సాక్షి, అమరావతి: మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల అక్రమ మళ్లింపు, అక్రమ పెట్టుబడుల వ్యవహారాల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారాలను సమర్థిస్తూ సదస్సులు, సమావేశాల్లో మాట్లాడుతున్న వారికి, లేఖలు రాస్తున్న వారికి, ప్రకటనలు ఇస్తున్న వారికి నోటీసులు జారీచేస్తోంది. ఏ ఆధారాలతో ఏ ప్రాతిపదికన అలా మాట్లాడారో వచ్చి వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో సీఐడీ పేర్కొంది.
మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారాలన్నీ సక్రమమే.. కేవలం రామోజీరావును వేధించేందుకే ఈ కేసు పెట్టారని జీవీఆర్ శాస్త్రి అనే ప్రొఫెసర్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆయనకూ నోటీసు ఇవ్వాలని సీఐడీ విభాగం నిర్ణయించింది. అసలు కేంద్ర చిట్‌ఫండ్ చట్టం, ఏపీ డిపాజిటర్ల హక్కుల పరిరక్షణ చట్టాల గురించి ఏం తెలుసు.. ఆ చట్టాలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉల్లంఘించలేదని ఎలా చెప్పగలుగుతున్నారని సీఐడీ ఆయన్ని ప్రశ్నించనుంది.
మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక వ్యవహారాలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందని ఏ ప్రాతిపదికన లేఖ రాశారో కూడా ఆయన వివరణ కోరనుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ నమోదు చేసిన కేసును తప్పుబడుతూ ఏపీలో వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో సదస్సులు, సమావేశాల్లో ప్రసంగించిన ఆడిటర్లు, న్యాయవాదులు, ఇతర రంగాలకు చెందిన వారికీ సీఐడీ నోటీసులివ్వనుంది. మార్గదర్శి చట్టాలను ఉల్లంఘించ లేదనడానికి వారివద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని ఆదేశించనుంది.
చదవండి: చట్టాలకు రామోజీ అతీతుడా!
వివరణలను రికార్డ్ చేయనున్న సీఐడీ
ఇక మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమ వ్యవహారాలపై సీఐడీ దర్యాప్తు.. మరోవైపు న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్నాయి. ఏ–1గా ఉన్న రామోజీరావు, ఏ–2గా ఉన్న శైలజలు ఎలాంటి తప్పుచేయలేదని, చట్టాలను ఉల్లంఘించలేదని ఏ ప్రాదిపదికన, ఏ ఆధారాలతో మాట్లాడారో వారు వివరించాల్సి ఉంది. నోటీసులకు వారు వ్యక్తిగతంగా హాజరై ఇచ్చే వివరణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని నిర్ణయించింది. కేసు దర్యాప్తులో ఆ అంశం కీలకంగా మారుతుందన్నది సీఐడీ ఉద్దేశం. ఆధారాల్లేకుండా కేవలం సీఐడీపై దు్రష్పచారం చేసేందుకు వారు నిరాధారణ ఆరోపణలు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని సీఐడీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment