ఏ గుండె తట్టినా ఆవేదనా స్వరాలే.. | Andhra Pradesh: At least 17 killed in reactor blast at a pharma company in Anakapalli district | Sakshi
Sakshi News home page

ఏ గుండె తట్టినా ఆవేదనా స్వరాలే..

Published Fri, Aug 23 2024 5:24 AM | Last Updated on Fri, Aug 23 2024 5:24 AM

Andhra Pradesh: At least 17 killed in reactor blast at a pharma company in Anakapalli district

కన్నీటి చారికలతో కేజీహెచ్‌లో విషాద వాతావరణం

సాక్షి, విశాఖపట్నం/మహరాణిపేట: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా పరిశ్రమలో విస్ఫోటం 17 మంది ఊపిరితీసింది. యాజమాన్య నిర్లక్ష్యం మృత్యు రూపంలో చేసిన విలయతాండవం ఆ కుటుంబాల ఉసురుతీసింది. ఉత్సాహంగా ఉద్యో­గానికి వెళ్లిన తమవారిని.. ఆఖరిచూపు చూసుకునేందుకు కేజీహెచ్‌కు వచ్చిన కుటుంబ సభ్యుల రోద­నలతో.. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపించాయి. కన్నీటి చారికలతో కేజీహెచ్‌లో విషాద వాతావరణం అలముకుంది.

ప్రేమ పెళ్లి చేసుకుని నిండుచూలాల్ని వదిలేసి వెళ్లిపోయిన భర్త కోసం ఆ గర్భిణీ పడుతున్న వేదన కంట తడిపెట్టించింది.. మూడ్రోజుల క్రితం రాఖీ కట్టించుకున్న అన్నయ్య భరోసా ఇకపై ఉండదా అంటూ సోదరి రోదన సాగర ఘోషని మించిపోయింది.. ఉద్యోగమొచ్చింది, కష్టాలు తీరిపోయినట్లే అమ్మా అని భరోసా ఇచ్చిన కొడుకు.. కళ్ల ముందు ఇకపై ఉండవా నాన్నా.. అంటూ తల్లడిల్లుతున్న తల్లిని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు.

ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 17 మందిని పొట్టన పెట్టుకున్న మృత్యు పరిశ్రమ ఆ కుటుంబ సభ్యులకు అంతులేని వేదనని మిగిల్చింది. చివరికి.. పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన ఆ కుటుంబాలు.. తమ వారి శవ పంచనామా కోసం, ప్రభుత్వం అందించే భరోసా కోసం కూడా ఎదురుచూడాల్సిన దయనీయ పరిస్థితులు విశాఖ కేజీహెచ్‌లో సాక్షాత్కరించాయి. భారమైన గుండెలతో.. తమ వాళ్ల నెత్తుటి ముద్దల కోసం ఎదురుచూస్తున్న ఏ కుటుంబాన్ని చూసినా.. విషణ్ణ వదనాలే కనిపించాయి. ఏ గుండెను కదిలించినా ఆవేదనా స్వరాలే వినిపించాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదం.

రెండు కళ్లల్లో ఒక కన్ను పోయింది.. 
అన్నదమ్ములిద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఒకరు పని ముగించుకుని బయ­టకొస్తే ఇంకొకరు పనికి కంపెనీలోకి వెళ్లారు. ఎప్పుడూ జనరల్‌ డ్యూటీకి వెళ్లే పూడి మోహన్‌ దుర్గాప్రసాద్‌ బుధవారం బి.షిఫ్ట్‌కు వెళ్లాడు. కొద్దిసేపటికి భారీ విస్ఫో­టం సంభవించి అన్న పూడి మోహ­న్‌ దుర్గా­ప్రసాద్‌ చనిపోయాడు. ఈ విషయం తెలిసిన ఆ కుటుంబం తల్లడి­ల్లిపోయింది. ‘మాకున్న రెండు కళ్లలో ఒక కన్నుపోయింది. ఇప్పుడె­లా?’.. అంటూ మృతుడి తల్లిదండ్రులు శ్యామ­ల, సూర్యారావు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఒక్కో కథ.. కన్నీటి వ్యధ 
అనకాపల్లి జిల్లాలోని సెజ్‌ ఎసైన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీకులు ఆస్పత్రి వద్ద రోదిస్తున్న తీరు అక్కడున్న వారికి కంటతడిపెట్టిస్తోంది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోయే వ్యక్తి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా...మరొక మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. వీరి కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.. ప్రమాదంలో మరణించిన కొంతమంది మృతుల గురించి ‘సాక్షి’ సేకరించిన వివరాలు..     – అనకాపల్లి/ఎస్‌.రాయవరం

పెళ్లై ఆరు నెలలు.. భార్య గర్భవతి 
ఫార్మా ప్రమాదంలో మరణించిన ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి యువకుడు జవ్వాది చిరంజీవికి 6 నెలల క్రితం పెళ్లయింది. అతని భార్య గర్భవతి. ఈ ఘటన ఆ కుటుంబాన్ని కోలుకోలేని స్థితికి తీసుకెళ్లింది. పెళ్లికి ముందు ఒడిశాలో ఉద్యోగం చేసుకుంటున్న చిరంజీవి, ఇటీవల అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ఫిట్టర్‌గా చేరాడు. ఎక్కువగా జనరల్‌ షిప్‌్టకి వెళ్లే చిరంజీవి, బుధవారం బి షిఫ్ట్‌కి వెళ్లాడు. విధుల్లో చేరుతుండగా ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే మరణించాడు. మృతుడిపైనే భార్య, తల్లి ఆధారపడి జీవిస్తున్నారు.

కొండంత ఆసరా అనుకున్నాం
ఫార్మా ప్రమాదంలో మరణించిన బంగారంపాలేనికి చెందిన పూసర్ల వెంకటసాయి తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు. తండ్రి ఆటో నడుపుతూ, తల్లి టైలరింగ్‌ చేసుకుంటూ వెంకటసాయిని చదివించారు. చదువు పూర్తై, ఇటీవల ఫార్మా కంపెనీలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరా­డు. అమ్మానాన్నలను తానే చూసుకుంటానని చెప్పేవాడు. అంది వచి్చన కొడుకు అనంత లోకాలకు చేరడంతో ఆ తల్లిదండ్రుల రోదన గ్రామస్తుల్ని కన్నీరు పెట్టిస్తోంది. మృతుడు వెంకటసాయికి ఇంకా వివాహం కాలేదు.

సెపె్టంబర్‌ 5న పెళ్లి..ఇంతలోనే.. 
జావాది పార్థసారథి మా మనవడు. మాది పార్వతీపురం మన్యం జిల్లా, డోకిశిల పంచాయతీ, చలమలవలస. పార్థసారథికి సెపె్టంబర్‌ 5న వివాహం. నిన్ననే బట్టలు కొన్నాం. పావు తక్కువ రెండు వరకు మాతో మాట్లాడాడు. పనిలోకి వెళ్తున్నానని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాడు. వెళ్లిన అరగంటలోనే ఇలా అయిపోయింది. రాత్రి 7 గంటలకు గానీ మాకు సమాచారం లేదు. యాజమాన్యం మాకు ఏమీ చెప్పలేదు. మా ఎమ్మార్వో ద్వారా వీఆర్వో మాకు చెప్పాడు. మా ఊరి నుంచి 6 గెడ్డలు దాటుకుని, పార్వతీపురంలో కారు బుక్‌ చేసుకుని బయల్దేరితే రాత్రి 11 గంటలకు ఇక్కడికి చేరుకున్నాం. మృతదేహం ఎక్కడుందో తెలీదు. అడిగితే.. ఎవరి నుంచీ సరైన సమాధానం రావట్లేదు. అధికారులు, నాయకులూ ఎవరూ పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు.     – జావాది శ్రీరాములనాయుడు, మృతుడి తాతయ్య

ఫ్యాక్టరీలో చేరి నెలన్నరే..
మాది అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం పాశర్లపూడి లంక. నా భర్త సతీష్‌ ఈ ఫ్యాక్టరీలో చేరి నెలన్నరే అయింది. మా పెళ్లయి మూడేళ్లు. పిల్లలు లేరు. తొలి జీతం అందుకుని, ఇంటికి పంపించి ఇక నుంచి అంతా మంచిగానే ఉంటుందని సంతోషంగా చెప్పారు. ప్రమాద విషయాన్ని కంపెనీ యాజమాన్యం, అధికారులు చెప్పలేదు. నా భర్త ఫ్రెండ్స్‌ మా మరిదికి చెప్పారు. ముందు సీరియస్‌గా ఉంది వెంటనే వచ్చేయమన్నారు. మేము ఓ 20 కి.మీ. వచ్చాక ఫోన్‌ చేస్తే చనిపోయినట్లు చెప్పారు. కారు పురమాయించుకుని రాత్రి 1.30కు కేజీహెచ్‌కు వచ్చాం. ఇక్కడ అందరినీ బతిమాలగా 2.30కు లోపలికి పంపించారు. ఆయన చేతులు, ముఖం, తల బాగా కాలిపోయింది. భవిష్యత్తును తలచుకుంటే భయమేస్తోంది.     – సాయిశ్రీ, మృతుడు సతీష్‌ భార్య, పాశర్లపూడిలంక

ప్రేమించి ఇప్పుడెలా వెళ్లిపోయావ్‌?
‘ప్రేమించావ్‌.. పెళ్లి చేసుకు­న్నావ్‌.. ఒక్క క్షణం వదిలిపెట్టను అని అన్నావు కదా.. ఇప్పుడు నన్నొదిలి ఎలా వెళ్లిపోవాలనిపించింది నీకు. పిల్లలంటే ప్రాణమన్నావ్‌. మన బిడ్డ పుట్టకుండానే వెళ్లిపోయావా. రేపు మన బిడ్డ నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలి. టైర్‌ పంక్చరైందని ఫోన్‌చేస్తే వచ్చేసెయ్‌ అని చెప్పాను. కానీ, శాలరీ కట్‌ అవుతుందని వెళ్లిపోయావ్‌. ఇందుకేనా..’ అంటూ తన భర్త జవ్వాది చిరంజీవిని ప్రమాదంలో కోల్పోయి ఆరునెలల గర్భంతో కన్నీరుమున్నీరవు­తున్న లీలాదేవిని ఓదార్చడం ఎవ్వరితరం కాలేదు.

‘ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లాక ఫోన్‌చేసి మాట్లాడతాడు. కానీ, ఆ రోజు ఫోన్‌ రాలేదు. నేను చేస్తే ఎత్తలేదు. ఏం జరిగిందోనన్న ఆందోళనలో ఉన్నప్పుడు ఇంట్లో అందరూ టీవీ చూసి కంగారుపడ్డారు. ఎవరూ ఏం చెప్పలేదు. ఎందుకు ఫోన్‌ ఎత్తడంలేదని అడిగితే రకరకాలుగా చెప్పారు. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారంలేదు. ఏం జరిగిందో తెలీదు. ‘ఏమండి.. మా ఆయన్ని ఒక్కసారి చూడనివ్వండి. మీ కాళ్లు పట్టుకుంటాను’..

పెళ్లి ముచ్చట తీరకుండానే.. 
‘కన్నా.. మేమంతా నీ మీదే ఆధారపడి బతుకుతున్నామని తెలుసు కదా. ఉద్యోగం వచ్చింది. ఇక మనకు కష్టాలు తీరిపోయాయని చెప్పావు. ఇప్పుడేమో.. భగవంతుడు కూడా తీర్చలేని కష్టంలోకి మమ్మల్ని నెట్టేసి ఎలా వెళ్లిపోయావు? పెళ్లి చేసేద్దామని అనుకున్నాం కదా.. నువ్వు కూడా సరే అన్నావు. ఆ ముచ్చట తీరకుండా మమ్మల్ని అనాథలు చేసేశావా కొడుకా’.. అంటూ రాజశేఖర్‌ తల్లిదండ్రులు పైడి ధర్మారావు, తులసమ్మ కన్నీరుమున్నీరవుతున్నారు.

పైడి రాజశేఖర్‌ (22) స్కూలు, కాలేజీలో టాపర్‌. బీటెక్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన రాజశేఖర్‌ క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాడు. ఇటీవలే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైనా రెండింటికీ ఇంకా జాయినింగ్‌ ఆర్డర్‌ రాకపోవడంతో రెండునెలల క్రితమే ఎసైన్షియాలో ప్రాసెస్‌ ఇంజినీర్‌గా చేరాడు. మూడ్రోజుల క్రితం చెల్లెలు రాఖీ కూడా కట్టింది. నిజానికి..  రాజశేఖర్‌ బుధవారం మధ్యాహ్నం షిఫ్ట్‌కి వెళ్లాల్సి ఉంది. కానీ, రాత్రికి స్నేహితుడి పెళ్లి ఉండడంతో ఉదయానికి మార్చుకుని విగతజీవిగా మారాడు.

మేమెలా బతకాలి కొడకా? 
‘మాకు ఆధారం నువ్వే కదా నాయనా.. మీ అమ్మ, నేను ఇప్పుడెలా బతకాలి. నీ జీతం మీదే మన కుటుంబం ఆధారపడి బతుకుతోంది. నీ మీదే ఆశలు పెట్టుకున్న మేం ఇప్పుడెలా జీవించాలి’.. అంటూ మహంతి నారాయణ తండ్రి సత్యం కన్నీరుమున్నీరవుతున్నారు. ‘ప్రమాదంపై కంపెనీ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. అక్కడ ఇక్కడ చూసి, టీవీల్లో వస్తున్న కథనాలను చూసిన తర్వాత రాత్రి తెలిసింది. ఇక్కడకొచ్చి విగతజీవిగా నిన్ను చూస్తుంటే బతకాలనిపించడం లేదు’..అంటూ రోదించారు.

ఇప్పుడు నా కుటుంబానికి దిక్కెవరు? 
నా భర్త ఏమైయ్యాడో తెలియని పరిస్థితి, విధి నిర్వహణకు వెళ్లిన వ్యక్తి ఫోన్‌ చేస్తే ఫోన్‌ ఎత్తడంలేదు. ఏం జరిగిందో తెలీదు. కంపెనీ నుంచి ఎలాంటి సమాచారంలేదు. నాకు నాలుగేళ్ల బాబు, రెండు నెలల పాప వుంది. ఏం జరిగిందో నాకూ, నా కుటుంబ సభ్యులకు తెలీక ఆందోళన చెందాం. రాత్రి 9 గంటల వరకు ఎలాంటి సమాచారం తెలీలేదు. భయపడి తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం. అర్థరాత్రి దాటిన తర్వాత ఎవరో చెప్పడంతో ఉదయం ఇక్కడకు వచ్చాం. తీరా వచ్చాక చూస్తే నా భర్త విగతజీవిగా పడి ఉన్నాడు. ఇప్పుడు నా కుటుంబానికి దిక్కెవరు’.. అంటూ చనిపోయిన హంస ప్రశాంత్‌ భార్య హంస జ్యోతి రోదన కంటతడి పెట్టించింది.

ఈ వయసులో ఒంటరిగా వదిలేశావా? 
ఏం భయంలేదే.. ఇంకొన్నేళ్లు పనిచేస్తే పింఛనొ­చ్చేస్తాది. దాంతో ఇద్దరం ప్రశాంతంగా బతుకుదాం. ఎవ్వరిమీదా ఆధారపడాల్సిన పనిలేదు అని చెప్పావు. ఇప్పుడేమో ఈ వయసులో ఒంటరిగా వదిలేశావా.. ఇప్పుడు నేనెలా బతకాలి.. ఎవరి కోసం బతకాలి.. ప్రమాదం జరిగిందని తెలీగానే నా గుండె ఆగినంత పనైంది. నీకేమైందో తెలీలేదు.

ఎవర్ని అడిగినా రాత్రి 11 గంటల వర­కూ చెప్పలేదు. ఇరుగుపొరుగు వారిని కనుక్కోమని కాళ్లావేళ్లా పడి బతిమాలి కంపెనీ దగ్గరికి వెళ్తే.. నన్నొదిలి వెళ్లిపోయావని చెప్పారు. ఎక్కడున్నావని అడిగితే కేజీహెచ్‌కు తీసుకొచ్చేశారని చెప్పారు. నిన్న డ్యూటీకెళ్లినప్పుడు నీ మొహం చూశాను. ఇప్పటివరకూ నువ్వు కనపడలేదయ్యా. నువ్వేసు­కున్న బట్టలు చూసి నిన్ను గుర్తుపట్టాను. ఇంక నేనెలా ఈ జీవితాన్ని ఈడుస్తాను? అంటూ వేగి అచ్చియ్యమ్మ తన భర్త సన్యాసినాయుడు (55) కోసం తలచుకుంటూ కుమిలిపోతోంది.

చాలా భయపడ్డాం..
నా కుమారుడు మహేశ్‌ ఎసైన్షియా కంపెనీ ఏసీ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే వాడికి ఫోన్‌ చేసినా స్పందన లేదు. చాలా భయపడ్డాం. మా బంధువులు నేరుగా ప్రమాద స్థలం వద్దకు చేరుకుని వెతికితే నా కుమారుడు గాయాలతో ఉన్నాడు. దీంతో అతడిని అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మెడికవర్‌ ఆస్పత్రికి మార్చారు. ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదన్నారు. ప్రభుత్వం అన్ని వి«ధాలా ఆదుకోవాలి. –మహాలక్ష్మి, క్షతగాత్రుడు మహేశ్‌ తల్లి

మెరుగైన వైద్యం అందించాలి
మా బంధువు దేముడు తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాం. చాలా సమయం వరకు అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో భయపడ్డాం. రాత్రి 12 గంటల సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్టు తెలిసింది. ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి.    –అప్పలరాజు, క్షతగాత్రుడు దేముడు బంధువు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement