సాక్షి, అమరావతి: విశాఖలోని రుషికొండ రిసార్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి పర్యావరణ ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. చట్టపరమైన అనుమతులన్నీ తీసుకున్న తరువాతే పునరుద్ధరణ పనులు ప్రారంభించామని, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని తెలిపింది. ఆర్థిక, పర్యాటక అవకాశాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను అడ్డుకోవాలన్న దురుద్దేశంతోనే ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారని పేర్కొంది. తప్పుడు ఆరోపణలతో దాఖలైన వ్యాజ్యాలను భారీ జరిమానాతో కొట్టి వేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) నియమించిన నిపుణుల కమిటీ సైతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి చట్ట ఉల్లంఘనలు జరగ లేదని తేల్చినట్లు గుర్తు చేసింది.
అడ్డుకునేందుకు జనసేన, టీడీపీ వ్యాజ్యాలు...
విశాఖ జిల్లా యండాడ గ్రామం సర్వే నెంబర్ 19 పరిధిలోని కోస్టల్ రెగ్యులేషన్ జోన్‌లో చెట్ల నరికివేత, భూమి తవ్వకాలకు అధికారులు అనుమతించడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ (ఎంఓఈఎఫ్) అనుమతులకు, విశాఖపట్నం పట్టణ ప్రాంతాభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధమంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గతేడాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కూడా పిల్ దాఖలు చేశారు.
ఈ రెండు వ్యాజ్యాలపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కేవలం రిసార్ట్ పునరుద్ధరణకు సంబంధించినదని, దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం తరఫున దాఖలు చేసిన కౌంటర్‌లో పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కూనపరెడ్డి కన్నబాబు నివేదించారు. రిసార్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో పునరుద్ధరిస్తున్నట్లు కౌంటర్‌లో తెలిపారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరపనుంది.
కౌంటర్‌లో ముఖ్యాంశాలు ఇవీ...
40 కాదు.. 9.88 ఎకరాల్లోనే
‘రూ.240 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నాం. కాలుష్య నియంత్రణ మండలి నుంచి నిరభ్యంతర పత్రం, సీఆర్‌జెడ్ అనుమతులు, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతులు, రాష్ట్ర అటవీశాఖ అనుమతులు తీసుకున్నాం. ప్రాజెక్టును అడ్డుకునేందుకు కొందరు హరిత ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేశారు. ట్రిబ్యునల్ నియమించిన నిపుణుల కమిటీ ప్రాజెక్టును పరిశీలించి ఎలాంటి పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరగడం లేదని తేల్చింది. అంతేకాక సీఆర్‌జెడ్–2లోనే ఈ ప్రాజెక్టు ఉందని చెప్పింది. అయినా కూడా ట్రిబ్యునల్ రిసార్ట్ పునరుద్ధరణ పనులపై స్టే విధించింది.
సుప్రీంకోర్టు ఈ స్టేను ఎత్తివేసింది. హైకోర్టునే మిగిలిన అంశాలన్నింటినీ తేల్చమని ఆదేశించింది. నిరాధార ఆరోపణలు మినహా ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణం ఎలా ప్రభావితం అవుతుందో పిటిషనర్లు ఆధారాలు చూపలేకపోయారు. ఈ ప్రాజెక్టు కంభాలకొండ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం పరిధిలోకి రాదని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ తేల్చింది. 40 ఎకరాల్లో పనులు చేస్తున్నామని పిటిషనర్లు చెబుతున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు పనులు 9.88 ఎకరాల్లోనే జరుగుతున్నాయి.
అనుమతుల మంజూరు సందర్భంగా విధించిన ఏ షరతునూ మేం ఉల్లంఘించలేదు. తవ్విన మట్టిని రోడ్డు మార్జిన్ల కోసం ఉపయోగిస్తున్నామే కానీ సముద్రం వద్ద పారేయడం లేదు. పొదలు, సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం గుర్తించిన చెట్లను మాత్రమే తొలగించాం. ఇందుకు అటవీశాఖ అనుమతులు కూడా తీసుకున్నాం. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ (వీఎంఆర్) మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా మేం వ్యవహరించడం లేదు’ అని కన్నబాబు కౌంటర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment