Breadcrumb
వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం: సీఎం జగన్
Published Thu, Mar 24 2022 8:41 AM | Last Updated on Thu, Mar 24 2022 6:16 PM
Live Updates
12వ రోజు అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్డేట్స్
ఏపీ అసెంబ్లీ వాయిదా
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ తిరిగి రేపు(శుక్రవారం) ప్రారంభం కానుంది.
ఒకరి పరిధిలో మరొకరు జోక్యం చేసుకోకూడదు: స్పీకర్ తమ్మినేని
రాజ్యాంగ వ్యవస్థలో ఎవరి బాధ్యతలు వాళ్లు నెరవేర్చాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఒకరి పరిధిలో మరొకరు జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలోని వేర్వేరు వ్యవస్థలకు పరస్పర గౌరవం ఉండాలని తెలిపారు.
వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోం: సీఎం జగన్
వికేంద్రీకరణ విషయంలో వెనకడుగు వేయబోమని సీఎం జగన్ స్పష్టం చేశారు. వికేంద్రీకరణకు అర్థం అన్ని ప్రాంతాల అభివృద్ధి కాబట్టి, అడ్డంకులు ఎదురైనా వికేంద్రీకరణ ఒక్కటే సరైన మార్గమన్నారు.
అందరికీ మంచి చేయడమే ప్రభుత్వం ముందన్న మార్గమని, రాబోయే తరాలకు మంచి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం, గౌరవం ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణకే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం జగన్ తెలిపారు. రాజ్యాంగం సూచించిన మూడు వ్యవస్థల పరిధి దేనికదే ఉందని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టు పరిధిని దాటి వ్యవహరించినట్టు అందరి అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. వికేంద్రీకరణపై అసెంబ్లీలో కొత్తగా చట్టం చేయకూడదని హైకోర్టు తీర్పులో పేర్కొందని అన్నారు. వికేంద్రీకరణపై కేంద్రం కూడా తమ సమ్మతి తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. వికేంద్రీకణ అనేది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశమని కేంద్రంగా స్పష్టంగా పేర్కొందని తెలిపారు. పెరిగిన ధరలను పరిశీలనకు తీసుకుంటే రాజధాని నిర్మాణానికి 40 ఏళ్లు పడుతుందని తెలిపారు.
చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుంది: సీఎం జగన్
ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. వ్యవస్థల పరిధిపై రాజ్యాంగం స్పష్టత ఇచ్చిందని తెలిపారు. రాజ్యాంగంలో ప్రతీ వ్యవస్థ స్వతంత్రమైనదేనని తెలిపారు. వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు ఉంటే సమస్యలు రావని అన్నారు. మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని తెలిపారు. శాసన వ్యవస్థ చట్టాలు చేయకూడదని కోర్టులు చెప్పలేవని తెలిపారు. చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందని తెలిపారు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మరలా ఎన్నుకుంటారని తెలిపారు.
మంచి చట్టాలు చేయకుంటే ప్రజలు ఇంటికి పంపిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన విధానాలు నచ్చలేదు కాబట్టే ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య గొప్పతనమని తెలిపారు. శాసనసభ ఓ చట్టాన్ని చేయాలా వద్దా అని కోర్టులు నిర్ణయంచలేవన్నారు. ఆరు నెలల్లో రాజధానిని వేల కోట్లతో పూర్తి చేయాలని చెప్పడం.. సాధ్యం కాని టైం లైన్‌ను నిర్దేశించడం సరికాదన్నారు. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి లేకపోవడం వల్ల వచ్చింది.. రెండోసారి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి అంతా ఒకే దగ్గర ఉంటడం వల్ల వచ్చిందని చెప్పారు. వికేంద్రీకరణ వల్ల ఏపీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీనే చెప్పిందని తెలిపారు. ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చామని అన్నారు.
రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన సాగుతుంది: బుగ్గన
రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన సాగుతుంది: బుగ్గన
ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. ప్రాథమిక హక్కులపై రాజ్యాంగంలో స్పష్టత ఉందని తెలిపారు. రాజ్యాంగం ఆధారంగానే పరిపాలన సాగుతుందని అన్నారు. ఒకరి హక్కును మరొకరు లాక్కోకూడదని తెలిపారు. వెనకబడిన జిల్లాల్లో అసమానతలు ఉన్నాయని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు అన్ని రంగాల్లో వెనకబడ్డాయని అన్నారు. ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించాలని రాజ్యాంగంలో ఉందని తెలిపారు. సమానత్వంపై దృష్టి పెట్టాలని ఎన్నో అనుభవాలు చెబుతున్నాయని తెలిపారు.
భారతదేశంలో 1.63లక్షల చదరపు కీలో మీటర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 8వ స్థానంలో ఉందని తెలిపారు. అదే విధంగా స్థూల ఉత్పత్తిలో 2019-2020 ప్రకారం.. దాదాపు తొమ్మిదిన్నర కోట్లు ఉందని అన్నారు. 2014లో జరిగిన పునర్ వ్యవస్థీకరణ కారణంగా తలసరి ఆదాయం చాలా తగ్గిందని తెలిపారు.
నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినా.. వలస కూలీలు అంటే శ్రీకాకుళం, విజయనగరం నుంచి వస్తారని తెలిపారు. దాదాపు 20 లక్షలపైగా మంది ఇక్కడి నుంచి వలసపోతున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సమానత్వం అనేది ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు. కుప్పం వాళ్లు సమారు 60 వేల మందికి పైగా వలసవెళ్లి బయట ప్రాంతాల్లో బతుకుతున్నారని తెలిపారు.
ఎటుంటి రాజధాని కట్టాలని తాము ప్రణాళిక వేశామంటే.. మొట్టమొదటి దశలోనే రోడ్లు, కాలువలకు లక్షా పదివేల కోట్లు కేటాయించాలనుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలకులకు రాజధాని ప్లానింగ్ కోసమే ఐదేళ్లు పట్టిందని అన్నారు. ఏడేళ్లలో రాజధానికి కట్టడానికి వీలవుతుందా?అని ప్రశ్నించారు.
అమరావతిలో అభివృద్ధి చేయబోమని ఎవరైనా చెప్పారా? అని అన్నారు. ప్రభుత్వం సభకు సమాధానం చెప్పాలి.. సభ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. సీఆర్డీఏ చట్టాన్ని అసెంబ్లీ చేసిందని గుర్తు చేశారు. చంద్రబాబు నగరం కట్టాలనుకున్నారా.. రాజధాని కట్టాలనుకున్నారా? అని ప్రశ్నించారు. చట్టసభల్లో తీసుకున్న నిర్ణయాలను ఏవిధంగానైనా మార్చాలనే శక్తి కోర్టులకు ఉండటం సరికాదని ఓ తీర్పులో ఉన్నట్లు తెలిపారు. హైకోర్టు జాగ్రత్తగా, ఎక్కువగా స్క్రూటినీ చేయాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో హద్దుదాటి వెళ్లకూడదని టాటా సెల్యులార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పు ఉన్నట్లు గుర్తుచేశారు.
స్వీయనియంత్రణ ఏ వ్యవస్థకైనా తప్పనిసరి: చెవిరెడ్డి
ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను న్యాయవ్యవస్థల మంచి కోసమే మాట్లాడుతున్నానని అన్నారు. స్వీయనియంత్రణ ఏ వ్యవస్థకైనా తప్పనిసరి అని తెలిపారు. ప్రతీ వ్యవస్థకూ కొన్ని పరిధిలు ఉంటాయని అన్నారు. దేశానికి రాజ్యాంగమే సుప్రీమని అన్నారు. న్యాయ వ్యవస్థ అంటే తమకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు.
జడ్జిలు చేసే తప్పులపై విచారణ జరిపే అధికారం రాష్ట్రపతి ఆధ్వర్యంలోని వ్యవస్థకు ఉండాలని ప్రతిపాదించారు. యూపీఎస్సీ తరహాలోనే న్యామమూర్తుల ఎంపిక జరగాలని కేంద్రాన్ని కోరుతున్నానని తెలిపారు.
రాజధాని పేరుతో దోచుకోవటమే చంద్రబాబు లక్ష్యం: పార్థసారధి
ఏపీ అసెంబ్లీలో వికేంద్రికరణపై చర్చ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ.. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారని అన్నారు. మూడు రాజధానుల అంశం కులాల సమస్య కాదని తెలిపారు. దీన్ని ప్రాంతాల మధ్య సమతుల్యతగా భావించాలని పేర్కొన్నారు. రాజధాని పేరుతో దోచుకోవటమే చంద్రబాబు లక్ష్యమని అన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వెనకబడిన ప్రాంతాలని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఈ జిల్లా ప్రజలు ఇతర రాష్ట్రాలు, నగరాలకు వెళ్లి కూలీలుగా పనిచేస్తున్న పరిస్థితి ఉందని తెలిపారు. అటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దశంతో.. రాయలసీమ అభివృద్ధిలో భాగంగా అక్కడ హైకోర్టు ఏర్పాటు చేస్తే తప్పేముందని అన్నారు. పారిపాలన రాజధానిగా విశాఖపట్నంను డిసైడ్ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు.
లైవ్ వీడియో
లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేవు: ధర్మాన
జ్యుడీషియల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని చెప్పిందని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఏపీ అసెంబ్లీలో పాలనా విభజనపై ఆయన మాట్లాడుతూ..‘అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు గంతో చెప్పింది. సమాజం పట్ల పూర్తి బాధ్యత ఉందని సుప్రీంకోర్టు గతంలో ప్రకటించింది. ఒకవేశ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే అది ప్రజలు చూసుకుంటారు. అంతే కానీ శాసన వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల పరిధి ఎంత మేరకు అన్నది కోర్టులో చెప్పాలి. ఎంత నిగ్రహంతో కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది.
ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలి. సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు కూడా ఉన్నాయి. న్యాయ వ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని త తీర్పులు ఎన్నో చెప్పాయి. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదే అని చెప్పాయి. లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేవని సుప్రీం తీర్పుల్లో స్పష్టంగా ఉంది’ అని ధర్మాన తెలిపారు.
ఎవరి పరిధి ఏంటీ? ఎవరి విధులేంటీ అన్న దానిపై స్పష్టత రావాలి: ధర్మాన
మూడు రాజధానులపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతున్నారు. ‘ప్రపంచంలోనే అత్యంత పురాతన లిఖిత రాజ్యంగం 1788లో అమెరికాది. మన దేశంలో రాజ్యాంగం 72 ఏళ్ల కింద 1950లో అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం తమను కాపాడుతుందన్న భరోసాలో ప్రతీ ఒక్కరు ఉంటారు. మన లక్ష్యం ఎంత గొప్పదో.. మార్గం కూడా అంత గొప్పగా ఉండాలని గాంధీ చెప్పారు. ఎవరి పరిధి ఏంటీ? ఎవరి విధులేంటీ? అన్న దానిపై స్పష్టత రావాలి. ఈ స్పష్ట రాకుంటే వ్యవస్థలో గందరగోళం వచ్చే అవకాశం ఉంది’ అని తెలిపారు.
ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దు: మంత్రి ధర్మాన
మూడు రాజధానుల అంశంపై ధర్మాన ప్రసాద్‌రావు మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులను పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానులపై అసెంబ్లీ చట్టం చేయొద్దంటూ హైకోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పు తర్వాత సభానాయకుడికి లేఖ రాశా. న్యాయనిపుణులతో కూడా ఈ విషయంపై చర్చించా. కోర్టులంటే అందరికి గౌరవం ఉంది. అయితే దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నా.
ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోవద్దు. రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చకుండా అడ్డుపడొద్దు. న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాలి. ఒకప్పుడు దేశంలో రాజరిక వ్యవస్థ ఉండేది. అధికారం రాజు చేతుల్లోనే ఉండేది. రాచరికం నుంచి తర్వాతి రోజుల్లో ప్రజాస్వామ్యం వచ్చింది. సభలో చర్చించేందుకు అనుమతినిచ్చినందుకు ధన్యవాదాలు.
రాజ్యాంగం రావడానికి వెనక ఎంతో మంది గొప్ప వాళ్ల కృషి ఉంది. ప్రజలు ఎన్నుకొన్న ప్రతినిధులతో పాలన చేయాలని రాజ్యాంగం చెప్పింది. ప్రజాభిప్రాయం కేవలం శాసన వ్యవస్థలోనే ప్రభావితం అవుతుంది. ప్రజల చేత, ప్రజల కొరకు అని రాజ్యాంగంలో రాసుకుంది శాసన వ్యవస్థ గురించే. శాసనసభ, లోక్‌సభ.. ఈ రెండు వ్యవస్థలను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారు, కాలేరు.
మూడు రాజధానులపై చర్చ ప్రారంభం
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ ప్రారంభమైంది. సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ప్రసంగిస్తున్నారు.
టీడీపీ సభ్యులపై మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం
శాసనమండలిలో టీడీపీ సభ్యులు చిడతలు వాయించి, విజిల్స్ వేయడంపై చైర్మన్ మోషెన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సభలో ఇలాంటివి చేయడం మంచిది కాదు. సభకు చిడతలు, విజిల్స్ ఎందుకు తెచ్చారు. సభలో చిడతలు వాయించడం ఏంటి..?. సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదా?. భజన చేయడం మంచి పద్ధతి కాదు. వెల్‌లోకి వచ్చి మాట్లాడే హక్కు మీకు లేదు. మీ సీట్లలో మీరు కూర్చొని మాట్లాడండి.
కావాలనే గొడవ చేస్తున్నారు.. సభా సమయాన్ని వృద్దా చేయొద్దని మొదటి రోజు నుంచి చెబుతున్నా. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయగానే దీపక్ రెడ్డి పోడియం పైకి ఎక్కడానికి దూసుకెళ్లారు. దీంతో దీపక్ రెడ్డిని మార్షల్స్ అడ్డుకున్నారు. సస్పెండ్ చేస్తే ఈ దౌర్జన్యం ఏంటి అని చైర్మన్ మోషెన్ రాజు టిడిపి సభ్యులను ప్రశ్నించారు. మోషెన్ రాజుపై ప్లకార్డులు విసిరి టిడిపి సభ్యులు బయటకు వెళ్లారు.
పెద్దల సభలో చిల్లరగా గలాటా: మంత్రి కన్నబాబు
మండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టీడీపీ సభ్యులు ఈ స్థాయిలో దిగజారిపోయారని అస్సలు ఊహించలేదు. టీడీపీ సభ్యులు బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారు. పెద్దల సభలో చిల్లరగా గలాటా చేస్తున్నారు. శాసనమండలి ఛైర్మన్పట్ల లోకేష్ అమర్యాదగా ప్రవర్తించారు.
చంద్రబాబు బయటనుంచి సభను కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. టీడీపీ చెబుతున్న బ్రాండ్లన్నీ.. సీ బ్రాండ్లే. సహజ మరణాలను టీడీపీ రాజకీయం చేస్తోంది' అని మంత్రి కన్నబాబు అన్నారు.
మండలిలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్
టీడీపీ సభ్యుల తీరు మారలేదు. మండలిలో కూడా అదే తీరు. సభలో విజిల్స్ వేస్తూ, చిడతలు వాయిస్తూ ఆందోళన చేశారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు. సస్పెండైన వారిలో అర్జునుడు, అశోక్ బాబు, దీపక్ రెడ్డి, ప్రభాకర్, రామ్మోహన్, రామారావు, రవీంద్రనాథ్ ఉన్నారు.
మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణపై చర్చ
అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై కీలక చర్చకు అసెంబ్లీ కార్యదర్శి సప్లిమెంటరీ అజెండాను జారీ చేశారు. స్వల్ప కాలిక చర్చ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణపై చర్చ జరగనుంది.
అవినీతికి కాదేది అనర్హం అన్నట్లు దోచుకున్నారు
టీడీపీ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి. అవినీతికి కాదేది అనర్హం అన్నట్లు టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పేదవాడి గురించి ఏనాడు ఆలోచించలేదన్నారాయన.
దిగ్విజయంగా ఉపాధి హామీ పథకం
ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమధానం ఇచ్చారు. భారత ప్రభుత్వం ఆమోదించిన లేబర్ బడ్జెట్‌ను అనుసరించి రాష్ట్రంలో 23 కోట్ల 50 లక్షల పనిదినాలకు గాను 22 కోట్ల 45 లక్షల పనిదినాలు కల్పించామని చెప్పారు.
45 లక్షల 83 కుటుంబాల నుంచి 75 లక్షల 32 వేల మందికి ఉపాధి కల్పించామని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7507.54 కోట్ల రూపాయలను ఉపాధి హామీ పథకం కోసం వెచ్చించామని తెలిపారు. ఇందులో రూ.4908.09 కోట్లను వేతనాల కోసం, 2504.65 కోట్ల రూపాలయలను మెటీరియల్ కాంపొనెంట్ కోసం ఖర్చు చేశామని వెల్లడించారు. 3,82,130 కుటుంబాలు 100 రోజుల పని పూర్తి చేశాయని పేర్కొన్నారు. వేతనదారులకు 99.27 శాతం చెల్లింపులు 15 రోజుల్లో పూర్తయ్యాయని సభా ముఖంగా మంత్రి వివరాలు తెలిపారు.
గ్రామీణ ఉపాథి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు కల్పించిన రాష్ట్రంగా ఏపీ టాప్-5లో నిలిచిందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గత ఏడాది 25 కోట్ల పనిదినాలు కేటాయిస్తే...26 కోట్ల పనిదినాలు పూర్తి చేసి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిలో నిలిచిందన్నారు.
శాసన-న్యాయ అధికారాల పరిధిపై చర్చ..!
నేడు అసెంబ్లీలో మూడు రాజధానులు అంశంపై కీలక చర్చ జరగనుంది. శాసన-న్యాయ అధికారాల పరిధిపై చర్చించే అవకాశం ఉంది. సీనియర్ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు లేవనెత్తిన అంశంపై సభలో చర్చించనున్నారు.
ఏపీ అసెంబ్లీ లైవ్
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
12వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
కాసేపట్లో 12వ రోజు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: మరికాసేపట్లో 12వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం పలు బిల్లులు, వార్షిక నివేదికలను సభ ముందు ఉంచనుంది. పలు శాఖల బడ్జెట్ డిమాండ్ గ్రాంట్లను కూడా ప్రభుత్వం సభలో ఆమోదానికి ఉంచనుంది.
Comments
Please login to add a commentAdd a comment