
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై టీడీపీ నేతలకు పైత్యం ఎక్కువైందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి తోడు సీపీఐ, సీపీఎం నాయకులు జత కలిశారని, అసలు కమ్యూనిస్టు పార్టీ నాయకులకు ఏమైందని ప్రశ్నించారు. సంస్కరణల పేరుతో చంద్రబాబు ఎన్నో ప్రభుత్వ సంస్థలు మూసివేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేటీకరణ ఛాంపియన్ బాబు అని ఎవరిని అడిగినా చెబుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసిన నాయకుడు సీఎం జగన్
ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసిన నాయకుడు సీఎం అని గుర్తుచేశారు. అదీ జగన్‌కి, చంద్రబాబుకు ఉన్న తేడా అని తెలిపారు. రామోజీరావు రాసేవన్నీ తప్పుడు వార్తలే.. విశాఖ ప్లాంట్ మీద కూడా అలాగే విషపు రాతలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. సీఐడీ వాళ్లు వెళ్తే మంచంమీద పడుకుని డ్రామా ప్లే చేస్తున్నారని, ఇవన్నీ పాతకాలపు డ్రామాలని జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు కేంద్రం చేస్తున్న ప్రయివేటీకరణపై అందరికంటే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారని తెలిపారు.
స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకునే అంశంపై సీఎం కొన్ని సూచనలు కూడా చేశారని, ఢిల్లీ వెళ్లినప్పుడు ఇదే అంశంపై ప్రధాని మోదీతో కూడా మాట్లాడారని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌పై సీఎం జగన్ నిర్మాణాత్మక ప్రతిపాదన చేశారని, క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. ఎవరినో మభ్య పెట్టటానికి తాము పోరాటం చేయటం లేదని, వాటి రూపాలు మారాయన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా విజయం సాధించటమే గొప్ప.. అదే దారిలో సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వ లేకపోతున్నాయని, అందుకే దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబును సీఎంగా చూడాలనుకునే బ్యాచ్ వ్యవహారం మరింత దారుణంగా మారిందని ఫైర్ అయ్యారు.