
ఆత్మకూరులో తమ్ముళ్ల అలక ...!
వైఎస్సార్ సీపీ బలాన్ని తట్టుకోలేక..
కన్నబాబుతో పార్టీ పెద్దలు అనేక సార్లు చర్చించినా రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పని చేయడానికి ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆనం, కన్నబాబు వర్గాల మధ్య ఏమాత్రం సఖ్యత కుదరలేదు. తనకు అధికారి కంగా బాధ్యతలు ఇచ్చే వరకు నియోజకవర్గంలోకి వెళ్లబోనని రామనారాయణరెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇక పార్టీ ని బలపరచుకోవడం మీద దృష్టి పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. మంత్రి నారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో ఇటీవల సీఎం ఈ విషయం గురించి చర్చించారు. ఆనంకు అధికారికంగా బాధ్యతలు అప్పగిస్తూ వారం రోజుల ముందే ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు.
మంగళవారం తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి కన్నబాబు ఏర్పాట్లు చేసుకుంటున్నందువల్ల తర్వాత ఉత్తర్వులు ఇద్దామని రవిచంద్ర సూచించారు. మంగళవారం కన్నబాబు పుట్టిన రోజు వేడుకలు ముగియడంతో బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రామనారాయణరెడ్డిని ఇన్‌చార్‌్జగా నియమించారనే సమాచారం తెలియడంతో బుధవారం ఉదయం నుంచి కన్నబాబు, ఆయన ముఖ్య అనుచరులు సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. మరోవైపు రామనారాయణరెడ్డి మద్దతుదారులు ఆత్మకూరు నియోజకవర్గంలో బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
కన్నబాబుకు పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రాధాన్యత ఉన్న పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు జిల్లా పార్టీ నాయకత్వం ఆయన్ను బుజ్జగించే పనిలో పడింది. నెల్లూరులో ఇటీవల నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో తాము కన్నబాబు మాట వినాలా? ఆనం రామనారాయణరెడ్డి మాట వినాలా? అని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శిద్ధా రాఘవరావును అడిగామని, ఆయన కన్నబాబు మాటే వినాలని చెప్పారని గూటూరు మద్దతు దారులు చెబుతున్నారు. ఇప్పుడు రామనారాయణరెడ్డిని తమ నియోజకవర్గ బాధ్యుడిగా నియమిస్తే ఆయనతో ఎలా కలిసి పనిచేయాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.