సాక్షి, గుంటూరు: కృష్ణాజలాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జలాలపై కేంద్రం తాజా విధివిధానాల జారీ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఈ సమావేశం నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. నదీజలాల పంపిణీపై గతంలో ఇచ్చిన కేటాయింపులపై ఈ సందర్భంగా సమగ్రంగా చర్చించారు సీఎం జగన్. అంతేకాదు.. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది.
KWDT-2 తీర్పుద్వారా.. మిగులు జలాల కేటాయింపుల్లోనూ నష్టం జరిగిన అంశంపైనా ఈ భేటీలో చర్చించారు. ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు భంగకరమని, రాష్ట్ర విభజన చట్టాన్ని మీరి ఈ మార్గదర్శకాలు ఉన్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘించేలా ఉందని, ఇప్పటికే సుప్రీంకోర్టు ముందు పలు పిటిషన్లు పెండింగ్ ఉండగా కూడా గెజిట్ విడుదలచేశారని అధికారులు ప్రస్తావించారు.
2002కు ముందు చేసిన ట్రైబ్యునల్ కేటాయింపులను, పంపకాలను పునఃపరిశీలించరాదని చట్టం చెప్తున్నా.. దీనికి విరుద్ధంగా కేంద్రం విధివిధానాలు చేసిందని అధికారులు వివరించారు. దీంతో.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని.. ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్లాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ భేటీలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, పలువురు న్యాయ నిపుణులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కృష్ణా జలాలపై ప్రధానికి సీఎం జగన్ లేఖ
Comments
Please login to add a commentAdd a comment