సేనాధిపతి ఉత్సవంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, తదితరులు
తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంపంగి ప్రాకారంలో వైఖానస ఆగమోక్తంగా బుధవారం అంకురార్పణ చేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆలయంలోని రంగనాయకుల మండపంలోకి సేనాధిపతిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. యాగశాలలో నవధాన్యాలను మొలకెత్తించేందుకు పాలికల (మట్టికుండల)ను వినియోగించారు. బుధవారం మధ్యాహ్నం కొత్తపాత్రలో నీరుపోసి నవధాన్యాలను నానబెట్టారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశాన్ని ఆవుపేడతో అలికి బ్రహ్మపీఠం ఏర్పాటుచేశారు. దేవతలను ఆహ్వానించి, భూమాతను ప్రార్థిస్తూపాలికలను మట్టితో నింపారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో నవధాన్యాలు చల్లి నీరు పోశారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహించారు. అనంతరం సోమరాజ, వరుణ మంత్రాలు, విష్ణుసూక్తం పఠించారు.
కంకణధారిగా వాసుదేవభట్టాచార్యులు
బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం 5.10 నుంచి 5.30 గంటల మధ్య మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేషవాహన సేవ ఉంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో క్రతువులు, వైదిక కార్యక్రమాల నిర్వహణకు కంకణధారిగా వాసుదేవభట్టాచార్యులు వ్యవహరించనున్నారు. ఈ ఉత్సవాల్లో నిర్వహించే హోమాలు, వాహన సేవలకు ఆయన పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు.
11న పట్టువ్రస్తాలు సమర్పించనున్న సీఎం
బ్రహ్మోత్సవాల్లో గురువారం నుంచి 15వ తేదీ వరకు వాహనసేవలను కల్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చక్రస్నానాన్ని ప్రత్యేక తొట్టిలో నిర్వహిస్తామన్నారు. తిరుమలలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 11న∙శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలను సమర్పిస్తారని చెప్పారు. దీనికిముందు తిరుపతిలో చిన్నపిల్లల హృదయాలయం, గోమందిరం, అలిపిరి–తిరుమల మెట్లదారిని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు.
12వ తేదీ తిరుమలలో బూందీపోటును, ఎస్వీబీసీకన్నడ, హిందీ చానళ్లను సీఎం ప్రారంభిస్తారన్నారు. 13 జిల్లాల్లో టీటీడీ నిర్మించిన 500 ఆలయాల పరిధిలోని గిరిజన, మత్స్యకారులకు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం నుంచి ఈనెల 14వ తేదీ వరకు శ్రీవారి దర్శనం చేయిస్తామన్నారు. రోజుకు ఒకటి, రెండు జిల్లాల నుంచి బస్సుల్లో తీసుకువచ్చి శ్రీవారితోపాటు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనం చేయిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment