Breadcrumb
పదోరోజు అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్డేట్స్
Published Tue, Mar 22 2022 8:46 AM | Last Updated on Tue, Mar 22 2022 2:02 PM
Live Updates
పదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ రేపటికి వాయిదా
ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. అసెంబ్లీ రేపటికి(బుధవారానికి) వాయిదా పడింది.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించం: సీఎం జగన్
వక్రీకరణ, అబద్దాలపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాను విజనరి అని చెప్పుకునే చంద్రబాబు వల్లే ప్రాజెక్టుకు కష్టాలు వచ్చాయని తెలిపారు. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013-2014 అంచనాల ప్రకారమే ప్రాజెక్టు కడతామని చెప్పారని అన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నామని చంద్రబాబుకు ఎవరు చెప్పారు? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ వీరికి ఏమైనా చెప్పారా? అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేసిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించమని సీఎం జగన్ తెలిపారు.
చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని అన్నారు. ప్రత్యేక హోదాను తాకుట్టుపెట్టి పోలవరం ప్రాజెక్టును తీసుకున్నారని చెప్పారు. పోలవరం టూర్ పేరుతో రూ. 100 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని తెలిపారు. పోలవరం వద్ద తన అనుచరులతో చంద్రబాబు భజన చేయించుకున్నారని చెప్పారు.
2023 ఖరీఫ్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. ఉక్కు సంకల్పంతో పోలవరం నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కేంద్రం సమకారంతో ఆర్ఆండ్ఆర్ పనులు వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం వద్ద వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్‌కు అంకితం చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును తన తండ్రి వైఎస్సార్ ప్రారంభించారని ఆయన వారసుడిగా కచ్చితంగా ప్రాజెక్టును తాను పూర్తి చేస్తానని సీఎం జగన్ తెలిపారు.
చంద్రబాబు తప్పిదాలతోనే ఈ పరిస్థితి
స్పిల్‌వే పూర్తి చేయకుండానే కాఫర్ డ్యామ్ కట్టారు. మధ్యలో 3 పెద్ద ఖాళీలు వదిలి పెట్టారు. ఈ నిర్లక్ష్యం వల్ల ఆర్థిక నష్టంతోపాటు నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగింది. దిగువ కాపర్‌డ్యామ్‌కు కూడా భారీ నష్టం వాటిల్లింది. పునాదిపైన, లోపల కలిపి 35.6 మీటర్ల మేర గుంట ఏర్పడింది. చంద్రబాబు తప్పిదాలతోనే పోలవరానికి ఈ పరిస్థితి వచ్చిందని సీఎం జగన్ అన్నారు.
శాసనమండలి రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరుతాం: సీఎం జగన్
ఎల్లోమీడియా రోజుకొక కథనాన్ని ప్రచారం చేస్తోందని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. 'తాము చేయలేని పనిని ఇంకొకరు చేస్తున్నారని వారికి కడుపుమంట. తన సొంత జిల్లాలో కూడా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క ప్రాజెక్ట్ లేదు. ప్లానింగ్ లేకుండా చంద్రబాబు ఇష్టానుసారంగా వ్యవహరించారు. చంద్రబాబు పనులు పోలవరానికి శాపంగా మారాయి. అయినప్పటికీ వాటన్నిటినీ అధిగమించి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి తీరుతాం. అయితే ఎల్లోమీడియా మసిపూసి మారెడు కాయ చేసేందుకు రకరకాలుగా చూస్తున్నారు' అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.
7.2 లక్షల ఎకరాలకు సాగునీరు
'ఏపీ ప్రజల దశాబ్దాల కల పోలవరం ప్రాజెక్టు. ఇది పూర్తయితే 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 23.5లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతంది' అని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
పావలా చేసి.. రూపాయి పావలా పబ్లిసిటీ ఇచ్చారు: తెల్లం బాలరాజు
పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలాంటిదని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే టీడీపీ గోదార్లో కలిసిపోతుంది. చంద్రబాబు పావలా చేసి.. రూపాయి పావలా పబ్లిసిటీ ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్వాసితులను చంద్రబాబు ఏనాడు కలవలేదు. సీఎం వైఎస్ జగన్ వచ్చిన ప్రతీసారి నిర్వాసితులతో మాట్లాడారు' అని తెల్లం బాలరాజు అన్నారు.
ఎల్లో మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం
చంద్రబాబు మూడేళ్లు కాలయాపన చేయకుండా ఉంటే ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉండేది. చంద్రబాబు భజన కోసం వంద కోట్లు ఖర్చు చేశారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రజాధనాన్ని ఆదా చేశాం. ఎల్లో మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారు. బాబు హయాంతో ప్లానింగ్ లేకుండా అడ్డదిడ్డంగా పనులు చేశారు. కానీ ఈ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు లేకుండా ముందుకెళ్తోంది అని మంత్రి అనిల్ కుమార్ అన్నారు.
చంద్రబాబు చేసిన పాపాలు రాష్ట్రానికి శాపాలు: మంత్రి అనిల్
వైఎస్సార్ హయాంలో 75శాతం భూసేకరణ జరిగింది. వైఎస్సార్ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగాయి. టీడీపీ ప్రభుత్వం 2016 వరకు పోలవరంపై దృష్టి సారించలేదు. సవరించిన అంచనాలు అడిగితే టీడీపీ ప్రభుత్వం తాత్సారం చేసింది. చంద్రబాబు చేసిన పాపాలు రాష్ట్రానికి శాపాలుగా మారాయి. చంద్రబాబుకు చిత్తశుద్ది లేకపోవడంతో ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఆనాడు ప్యాకేజీ వచ్చిందని టీడీపీ నేతలు సంబరపడ్డారు. కానీ ప్రజలు ఎంత నష్టపోతున్నారో పట్టించుకోలేదు.
ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్: మంత్రి అనిల్ కుమార్
పోలవరం ప్రాజెక్ట్ 48 గేట్లను మా హయాంలోనే అమర్చాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రాజెక్ట్ పనులను ఆపలేదు. పోలవరాన్ని వైఎస్సార్ ప్రారంభించారు. మహానేత తనయుడు వైఎస్ జగన్ పూర్తి చేస్తారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
పదోరోజు అసెంబ్లీ సమావేశాలు
సభ హుందాగా నడపటానికే వారి సస్పెన్షన్: మంత్రి పేర్ని నాని
గతంలో స్పీకర్ మీద కాగితాలు విసిరి పరువు తీసిన టీడీపీ వారు.. ఇప్పుడు మరో దారుణానికి ఒడిగట్టారంటూ మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు ఇవాళ నేరుగా విజిల్ వేసి అలజడి చేశారు. బయట ఎలా ఉంటారో సభలో కూడా అలా ఉండటం సరికాదు. గాలిగా ప్రవర్తిస్తూ సభలో వ్యవహరించారు. సభను హుందాగా నడపటానికే స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.
పోలవరం నిర్మాణంపై చర్చ ప్రారంభం
మంగళవారం శాసనసభలో పోలవరం ప్రాజెక్ట్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. మంత్రి అనిల్‌కుమార్ పోలవరం ప్రాజెక్ట్ అభివృద్ధిపై వివరిస్తున్నారు.
దేవాలయాలు తొలగించడంలో బిజెపి, జనసేన పాత్ర
కృష్ణా పుష్కరాల పేరుతో గత తెలుగుదేశం ప్రభుత్వం దేవాలయాలు తొలగించిందని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ.. 'ఆలయాల్లో నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేశారు. దేవాలయాలను కూల్చేసి ఆ స్థానంలో గత ప్రభుత్వం బాత్రూములు కట్టింది. బిజెపి, జనసేన, టిడిపి హిందుత్వాన్ని కాపాడే పార్టీలని ప్రచారం చేసుకుంటారు. దేవాలయాలు తొలగించడంలో బిజెపి, జనసేన పాత్ర కూడా ఉంది. దేవాలయాలు కూల్చివేసి దేవతామూర్తుల విగ్రహాలను మున్సిపాలిటీకి చెందిన చెత్త ట్రాక్టర్లో ఎత్తుకెళ్లారని' మొండితోక అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.
అప్పుడే చంద్రబాబుకు పతనం ప్రారంభమైంది
పుష్కరాల పేరుతో కూల్చేసిన దేవాలయాలకు గత ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 'గత తెలుగుదేశం ప్రభుత్వంలో బిజెపి, జనసేన కూడా భాగస్వాములు. దేవాలయాల తొలగింపులో బిజెపి, జనసేన కూడా భాగస్వామ్యం ఉంది. కనీసం ప్రభుత్వానికి సంబంధించిన దేవాలయాలకు కూడా నోటీసులు ఇవ్వలేదు. దేవతామూర్తుల విగ్రహాలను చెత్త ట్రాక్టర్లో తీసుకువెళ్లారు. అప్పట్లో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవాలయాలను ప్రతిష్ట చేస్తామన్నారు. మొత్తం ఇరవై మూడు దేవాలయాలు పగల గొట్టారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొత్తం 23 దేవాలయాల్లో 19 దేవాలయాలు నిర్మించారు. దేవాలయాలు కూల్చివేతతో చంద్రబాబుకు పతనం ప్రారంభమైంది. గత ప్రభుత్వం కూల్చేసిన దేవాలయాలను మా ప్రభుత్వం తిరిగి నిర్మిస్తోంది' అని మంత్రి వెల్లంపల్లి వివరించారు.
ఏపీ అసెంబ్లీలో తీరుమార్చుకోని టీడీపీ ఎమ్మెల్యేలు
టీడీపీ సభ్యులు అసెంబ్లీలో వింతగా ప్రవర్తించారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలు విజిల్ వేశారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా మర్యాదను కాపాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 25వరకు సాంబశివరావు, గద్దె రామ్మోహన్ సస్పెన్షన్ వేటు వేశారు. విజిల్ వేసిన మిగతా టీడీపీ సభ్యుల్ని ఈ ఒక్క రోజు సస్పెండ్ చేశారు.
టీడీపీ సభ్యుల ఆందోళన.. మండలి వాయిదా
శాసనమండలిలో మద్యపాన నిషేధంపై తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై మంత్రి బుగ్గన వివరణ ఇస్తుండగా సభ్యులు ఆందోళన చేశారు. దీంతో చైర్మన్ శాసనమండలిని 10 నిమిషాలపాటు వాయిదా వేశారు.
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వింత ప్రవర్తన
సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బాలినేని సమాధానమిస్తుండగా టీడీపీ సభ్యులు వింతగా ప్రవర్తించారు. టీడీపీ సభ్యుడు సాంబశివరావు విజిల్ వేశారు. దీనిపై సీరియస్ అయిన స్పీకర్.. సభా మర్యాదను కాపాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు.
నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. సభకు పదేపదే ఆటంకం కలిగించడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. బెందాళం అశోక్, రామరాజు, సత్యప్రసాద్, రామకృష్ణ లపై సస్పెన్షన్ వేటు పడింది.
కచ్చితంగా వారికి శిక్ష పడుతుంది: మంత్రి బాలినేని
'టెరాసాఫ్ట్ కంపెనీ చంద్రబాబుకి అత్యంత సన్నిహితులది. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు ఇచ్చారు. వాళ్లు నాసిరకంగా పనులు చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీని బ్లాక్ లిస్టు నుంచి తొలగించారు. బ్లాక్ లిస్టు చేసిన అధికారి దాన్ని తొలగించాలి. కానీ ఆయన కింద స్థాయి అధికారి దాన్ని తొలగించారు. బ్లాక్ లిస్టులో ఉన్నప్పటికీ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించారు. దీనికి అప్పటి ప్రభుత్వ పెద్దల సహాకారం ఉంది. నకిలీ సర్టిఫికెట్స్ కూడా పెట్టి అర్హత సాధించారు. ఈ విషయంలో ప్రభుత్వం విచారణ చేస్తోంది. దీనిలో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టేది లేదు. కచ్చితంగా వీరికి శిక్ష పడుతుంది' అని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
‘టెండర్లు వేయడానికి ఒక రోజు ముందు బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగింపు’
ఫైబర్ గ్రిడ్ టెండర్లలో 5 కంపెనీలు పాల్గొన్నాయని, టెండర్లు వేయడానికి ఒక రోజు ముందు టెరాసాఫ్ట్ కంపెనీని బ్లాక్‌లిస్ట్ నుంచి తొలగించారని మంత్రి బాలినేని శ్రీనివాస్ ఆరోపించారు. టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడని, టెండర్లలో టెరాసాఫ్ట్ కంపెనీ తక్కువ కోడ్ చేసినప్పటికీ వారికే టెండర్ దక్కిందని చెప్పారు.
ఫైబర్‌గ్రిడ్ పెద్ద స్కాం.. టెండర్స్‌లో భారీగా అవకతవకలు
పెగాసస్ స్పైవేర్ పెద్ద స్కాం అని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. 'ఇది స్పైవేర్ స్కాంలకు తల్లివేరు లాంటిది. ఫైబర్‌గ్రిడ్ పెద్ద స్కాం. ఈ టెండర్స్‌లో భారీగా అవకతవకలు జరిగాయి. టెండర్లు వేయడానికి కంపెనీ ఏర్పాటు చేసి 3 ఏళ్లయి ఉండాలి. కనీసం రూ.350 కోట్లు ఉండాలన్నది టెండర్ కండీషన్. నిబంధనలు పాటించకుండా ఫైబర్‌గ్రిడ్‌ను టెర్రాస్ కంపెనీకి అప్పగించారు. అనుభవం లేని టెర్రాస్ కంపెనీకి ఫైబర్‌గ్రిడ్ అప్పగించారని మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు.
ప్రశ్నోత్తరాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఫైబర్ గ్రిడ్ అవినీతిపై వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించారు. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమాధానమిచ్చారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
పదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
మరికాసేపట్లో పదోరోజు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి: కాసేపట్లో పదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ప్రశ్నోత్తరాల్లో ఫైబర్‌గ్రిడ్ అవినీతి, ఆంగ్ల మాధ్యమం, అమ్మఒడి తదితర అంశాలు ఉండనున్నాయి. అనంతరం ప్రభుత్వం పలు బిల్లులను ఆమోదం కోసం సభ ముందు ఉంచనుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రగతిపై స్వల్ప కాలిక చర్చ జరపుతారు.
Comments
Please login to add a commentAdd a comment