సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ముఖ్యమంత్రిని, కులాలను అవమానించి, వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించినందుకు నర్సాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజుపై సుమోటోగా నమోదు చేసిన కేసులో సీఐడీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. ఇదే విషయాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున దర్యాప్తును అడ్డుకోవడంలేదని చెప్పింది.
రఘురామకృష్ణరాజు తదితరులపై సీఐడీ నమోదు చేసిన కేసులో దేశద్రోహం సెక్షన్‌ను మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, మిగిలిన సెక్షన్ల కింద సీఐడీ చేసే దర్యాప్తునకు సహకరించాలని నిందితులను ఆదేశించిందని హైకోర్టు గుర్తు చేసింది. ఇదే కేసులో ఏబీఎన్, టీవీ 5 యజమానులపైనా దర్యాప్తు కొనసాగించవచ్చని సీఐడీకి స్పష్టంచేసింది. సీఐడీ చేతిలో ప్రాణహాని ఉందని రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో ఆయన్ని హైదరాబాద్‌లోని దిల్‌కుషా అతిథి గృహంలో విచారించాలని ఆదేశించింది.
ఆయన్ని ఇతర నిందితులతో కలిపి విచారించాలనుకుంటే 15 రోజుల ముందు నోటీసు ఇవ్వాలని తెలిపింది. రఘురామకృష్ణరాజు ఎంపిక చేసుకున్న న్యాయవాది సమక్షంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, వీడియో తీయాలని చెప్పింది. కేసుకు సంబంధించిన విషయాలకే విచారణను పరిమితం చేయాలని స్పష్టంచేసింది.
ఆయన హృద్రోగి అని చెబుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు చెప్పింది. ఆయన భద్రతా సిబ్బందిని విచారణ ప్రాంగణం వెలుపలి వరకు అనుమతించాలంది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాన్ని తేల్చాల్సి ఉన్నందున, దర్యాప్తు పూర్తి చేసిప్పటికీ, చార్జిషీట్ దాఖలు చేయవద్దని సీఐడీని ఆదేశించింది. ఈ ఆదేశాల అమలులో ఏదైనా ఉల్లంఘన జరిగితే, అందుకు బాధ్యులైన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. తదుపరి విచారణను ఆగస్టు 24కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
వేదికపై తీవ్ర చర్చ
సీఐడీ కేసును కొట్టేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ రాయ్ బుధవారం మరోసారి విచారించారు. విచారణ కోసం ఓ తటస్థ ప్రాంతాన్ని ఎంపిక చేసి, తమకు చెప్పాలని సీఐడీని, రఘురామకృష్ణరాజును న్యాయమూర్తి ఇంతకు ముందు ఆదేశించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ విషయంపై ఇరుపక్షాల మధ్య చర్చ జరిగింది. రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌ను ప్రతిపాదించారు.
అందుకయ్యే వ్యయాన్ని భరిస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనను సీఐడీ తరఫు న్యాయవాది వైఎన్ వివేకానంద వ్యతిరేకించారు. న్యాయమూర్తి సైతం ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేయలేదు. పోలీసు అధికారుల మెస్ లేదా దిల్‌కుషా అతిథి గృహాన్ని వివేకా ప్రతిపాదించారు. పోలీసు అధికారుల మెస్‌కన్నా అతిథి గృహమే మేలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. చివరకు దిల్‌కుషా అతిథి గృహాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment