మండపేటలోని టిడ్కో ఇళ్లు
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. కోనసీమ జిల్లా మండపేట పురపాలక సంఘం పరిధిలో నిర్మించిన ఇళ్లలో 2,720 యూనిట్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ నెల 15న మంగళగిరి పరిధిలో, 21న జీవీఎంసీలో కూడా ఇళ్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లుచేశారు.
వీటితోపాటు తెనాలి, పొన్నూరు, చిలకలూరిపేట నంద్యాలతోపాటు మొత్తం తొమ్మిది పట్టణాల్లో 20,176 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 23న విజయనగరంలో ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆగస్టు నాటికి 39,820 యూనిట్లను టిడ్కో అధికారులు అందజేశారు. అలాగే, సెప్టెంబర్‌లో ఆదోనిలో 2,500, ఎమ్మిగనూరులో రెండువేల యూనిట్లను పంపిణీ చేశారు.
నిజానికి వర్షాల కారణంగా పంపిణీ ఆలస్యమైనా ఆ తర్వాత నిర్మాణాలు పూర్తిచేసుకున్న చోట అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో మౌలిక వసతులు కల్పించి నెలన్నర వ్యవధిలో 39,820 యూనిట్లను పంపిణీ చేశారు. మొత్తం రెండు నెలల వ్యవధిలో 44,320 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. ఈ నెలలో మరో 20,176 యూనిట్లను అందించనున్నారు.
గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది నిర్మాణం
మరోవైపు గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంచేసిన టిడ్కో ఇళ్ల పథకాన్ని ప్రస్తుత వైఎస్సార్ సీపీ సర్కారు పునరుద్ధరించి 88 పట్టణ స్థానిక సంస్థల్లో 2,62,216 ఇళ్లను జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మాణం చేపట్టింది. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంగల 1,43,600 ఇళ్లను ఒక్క రూపాయికే అందించడంతో పాటు వీటికయ్యే ఆర్థిక భారం రూ.3,805 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. ఇక 365 చ.అ., 430 చ.అ. విస్తీర్ణం కలిగిన 1,18,616 ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేస్తోంది.
అంతేకాక, లబ్ధిదారులు అందరికీ ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకు దాదాపు రూ.1,000 కోట్లను ప్రభుత్వమే భరించి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తోంది. టిడ్కో ఇళ్ల పత్రాలు, తాళాలు గృహ సముదాయ ప్రాంగణాల్లోనే అందజేస్తున్నామని, ఇకపైనా అదే విధానం కొనసాగుతుందని టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. అక్టోబర్ నెల పంపిణీ ప్రక్రియ మండపేట నుంచి ప్రారంభించామని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ చెప్పారు. ఇళ్ల పంపిణీ ప్రాంగణంలోనే ఇంటి తాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
పేదలకు అండగా ప్రభుత్వం..
గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయకుండా వదిలేసింది. మా ప్రభుత్వం 2.62 లక్షల ఇళ్లల్లో 1.43 లక్షల యూనిట్లు నిరుపేదలకు చెందినవే. వీటికి గత పాలకులు ఒక్కో యూనిట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి, బ్యాంకు రుణాలు మంజూరు చేశాక, ప్రతి నెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని చెప్పింది.
అలా చెల్లిస్తే ఒక్కొక్కరు మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. 1.43 లక్షల మందిపైనా సుమారు రూ.10 వేల కోట్లకు పైగా భారం పడుతుంది. కానీ, సీఎం వైఎస్ జగన్ 300 చ.అ. ఇళ్లను ఒక్క రూపాయికే ఇచ్చారు. అంతేకాక.. రూ.6 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. డిసెంబర్ నాటికి మొత్తం 2.62లక్షల యూనిట్లను అందజేస్తాం.
– డాక్టర్ ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment