సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా సాధికారత సాక్షాత్కారమైంది. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా అందజేస్తున్న చేయూతతో రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు వారి జీవన స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ అభ్యున్నతి దిశగా సాగిపోతున్నారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలోని మహిళలకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తూ వారు విద్య, వ్యాపార రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి, వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తున్నారు. ఇందుకయ్యే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
బ్యాంకుల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్ల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఎస్‌బీఐ రిసెర్చి నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2019 నుంచి 2023 సంవత్సరాల మధ్య డిపాజిట్లు, రుణాలపై సవివర నివేదిక విడుదల చేసింది. ‘మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వాలు మహిళా సాధికారతకు తీసుకుంటున్న చర్యలే.
స్థిరమైన మహిళా సాధికారతకు ఇవి నిదర్శనం’ అని ఆ నివేదిక పేర్కొంది. దేశంతో పాటు రాష్ట్రంలో మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరగడంతో పాటు మహిళలకు బ్యాంకు రుణాలు కూడా పెరుగుతున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.
రాష్ట్రంలో మొత్తం బ్యాంకు డిపాజిట్లలో మహిళలు చేసినవే 35 శాతానికిపైగా ఉన్నాయని తెలిపింది. దేశంలో 2019 – 2023 మధ్య మహిళలు చేసిన తలసరి డిపాజిట్ మొత్తం రూ.4,618కి పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 6,444కు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 2023 మార్చికి మొత్తం డిపాజిట్లు రూ. 4.56 లక్షల కోట్లు ఉండగా అందులో మహిళలు చేసినవి రూ.1.59 లక్షల కోట్లు’ అని ఆ నివేదిక వివరించింది. పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా మహిళల∙డిపాజిట్లు 35 శాతానికి పైగా ఉన్నట్లు తెలిపింది.
మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణలో మహిళల డిపాజిట్ల పెరుగుదల తక్కువగా ఉందని పేర్కొంది. ముగిసిన 2022–23 ఆరి్థక సంవత్సరంలో దేశంలోని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లు 10.2 శాతం పెరిగాయని, వీటిలో వ్యక్తుల వాటా తగ్గిందని తెలిపింది. ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం డిపాజిట్లలో మహిళా కస్టమర్ల వాటా 20.5 శాతానికి పెరిగిందని విశ్లేషించింది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరుగుదల
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళలు చేస్తున్న డిపాజిట్లు పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. కోవిడ్ సంక్షోభం ముందు సంవత్సరం 2019లో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్ల వాటా 25 శాతం ఉండగా 2023కి 30 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మహిళలు చేస్తున్న డిపాజిట్లు బాగా పెరుగుతున్నాయని, 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఇవి 50 శాతానికి చేరాయని పేర్కొంది.
మొత్తం డిపాజిట్లలో 37 శాతం 40 నుంచి 60 సంవత్సరాల వయస్సు లోపల వారివేనని, వారి వ్యక్తిగత డిపాజిట్లు రూ. 34.7 లక్షల కోట్లని తెలిపింది. 60 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్ల డిపాజిట్లు రూ. 36.2 లక్షల కోట్లు అని, ఈ వ్యక్తిగత డిపాజిట్లు 38 శాతమని తెలిపింది. 60 సంవత్సరాల పైబడిన సీనియర్ మహిళల వ్యక్తిగత డిపాజిట్లు రూ.13.2 లక్షల కోట్లుగా తెలిపింది.
పెరిగిన మహిళల పరపతి
మరో పక్క గత తొమ్మిదేళ్లుగా మహిళలకు వ్యక్తిగత బ్యాంకు రుణాల మంజూరు బాగా పెరిగిందని నివేదిక తెలిపింది. గత తొమ్మిదేళ్లలో దేశంలో కొత్తగా 7.6 కోట్ల మహిళలకు రూ.10.3 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి మహిళలకు బ్యాంకు రుణాల మంజూరు బాగా పెరిగిందని తెలిపింది. 2019 మార్చికి రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన బ్యాంకు రుణాలు రూ.47,548 కోట్లు ఉండగా 2023 మార్చికి ఏకంగా రూ.1,44,792 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. అంటే ఈ నాలుగేళ్లలో రుణాలు మూడింతలు పెరిగాయి.
రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అమలు చేస్తున్న పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయనడానికి ఈ నివేదికే తార్కాణమని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడి జీవనం కొనసాగిస్తున్నారని, దీంతో డిపాజిట్లు, వారి పరపతి పెరగడంతో వారికి రుణాలివ్వడానికి బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment