
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20 వేల లోపు సొమ్ము డిపాజిట్ చేసి.. నష్టపోయిన బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆ మొత్తాన్ని చెల్లించనుంది. న్యాయస్థానాల పరిధిలో ఉన్న ఈ అంశంపై హైదరాబాద్ హైకోర్టు నుంచి ఆదేశాలు రాగానే బాధితులకు సొమ్ము అందజేస్తారు. అలాగే రూ.10 వేలులోపు డిపాజిట్ చేసిన బాధితులు ఎవరికైనా మొదటి విడతలో ఆ సొమ్మును అందకపోయి ఉంటే వారికి కూడా చెల్లింపులు జరుపుతారు. ఈ విషయాన్ని రాష్ట్ర సీఐడీ విభాగం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టారు.
బాధితులకు మొత్తం రూ.1,150 కోట్లు చెల్లించేందుకు గానూ 2019 అక్టోబరు 25న ప్రభుత్వం జీవో జారీ చేసింది. అందులో భాగంగా మొదటి విడతలో రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన 3,69,655 మంది బాధితులకు 2019 నవంబర్‌లో నష్టపరిహారం చెల్లించింది. అయితే వారిలో ఇంకా కొందరికి ఆ పరిహారం అందలేదని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో సీఎం వైఎస్ జగన్ ఇటీవల స్పందిస్తూ.. వెంటనే వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులతో పాటు గతంలో రూ.10 వేల లోపు పరిహారం పొందని వారికి కూడా ఆ మొత్తం చెల్లించాలని నిర్ణయించినట్టు సీఐడీ విభాగం తెలిపింది. హైకోర్టు క్లియరెన్స్ కోసం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని, ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment