సాక్షి, అమరావతి: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన ఐ డ్రాప్స్(కంటి చుక్కల మందు) ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ 15 ల్యాబ్‌లు నివేదిక ఇచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. ఐ డ్రాప్స్‌లో పీహెచ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వివరించారు. ఆ మందు వినియోగానికి అనుగుణంగా లేదన్నారు. దీనిపై ఆనందయ్య తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ స్పందిస్తూ.. కౌంటర్ దాఖలు చేసేందుకు అనుమతి కోరారు. ఇందుకు హైకోర్టు అనుమతినిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
తాను తయారు చేసిన మందుల పంపిణీకి అనుమతినిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆనందయ్య గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అభ్యర్థనతో మరికొందరు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని ధర్మాసనం గురువారం విచారించింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ, ఐ డ్రాప్స్ గురించి పలు ల్యాబ్‌లు ఇచ్చిన నివేదికను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఆనందయ్య న్యాయవాది అశ్వనీకుమార్ స్పందిస్తూ, కరోనా వల్ల ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన వారికి ఈ కంటి చుక్కల మందు ఎంతో ఉపయోగకరమన్నారు.
ఈ మందు విషయంలో ఆయుష్ శాఖ ఆనందయ్యతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. సీజే స్పందిస్తూ.. సంప్రదాయ మందులను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదన్నారు. వేటి విలువ వాటికి ఉంటుందని వ్యాఖ్యానించారు. తనకు రెండు రోజుల పాటు తలనొప్పి వల్ల కలిగిన ఇబ్బంది.. ఓ ప్రాంత సాంప్రదాయ మందు ద్వారా తొలగిందని చెప్పారు. అనంతరం కౌంటర్ దాఖలుకు అనుమతిస్తూ.. ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
Anandaiah Eye Drops: ఐ డ్రాప్స్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు
Published Fri, Jul 2 2021 5:26 AM | Last Updated on Fri, Jul 2 2021 11:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment