
తాళ్లపాక హరినారాయణాచార్యులు
సాక్షి, తిరుపతి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని తన సంకీర్తనలతో ఓలలాడించిన తాళ్లపాక అన్నమాచార్యుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం రాయచోటి కేంద్రంగా శ్రీఅన్నమయ్య జిల్లా ఏర్పాటు చేయడంపై తాళ్లపాక అన్నమయ్య వంశస్తుల ఆనందానికి అవధులు లేవు. సాక్షాత్తూ శ్రీవేంకటేశ్వరస్వామి అంశతో పుట్టిన అన్నమయ్య తన 95ఏళ్ల జీవితకాలంలో 32వేల సంకీర్తనలతో శ్రీవారిని కీర్తిస్తూ రచనలు చేశారు. శ్రీవారి పరమభక్తుడైన అన్నమయ్య పేరును ఓ కొత్త జిల్లాకు నామకరణం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని యావత్ తెలుగు ప్రజలే కాకుండా విశ్వమంతటా ఉన్న శ్రీవారి భక్తులందరూ స్వాగతిస్తున్నారు. భక్తులే కాదు.. తమిళ, కన్నడ, మహారాష్ట్రకు చెందిన కళాకారులు సైతం ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షిస్తున్నారని తాళ్లపాక అన్నమయ్య 12వ తరం వారసులు తాళ్లపాక హరినారాయణాచార్యులు ఆనందం వ్యక్తం చేశారు. తాళ్లపాక అన్నమయ్య కుమారుడైన పెద్ద తిరుమలాచార్యుల సంతతికి చెందిన హరినారాయణాచార్యులు ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో సంకీర్తనా కైంకర్యము, కల్యాణోత్సవంలో తన సేవలను అందిస్తున్నారు.
నాడు వైఎస్ జీవనభృతి కల్పించారు..
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆనాడు తాళ్లపాక అన్నమయ్య వంశస్తులకు జీవన భృతి అందించి అరుదైన ఘనత కల్పించారని హరినారాయణాచార్యులు గుర్తు చేశారు. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆ సమస్యను వైఎస్ దృష్టికి తీసుకువెళ్ళగానే అన్నమయ్య తరాల వారికి జీవనభృతి కల్పిస్తూ యుద్ధప్రాతిపదికన ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అన్నమయ్య పేరిట ఓ జిల్లా రావడం చాలా సంతోషకరమన్నారు. శ్రీఅన్నమయ్య జిల్లా ప్రకటించడం జన్మజన్మల అదృష్టంగా తమ కుటుంబాలు భావిస్తున్నాయని హరినారాయణచార్యులు హర్షం వ్యక్తం చేశారు. అన్నమయ్య వారసులుగా తాము శ్రీవారి పవళింపు సేవ, సుప్రభాతం, శ్రీవారి కల్యాణోత్సవాల్లో అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ వంశ పరంపర కొనసాగిస్తున్నామన్నారు. అన్నమయ్య పేరు జిల్లాకు పెట్టడం శ్రీవారి అనుగ్రహంగా, సీఎం వైఎస్ జగన్ మా కుటుంబంపై ఉంచిన నమ్మకానికి ప్రతీకగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.
అన్నమయ్య మార్గం.. అంతులేని ఆనందం
‘‘తిరుమలకు పదపితాహుడు అన్నమయ్య నడిచిన మార్గాన్ని అన్నమయ్య మార్గంగా అభివృద్ధి చేసేందుకు టీటీడీ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్నిస్తోంది. తిరుమలకు ప్రస్తుతమున్న ఘాట్ రోడ్‌లు నిర్మించడానికి పూర్వం భక్తులు శేషాచలం అడవిలోని అన్నమయ్య మార్గం ద్వారానే శ్రీవారి దర్శనానికి నడచి వచ్చేవారు. ఇప్పటికీ కొంతమంది భక్తులు ఇదే సంప్రదాయం పాటిస్తూ అన్నమయ్య నడయాడిన మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు ఆ మార్గానికి గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ సంకల్పించడం... ఇదే సమయంలో ఆయన పేరును ఓ జిల్లాకు నామకరణం యాధృచ్ఛికమే కావొచ్చు. కానీ తాళ్ళపాక వంశస్తులకు మాత్రం ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది.’’ అని హరినారాయణాచార్యులు వ్యాఖ్యానించారు.