పులివెందుల రుణం ఎప్పటికీ తీరనిది: సీఎం జగన్‌ | AP CM YS Jagan Launches Development Schemes In Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందుల రుణం ఎప్పటికీ తీరనిది: సీఎం జగన్‌

Published Thu, Dec 24 2020 2:28 PM | Last Updated on Thu, Dec 24 2020 6:59 PM

AP CM YS Jagan Launches Development Schemes In Pulivendula - Sakshi

సాక్షి, కడప : పులివెందుల ప్రాంతానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా కడప జిల్లా పులివెందుల చేరుకున్న సీఎం రూ.5 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం పులివెందులలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుని.. ఆర్టీసీ బస్టాండ్‌, డిపోలకు శంకుస్థాపన చేశారు. అలాగే స్థానిక దేవాలయాల అభివృద్ధి, బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలకు శంకుస్థాపన చేసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలో చేపట్టిన కొత్త బీటీ రోడ్లకు శంకుస్థాపన నిర్వహించారు. గండికోట-సీబీఆర్, గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీం, 4 మోడల్ పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభించారు. 



పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. వచ్చే ఫిబ్రవరిలో వైఎస్ఆర్ వైద్య కళాశాల పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు 5 సబ్‌స్టేషన్ల ఏర్పాటు చేయనున్నామన్నారు. యురేనియం బాధిత గ్రామాల్లో సాగు, తాగునీటి పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.  జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అదనపు భవనాలను నిర్మిస్తామని తెలిపారు. ‘వేంపల్లిలో డిగ్రీ కాలేజీకి నూతన శాశ్వత భవనాలను ఏర్పాటు చేస్తాం. నల్లపల్లిచెరువుపల్లిలో 130 కేవీ సబ్‌ స్టేషన్‌తో 14 గ్రామాలకు మంచి జరుగుతుంది. వేంపల్లిలో కమ్యూనిటీ ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు పెంచుతున్నాం. పులివెందులలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులు జరుగుతున్నాయి. 18 కొత్త దేవాలయాలు, 51 దేవాలయాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వేంపల్లి ఉర్దూ కళాశాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. పులివెందులలో మోడల్ పోలీస్ స్టేషన్ పనుల పురోగతి మరింత వేగవంతంగా సాగుతున్నాయి.

పునరావాసంకు రూ. 665 కోట్లు..
గండికోట రిజర్వాయర్‌పై కొత్త లిఫ్ట్‌ ఇరిగేషన్ పనులు మార్చిలో ప్రారంభిస్తాం. రూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్ పనులు చేపడుతున్నాం. శ్రీశైలంలో 881 అడుగులు ఉంటే తప్ప పోతిరెడ్డిపాడుకు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం రాదు. గత 15 ఏళ్లలో లెక్కలు చూస్తే 20-25 రోజుల మాత్రమే పూర్తిస్థాయి నీరుంది. పులివెందుల ఆర్డీసీ డిపో పనులు డిసెంబర్ 25న ప్రారంభం కానున్నాయి. గండి వీరాంజనేయ క్షేత్రంలో గర్భాలయం, ధ్వజస్తంభం పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం. గండికోటలో రిజర్వాయర్‌లో 26 టీఎంసీల పూర్తిసామర్థ్యాన్ని ఎప్పుడూ నింపలేదు. రూ.665 కోట్లతో పునరావాసం చెల్లించి 26.85 టీఎంసీల నీటిని నింపాం. రూ.247 కోట్లు R&R కింద ఇచ్చి చిత్రావతిలో 10.13 టీఎంసీల నీటిని నింపాం. గండికోట, చిత్రావతి నిర్వాసితులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారి త్యాగాల వల్లనే లక్షలాది రైతులకు మేలు జరుగుతుంది. నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నాను. నిర్వాసితులు చిరునవ్వుతో ఉండేలా చర్యలు తీసుకోవాలి.’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement