శ్రీకాకుళం నుంచి మంత్రుల బస్సు యాత్ర | Andhra Pradesh Ministers bus Yatra from Srikakulam | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం నుంచి మంత్రుల బస్సు యాత్ర

Published Thu, May 26 2022 5:00 AM | Last Updated on Thu, May 26 2022 11:01 AM

Andhra Pradesh Ministers bus Yatra from Srikakulam - Sakshi

సాక్షి, అమరావతి: అమ్మ ఒడి, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లాంటి పథకాల ద్వారా విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబన కల్పించడం.. రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రాజకీయ, సామాజిక సాధికారత సాధించేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లుగా దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.

అధికారం చేపట్టాక తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఆ వర్గాలకే ఇచ్చి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌ పునర్‌వ్యవస్థీకరణ అనంతరం మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు వారికే కేటాయించారు. దేశ చరిత్రలో ఈ స్థాయిలో మంత్రి పదవులు ఆయా వర్గాలకు ఇవ్వడం ఇదే తొలిసారి. హోంమంత్రిగా ఎస్సీ మహిళను నియమించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌రాజును ఛైర్మన్‌గా, మైనార్టీ మహిళ జకియా ఖానంకు డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌గా అవకాశం కల్పించారు. గత మూడేళ్లలో రాష్ట్రం నుంచి ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా నాలుగు సీట్లను బీసీలకే ఇచ్చి సామాజిక న్యాయంపై చిత్తశుద్ధిని చాటుకున్నారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి 32 మంది సభ్యులుండగా  18 మంది (56.25 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కావడం గమనార్హం.  

స్థానిక సంస్థల్లో సింహభాగం.. 
స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించేలా చంద్రబాబు పురిగొల్పారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీసీల రిజర్వేషన్‌ 24 శాతానికి తగ్గిపోయింది. అయితే రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువ మంది బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌.. దాన్ని ఆచరించి చూపి పదవులు ఇచ్చారు. జడ్పీ ఎన్నికల్లో 13 జిల్లా పరిషత్‌లను వైఎస్సార్‌సీపీ దక్కించుకోగా తొమ్మిది జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ పదవులను (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు.

మండల పరిషత్‌ ఎన్నికల్లో 648 మండలాలకు గాను వైఎస్సార్‌సీపీ 635 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను సాధించగా 67 శాతం పదవులను ఆ వర్గాలకే ఇచ్చారు. 13 కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేయగా ఏడు చోట్ల మేయర్‌ పదవులు బీసీలకే కేటాయించారు. మొత్తంగా మేయర్‌ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇచ్చారు. 87 మున్సిపాల్టీల్లో 84 మున్సిపాల్టీలను వైఎస్సార్‌ సీపీ సొంతం చేసుకోగా చైర్‌పర్సన్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73 శాతం ఇచ్చారు. 


చట్టం చేసి మరీ పదవులు.. 
దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే రిజర్వేషన్‌ చేస్తూ సీఎం జగన్‌ చట్టం తెచ్చారు.  
► రాష్ట్రంలో 196 వ్యవసాయ మార్కెటింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవుల్లో 76 అంటే 39% బీసీలకు ఇచ్చారు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60%  పదవులిచ్చారు. 8వివిధ కార్పొరేషన్‌లలో 137 చైర్మన్‌ పదవుల్లో 53 (39%) బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం పదవులిచ్చారు. బీసీలకు 56 కార్పొరేషన్‌లు, ఎస్సీలకు మూడు కార్పొరేషన్‌లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.    
► 137 కార్పొరేషన్‌లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్‌ పదవుల్లో 201 బీసీలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 58 శాతం డైరెక్టర్‌ పదవులిచ్చారు. 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్‌లు, మూడు ఎస్సీ కార్పొరేషన్‌లు, ఓ ఎస్టీ కార్పొరేషన్‌లలో 684 డైరెక్టర్‌ పదవులన్నీ ఆ వర్గాల వారికే ఇచ్చారు. 

బీసీలకు బాబు వెన్నుపోటు.. 
బీసీలే తమ పార్టీకి వెన్నెముకని తరచూ చెప్పే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో 1999లో అధికారంలో ఉండగా 42 మందితో కూడిన మంత్రివర్గంలో కేవలం తొమ్మిది (21 శాతం) పదవులను మాత్రమే బీసీలకు ఇచ్చారు. విభజన తర్వాత 2014–19 మధ్య 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో కేవలం ఎనిమిది (32 శాతం) పదవులను మాత్రమే బీసీలకు కేటాయించి ఆ వర్గాల వెన్నెముకను విరిచారు.  

ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రివర్గంలో ఏకంగా బీసీలకు పది పదవులు (40%) ఇవ్వడం గమనార్హం. 2014 నుంచి 2019 వరకూ ఎన్నికలు జరిగిన రాజ్యసభ స్థానాల్లో ఒక్క సీటును కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చంద్రబాబు కేటాయించలేదు. గత మూడేళ్లలో రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 8 రాజ్యసభ స్థానాలకుగానూ నాలుగు సీట్లను బీసీలకే ముఖ్యమంత్రి జగన్‌ కేటాయించడం గమనార్హం.

► నాడు బెదిరింపులు.. హేళన 
► ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దళితులను చంద్రబాబు అవహేళన చేయటాన్ని కళ్లారా చూశాం. 
► ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకూ మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకుండా ఎస్టీల హక్కులను కాలరాసిన చంద్రబాబు నిర్వాకాలను మరచిపోగలమా? 
► న్యాయం చేయమని విన్నవించిన నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని.. సమస్యలు పరిష్కరించాలని అడిగిన మత్స్యకారుల తోలు తీస్తానంటూ బెదిరించడం.. న్యాయమూర్తులుగా పనికిరారంటూ బీసీల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీయడాన్ని విస్మరించగలమా? 
► హక్కులను పరిరక్షించాలని వేడుకున్న ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు పెట్టి కటకటాలపాలు చేసిన చంద్రబాబు దాష్టీకం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. 

రాష్ట్రంలో 2019 మే 29కి ముందున్న పరిస్థితి ఇదీ..! 
► నేడు సమున్నత గౌరవం.. 
► రాజ్యాధికారంలో సింహభాగం వాటా.. సంక్షేమ ఫలాలను అగ్రభాగం అందించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం జగన్‌ సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరించారు.  
► దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో ఐదు ఉప ముఖ్యమంత్రి పదవుల్లో నాలుగు.. మంత్రివర్గంలో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి పాలనాధికారం కల్పించారు. రాజ్యసభ, శాసనమండలి సభ్యుల నుంచి స్థానిక సంస్థల వరకూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. నామినేటెడ్‌ పదవుల్లో ఆ వర్గాలకే 50 శాతం రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ సగౌరవంగా పదవులు ఇచ్చారు. 
► మూడేళ్లలో నవరత్నాలు, సంక్షేమ పథకాలతో నేరుగా నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన రూ.1.41 లక్షల కోట్లలో 80 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే చేరాయి. తద్వారా ఆయా వర్గాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సాధికారత దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి.  
► నాడు చంద్రబాబు చేసిన సామాజిక అన్యాయాన్ని.. నేడు సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతోనే 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు గురువారం నుంచి ‘సామాజిక న్యాయభేరి’ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు.

సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న సామాజిక న్యాయాన్ని.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హయాంలో జరిగిన సామాజిక అన్యాయాన్ని ప్రజలకు చాటిచెప్పడానికే గురువారం శ్రీకాకుళం నుంచి వైఎస్సార్‌సీపీ బస్సుయాత్రను ప్రారంభించనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు ఈ యాత్రలో పాల్గొంటారు. 29న అనంతపురంలో యాత్ర ముగుస్తుంది. బస్సుయాత్రలో భాగంగా 26న విజయనగరం, 27న రాజమహేంద్రవరంలో, 28న నరసరావుపేటలో, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహిస్తారు. యాత్రలో ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు, నామినేటెడ్‌ పదవులు పొందిన వారు పాల్గొని సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు.

తొలిరోజు బస్సు యాత్ర ఇలా..
గురువారం ఉదయం 10.15 గంటలకు శ్రీకాకుళం సెవెన్‌ రోడ్స్‌ జంక్షన్‌లో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగహ్రానికి పూలమాలలు వేసి నివాళులర్పించి బస్సుయాత్ర ప్రారంభించనున్న మంత్రులు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement