‘సౌర విద్యుత్‌’లో ఏపీ మరో ఘనత | Andhra Pradesh another achievement in solar power | Sakshi
Sakshi News home page

‘సౌర విద్యుత్‌’లో ఏపీ మరో ఘనత

Published Thu, Jan 13 2022 5:20 AM | Last Updated on Thu, Jan 13 2022 5:20 AM

Andhra Pradesh another achievement in solar power - Sakshi

సాక్షి, అమరావతి: సోలార్‌ పార్కుల అభివృద్ధికి రూ.580.80 కోట్లు కేటాయించి దేశంలో అగ్ర రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సాధించింది. సౌర విద్యుత్‌ స్థాపిత సామర్ధ్యంలో దేశంలోనే మూడో అతి పెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందింది. మెర్కామ్‌ ఇండియా రీసెర్చ్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలో 2021 డిసెంబర్‌ చివరి నాటికి క్యుములేటివ్‌ యుటిలిటీ స్కేల్‌ సోలార్‌ ఇన్‌స్టలేషన్‌లు 41.5 గిగావాట్లుగా ఉన్నాయి. డిసెంబరు 2021 నాటికి 8.9 గిగావాట్ల స్థాపిత సామర్థ్యంతో యుటిలిటీ స్కేల్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌లలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉంది.

కర్ణాటక 7.5 గిగావాట్లతో రెండవ స్థానంలో నిలిచింది. 4.3 గిగావాట్ల స్థాపిత సామర్ధ్యంతో ఏపీ మూడో స్థానంలో ఉంది. 4 గిగావాట్ల సామర్థ్యంతో తమిళనాడు 4వ స్థానంలో, 3.9 గిగావాట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ అయిదో స్థానంలో ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది. దేశం మొత్తం స్థాపిత సౌర విద్యుత్‌ సామర్ధ్యంలో 10 శాతానికి పైగా వాటాను రాష్ట్రం దక్కించుకుంది. అయితే అంతరించిపోతున్న గ్రేట్‌ ఇండియన్‌ బస్టర్డ్‌ పక్షులను రక్షించాల్సిన అవసరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాజస్థాన్‌లో రాబోయే ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు. ఈ పక్షి  కొన్ని పవర్‌ ప్రాజెక్టుల ప్రాంతాలలో నివాసం ఉంటుంది. అందువల్ల అక్కడి ప్రాజెక్టులు ఆలస్యమైతే ఏపీలో ఇటువంటి ప్రాజెక్టులు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. 

సౌర విద్యుత్‌కు ఏపీ ప్రాధాన్యం
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సౌర విద్యుత్‌కు అధిక ప్రాధాన్యమిస్తోంది. సోలార్‌ పార్కుల ఏర్పాటుకు అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలిచినట్లు ఇటీవల కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, కర్ణాటక ఉన్నాయి. వ్యవసాయానికి, ఇతర అవసరాలకు నాణ్యమైన సౌర విద్యుత్‌ సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈసీఐ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతి పొందాయి.

వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు ఉచిత విద్యుత్తును శాశ్వత పథకంగా మార్చడంలో భాగంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రైతులకు పగటిపూట 9 గంటలు విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49 పైసలు చొప్పున ఇచ్చేందుకు ఏడాదికి 7 వేల మెగావాట్ల విద్యుత్తును పాతికేళ్ళపాటు కొనుగోలు చేయనుంది. ఈ చర్యతో భవిష్యత్తులో ఏపీ స్థానం మరింత మెరుగుపడుతుందని అధికారులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement