సాక్షి, తూర్పు గోదావరి: కోర్టులో ఓ జడ్జిగారి ముందుకు వచ్చి.. ‘అయ్యా.. తల్లిదండ్రులు లేని వాడ్ని నన్ను శిక్షించకండి’ అని బోరున ఒకాయన ఏడ్చాడట. ఆ ఏడ్పు చూసి జడ్జిగారు చలించి పోయి, జాలిపడి.. ప్రాసిక్యూటర్‌ను అడిగాడట. ‘ఇంతకీ ఈ మనిషి చేసి తప్పేంటని?’ అడిగారా జడ్జి. ‘‘నిజమే సార్.. ఈ మనిషికి తల్లిదండ్రులు లేరు సార్. కారణం, ఆ తల్లిదండ్రులను చంపేసిన వ్యక్తే ఈ వ్యక్తి సార్’’ అని జడ్జికి బదులు ఇచ్చాడు ఆ ప్రాసిక్యూటర్. చంద్రబాబును చూస్తే ఇలాగే అనిపిస్తోందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఎన్టీఆర్‌ను అడ్డుపెట్టుకుని శవరాజకీయాలు చేసే నైజం ప్రతిపక్ష నేత చంద్రబాబుదని సీఎం జగన్ విమర్శించారు. రాజమండ్రి వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీదారుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన టీడీపీ అధినేతపై విమర్శలు సంధించారు. ‘‘ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది ఈయనే. ఎన్నికలప్పుడు ఫొటోకి దండ వేసి మహానుభావుడంటూ ఓట్లు అడిగేది ఈయనే. చంపేది ఈయనే.. మళ్లీ మొసలి కన్నీరు కారుస్తాడని’ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఈ పెద్ద మనిషికి తెలిసింది వెన్నుపోటు పొడవడం, ఫొటోషూట్, డ్రామాలు చేయడం, మొసలి కన్నీరు కార్చడం.. ఇవి మాత్రమే తెలుసన్నారాయన.
ఇదే ఫొటో షూట్ కోసం, డ్రోన్ షాట్‌ల కోసం ఇదే రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి 29 మందిని బలి తీసుకున్నాడు. నిలదీస్తే.. కుంభమేళాలో చనిపోలేదా? అంటూ మాట్లాడతాడు. కందుకూరు సభలో జనం తక్కువ వస్తే.. ఎక్కువ వచ్చారని చూపించేందుకు రోడ్డు మీద ఒక సందులో జనాలను నెట్టి ర్యాలీ నిర్వహించాడు. అక్కడ ఎనిమిది మందిని బలిగొన్నాడు. వెంటనే మౌనం పాటించాలంటాడు.. ఆస్పత్రికి వెళ్తాడు.. మళ్లీ షూటింగ్ కోసం వస్తాడు. చనిపోయిన వాళ్లకు చెక్కు పంపిణీలంటాడు. తాను వచ్చేదాకా చీరలు కూడా పంచొద్దంటూ. చంపేసి మానవతావాదిలా చంద్రబాబు డ్రామాలు ఆడతాడు. ఇవేకాదు..
కొత్త సంవత్సరం రోజున మరో ముగ్గురిని బలి తీసుకున్నాడు. ఇదంతా మనం చూస్తున్నాం. ఇదంతా గమనించాలి కూడా. ఇంత డ్రామాలను ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి రాయవు. దత్తపుత్రుడు ఏనాడూ నిలదీయడు. తానే పేదలను చంపేసి.. టీడీపీ కోసం ప్రాణత్యాగం చేశాడంటాడు చంద్రబాబు అని సీఎం జగన్ నిలదీశారు. అలాంటి పెద్ద మనిషిని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఎల్లో మీడియా, దత్తపుత్రుడు ప్రయత్నిస్తున్నాయని సీఎం జగన్ తెలిపారు. అలాంటివేం తనకు లేకున్నా.. తనకు ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. మీ బిడ్డ నమ్ముకుంది అన్ని వర్గాలను, పేదలను. జాగ్రత్తగా ఆలోచన చేయండి.. పొరపాటు చేస్తే నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లేనని తెలిపారు. దేవుడి దయతో ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని, ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment