
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఆత్మకూరు గ్రామ పరిధిలోని టీడీపీ ప్రధాన కార్యాలయ భవనంపై మరో వివాదం రేగింది. ఇప్పటికే దీన్ని వాగు పోరంబోకు స్థలంలో నిర్మించడంపై న్యాయస్థానంలో వివాదం కొనసాగుతుండగా తాజాగా తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఆ భవనాన్ని నిర్మించిన తమకు రూ.కోట్ల బకాయిలను ఇంతవరకు చెల్లించలేదంటూ హైదరాబాద్‌కు చెందిన ప్రెకా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఈ పనులను అప్పగించిన ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్, టీడీపీ కార్యాలయం నుంచి స్పందన లేకపోవడంతో వివాద పరిష్కారానికి మధ్యవర్తిగా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పాములపర్తి స్వరూప్‌రెడ్డిని నియమించింది. మధ్యవర్తి ఫీజును చట్ట ప్రకారం ఇరుపక్షాలు సమానంగా భరించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొల్లంపల్లి విజయసేన్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రెకా సొల్యూషన్స్ దాఖలు చేసిన కేసు వివరాలు...
రూ.8.21 కోట్ల బకాయిలపై వివాదం...
టీడీపీ కార్యాలయ భవనాన్ని ప్రీకాస్ట్ పద్ధతిలో నిర్మించేందుకు విశాఖకు చెందిన ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్‌కు చెందిన ప్రెకా సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2018లో ఒప్పందం కుదిరింది. ప్రీకాస్ట్ సామగ్రితోపాటు ఇతర మెటీరియల్ సరఫరా కూడా ఆ ఒప్పందంలో భాగం. ప్రెకా సొల్యూషన్స్ మొత్తం రూ.21.01 కోట్ల విలువైన పనులను పూర్తి చేసింది.
2019 డిసెంబర్‌లో రూ.8.21 కోట్లకు ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కు ప్రీఫైనల్ బిల్లు సమర్పించింది. నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు టీడీపీ నియమించుకున్న జెనిసిస్ కన్సల్టెన్సీ సైతం దీన్ని ఆమోదించింది. అయితే తమకు ఇవ్వాల్సిన రూ.8.21 కోట్లను చెల్లించకపోవడంతో ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కు ప్రెకా సొల్యూషన్స్ లేఖ రాసింది. బకాయిలు చెల్లించాలని కోరింది.
టీడీపీతోనే తేల్చుకోవాలన్న ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్
బకాయిలు చెల్లించేందుకు నిరాకరించిన ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్ ఆ మొత్తాన్ని నేరుగా టీడీపీ నుంచే తీసుకోవాలని స్పష్టం చేసింది. 2019 చెల్లింపులన్నీ తమ ప్రమేయం లేకుండా నేరుగా పార్టీనే చేసినందున టీడీపీ నుంచే తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ బకాయిల గురించి టీడీపీ అగ్రనేత వద్ద ప్రస్తావించగా.. ఇందులో తమను జోక్యం చేసుకోవద్దని, నేరుగా చెల్లింపులు చేస్తామని చెప్పినట్లు ఎస్‌ఎస్‌ఆర్ పేర్కొంది. బకాయిల విషయంలో ప్రెకా–ఎస్‌ఆర్‌ఆర్ కంపెనీల మధ్య పలుమార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి.
ప్రెకా 2020లో ఇన్సాల్వెన్సీ, బ్యాంక్‌రప్టసీ నిబంధనల కింద ఎస్‌ఆర్‌ఆర్ కంపెనీకి డిమాండ్ నోటీసు పంపింది. బేషరతుగా తమకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని కోరింది.అయితే వాటితో తమకు సంబంధం లేదని, నేరుగా టీడీపీ కార్యాలయంతోనే తేల్చుకోవాలని ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్ తెగేసి చెప్పింది. దీంతో ఒప్పంద నిబంధనల ప్రకారం మధ్యవర్తిత్వానికి ప్రెకా సిద్ధమైంది.
ఈ మేరకు ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కు నోటీసు పంపింది. వివాద పరిష్కారానికి సహకరించడంతో పాటు మధ్యవర్తిత్వ ప్రొసీడింగ్స్‌లో ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్, టీడీపీని పార్టీలుగా ఉండాలని కోరింది. మధ్యవర్తులుగా ఏపీ, తెలంగాణకు చెందిన ఎవరైనా నలుగురు విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పేర్లు సూచించాలని, అందులో నుంచి ఒకరిని ఎంచుకుంటామని తెలిపింది.
స్పందన లేకపోవడంతో...
దీనికి స్పందించిన ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్.. మధ్యవర్తి నియామకంపై తెలుగుదేశం పార్టీతో చర్చించి చెబుతామని, ఇందుకు కొంత గడువునివ్వాలని ప్రెకా సొల్యూషన్స్‌ను కోరింది. గడువు పూర్తయినా ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రెకా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి మధ్యవర్తిత్వ దరఖాస్తు దాఖలు చేసింది. వివాద పరిష్కారానికి మధ్యవర్తిని నియమించాలని కోర్టును కోరింది. ఈ దరఖాస్తుపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్‌కు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.
తరువాత పలుమార్లు ఈ కేసు విచారణకు వచ్చినా ఎస్‌ఎస్‌ఆర్ ప్రాజెక్ట్స్ కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో న్యాయమూర్తి మధ్యవర్తిత్వానికి ప్రెకా సొల్యూషన్స్ దాఖలు చేసిన దరఖాస్తును అనుమతించారు. ఇరు పక్షాల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించి చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు వీలుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ స్వరూప్‌రెడ్డిని మధ్యవర్తిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment