దుష్ప్రచారాలపై చట్టపరంగా చర్యలు | AP Govt is seriously considering propaganda on covid control and vaccination | Sakshi
Sakshi News home page

దుష్ప్రచారాలపై చట్టపరంగా చర్యలు

Published Sun, May 9 2021 3:57 AM | Last Updated on Sun, May 9 2021 4:07 AM

AP Govt is seriously considering propaganda on covid control and vaccination - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నివారణ, వ్యాక్సినేషన్‌ చర్యలపై దుష్ప్రచారాలను తీవ్రంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవాల్లేకుండా ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, తప్పుదోవ పట్టించడమే  లక్ష్యంగా దుష్ప్రచారాలకు పాల్పడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుతో పాటు ఓ వర్గం మీడియాపై వస్తున్న ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కేంద్రం నుంచి రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సరిపడినంత కొనుగోలు చేయడానికి సిద్ధపడినప్పటికీ కేంద్రం కేటాయించిన మేరకే ఉత్పత్తికంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఈ విషయాలను మరుగున పరిచి వ్యాక్సినేషన్‌పై చంద్రబాబుతో పాటు ఓవర్గం మీడియా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది.

టీకా ఉత్సవ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులోనే 6.29 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసిన విషయాన్ని ప్రస్తావించకుండా ఆవర్గం మీడియా అవాస్తవాలతో కట్టుకథలు అల్లుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కోవిడ్‌–19 నియంత్రణకు, చికిత్సకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందిస్తున్న సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చేస్తున్న దుష్ప్రచారాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కోవిడ్‌–19 నియంత్రణ చర్యల్లో భాగంగా ఒక పక్క పెద్దఎత్తున పరీక్షలను నిర్వహిస్తూ కోవిడ్‌ లక్షణాలున్న వారిని ఆస్పత్రుల్లో చికిత్సలకు చేర్పిస్తున్నప్పటికీ.. ఆ విషయాలను మరుగు పరిచి బెడ్లు ఖాళీ లేవంటూ అవాస్తవాలను ప్రచారం చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ‘రోజూ ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లున్నాయి. ఎంత మంది చికిత్స పొందుతున్నారు. ఇంకా ఎన్ని బెడ్లు అందుబాటులో ఉన్నాయి’ అనే వివరాలను ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి తెలియజేస్తున్నప్పటికీ ఆవర్గం మీడియా ఆ విషయాలను చెప్పకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement