![AP Government teachers are exempted from non teaching duties - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/29/Teachers.jpg.webp?itok=tZr8xv4t)
సాక్షి, విజయవాడ: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు.. ఉపాధ్యాయులు అకడమిక్ ఆచివమెంట్ లెవెల్ పెంచేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ పరిధి కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇకపై ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కానున్నారు. మంగళవారం వర్చువల్‌గా భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ వెలువరించింది. విద్యా శాఖ కార్యదర్శి రాజశేఖర్ పేరిట నోటిఫికేషన్ జారీ అయ్యింది.
అనేక సందర్భాల్లో బోధనేతర బాధ్యతలు భారం తగ్గించాలని కోరుతూ వస్తున్నారు ఉపాధ్యాయులు. అంతేకాదు.. ఉపాధ్యాయులు బోధనేతర విధులకు నిషిద్ధమని విద్యా హక్కు చట్టం చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీచర్లను బోధనేతర కార్యకలాపాలకు వినియోగిస్తామని ఆ నోటిఫికేషన్ లో ప్రభుత్వం వెల్లడించింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగులంతా విధులకు నియమించగా ఇంకా అవసరం ఉన్నప్పుడు మాత్రమే బోధనేతర విధులను అప్పగించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment