–26 వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. గైడ్‌ బండ్, గ్యాప్‌ 1, 2, 3, డీఎస్‌ఈడీ పవర్‌ హౌస్‌ డౌన్‌ స్ట్రీమ్, అప్‌ స్ట్రీమ్‌లో జరుగుతున్న పనులను పరిశీలించి  ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు.   

నా దూరదృష్టితో ముంపు మండలాల విలీనం
పోలవరాన్ని చూస్తే బాధ, ఆవేదన కలుగుతోందని.. ప్రాజెక్టును ఏపీకి జీవనాడిగా భావించామని చంద్రబాబు చెప్పారు. తాను 2014లో గెలిచిన తరువాత దూరదృష్టితో తెలంగాణకు చెందిన ఏడు ముంపు మండలాలను కేంద్ర ఆర్డినెన్స్‌ ద్వారా ఏపీలో విలీనం చేయగలిగినట్లు తెలిపారు. అప్పటికే పోలవరం చాలా సంక్షోభాల్లో ఉందన్నారు. 2005లో వైఎస్సార్‌ ప్రారంభించిన ప్రాజెక్టు పనుల్లో అనేక ఆరోపణలు వచ్చాయన్నారు.  రాష్ట్ర విభజన అనంతరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారన్నారు. ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తుతో ఉంటే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, అయితే ఆ ఎత్తు తగ్గించడానికి ప్రయతి్నంచారని ఆరోపించారు.

స్పిల్‌వే ద్వారా 50 లక్షల క్యూసెక్కులు వెళ్లేలా డిజైన్‌ చేశామన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌ అయిన పోలవరాన్ని గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. చైనాలోని త్రీ గోర్జెస్‌ కన్నా అధిక స్థాయిలో నీటి విడుదల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు ఇదేనన్నారు. 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, 320 టీఎంసీల వరకు వరద నీటిని వినియోగించుకోగలిగిన అవకాశం ఈ ప్రాజెక్టుకు ఉందన్నారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు పోలవరం పనులను తాను వేగవంతం చేశానని, ప్రాజెక్టుపై 100కి పైగా సమీక్షలు, 31 సార్లు  క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించినట్లు చెప్పారు. పోలవరంతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడా కరువు కనపడదన్నారు.  

రివర్స్‌ టెండరింగ్‌తో ఆగిపోయింది
గతంలోనే తమ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,683 కోట్లు ఖర్చు చేసి 72 శాతానికి పైగా పూర్తి చేసిందని, అదే వేగంతో పనులు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికే పూర్తయ్యేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌తో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేసిందన్నారు. ఇరిగేషన్‌ కేటాయింపులు రూ.7,100 కోట్లకు తగ్గించి అది కూడా కాంట్రాక్టర్లకు అడ్వాన్సులుగా చెల్లించారన్నారు. తమ హయాంలో రూ.446 కోట్లతో డయాఫ్రమ్‌ వాల్‌ నిరి్మంచామని చెప్పారు. గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పూర్తి చేయనివ్వకుండా కాంట్రాక్టర్, ఇంజనీరింగ్‌ సిబ్బందిని మార్చడం లాంటి చర్యలకు పాల్పడిందన్నారు.

కేంద్ర జలసంఘం అధికారులు వారించినా పెడచెవిన పెట్టిందన్నారు. 2019, 2020లో అధిక వర్షాల కారణంగా డయాఫ్రమ్‌ వాల్‌కు నాలుగు చోట్ల న­ష్టం వాటిల్లడంతో 35 శాతం దెబ్బతిందని చెప్పారు. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌కు మరమ్మతులు చే­యాలంటే రూ.447 కోట్లు ఖర్చవుతుందని, దానికి సమాంతరంగా మళ్లీ కొత్తగా నిరి్మంచాలంటే రూ.996 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు. రెండు కాఫర్‌ డ్యాంలు రూ.550 కోట్లతో నిర్మించారని, కొంతమేర కాఫర్‌ డ్యామ్‌ కట్టకపోవడం వల్ల వరద తాకిడికి డయా ఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిందని చంద్రబాబు పేర్కొన్నారు. కాఫర్‌ డ్యామ్‌ గ్యాప్‌ నిర్మాణానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. కాఫర్‌ డ్యామ్‌కు సీపేజ్‌­లు ఉన్నాయని, వరదలు వస్తే మరింత నష్టం కలుగుతుందని చెప్పారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని గత ప్రభుత్వం వృథా చేసిందని ఆరోపించారు.   

ఇది క్షమించరాని నేరం
రాజకీయాలకు పనికిరాని వ్యక్తి పాలించడం రాష్ట్రానికి ఎలా శాపంగా మారుతుందో చెప్పేందుకు గత ముఖ్యమంత్రి ఒక ఉదాహరణగా మిగులుతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్షమించరాని ఇన్ని తప్పిదాలు చేసిన గత ప్రభుత్వంపై ఏ చర్యలు తీసు­కోవాలో ప్రజలే తెలియజేయాలన్నారు. పోలవరం పనులను ఎంత సంక్లిష్టం చేయాలో అంతా చేసి ప్రాజెక్ట్‌ను పనికిరాకుండా చేశారని విమర్శించారు. ఇది క్షమించరాని నేరమన్నారు. అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేదన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పుట్టా మహేష్‌ యాదవ్, ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శశిభూషణ్‌ కుమార్, ఇరిగేషన్‌ శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టర్‌ వె.ప్రసన్న వెంకటే‹Ù, ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.  

‘సాక్షి’కి నో ఎంట్రీ 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం వద్ద అధికారికంగా నిర్వహించిన విలేకరుల సమావేశానికి ‘సాక్షి’తో పాటు మరో మూడు ఛానళ్లకు అనుమతి లేదని ఐ అండ్‌ పీఆర్‌ అధికారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఉన్నత స్థాయి నుంచి తమకు ఆదేశాలు అందాయని, జాబితా ప్రకారం సాక్షి మీడియా, 10 టీవీ, ఎన్‌ టీవీ, టీవీ 9లకు అనుమతులు లేవని చెప్పారు. కాగా, యూట్యూబ్‌ ఛానళ్లకు, స్థానిక పత్రికలకు పాస్‌లు ఇచ్చినప్పటికీ వారిని కూడా అనుమతించలేదు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు దఫాలు పోలవరంలో పర్యటించగా అధికారిక కార్యక్రమాలకు ప్రతి పత్రిక, ఛానల్‌ను అనుమతించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement