సాక్షి, అమరావతి: రైతు వద్ద టమాటా కిలో ధర రూ.5. అదే ప్రాసెస్ చేసి సాస్ రూపంలో అమ్మితే లీటర్ బాటిల్ ధర రూ.99 నుంచి 160. మొక్కజొన్న కిలో రూ.14. అదే ప్రాసెస్ చేసి అమ్మితే కిలో రూ.90. మామిడి పండ్లు కిలో రూ.30. అదే జ్యూస్ రూపంలో అమ్మితే కిలో రూ.70.. జెల్లీ రూపంలో అమ్మితే రూ.300 పైమాటే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పంట విషయంలోనూ రైతుకు లభించేది మార్కెట్ ధరలో 5 నుంచి 10 శాతమే. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేయడం ద్వారా.. ఆ ఉత్పత్తులకు విలువను జోడించి రైతులకు మంచి ఆదాయం సమకూర్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు ఉపక్రమించింది.
ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా..
రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్లలో ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రభుత్వం నెలకొల్పుతోంది. ఇక్కడ ప్రాసెస్ చేసినా అమ్ముడు కాని పంటను.. సెకండరీ ప్రాసెసింగ్ చేసి మార్కెట్‌లోకి తీసుకురావాలన్న ఆలోచనతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయబోతోంది. ఈ క్లస్టర్లలో వంద శాతం ప్రభుత్వ నిధులతో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి వాటి నిర్వహణ బాధ్యతలను లీజు ప్రాతిపదికన బహుళ జాతి కంపెనీలకు అప్పగిస్తారు. సదరు కంపెనీలు విధిగా తొలుత స్థానికంగాను, ఆ తర్వాత రాష్ట్ర పరిధిలో వ్యవసాయ ఉత్పత్తులను రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తాయి. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి ఆ కంపెనీలే మార్కెటింగ్ చేస్తాయి.
43 యూనిట్ల గుర్తింపు
ఇప్పటికే స్థానికంగా లభించే పంట ఉత్పత్తుల ఆధారంగా 43 యూనిట్లను గుర్తించారు. ఒక్కో యూనిట్‌కు కనీసం 20 నుంచి 30 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. మరో 10 చోట్ల ఆక్వా ఆధారిత యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఏడాదిలోగా వీటి ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. రాష్ట్రంలో ఏటా 1.69 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు, 11.87 లక్షల టన్నుల అపరాలు, 8.96 లక్షల టన్నుల నూనె గింజలు, 1.75 కోట్ల టన్నుల పండ్లు, 77.30 లక్షల టన్నుల కూరగాయలు మిర్చి, పసుపు, అల్లం, తదితర సుగంధ ద్రవ్య పంటల ఉత్పత్తులు 16.69 లక్షల టన్నులు కాగా.. 42 లక్షల టన్నుల చేపలు, 1.30 లక్షల టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి.
ఇవికాకుండా రాష్ట్రంలో 2.31 కోట్ల మేకలు, గొర్రెలున్నాయి. వీటికి సరైన ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాల్లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌లో ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తోంది. ఈ ప్రక్రియ వల్ల ప్రభుత్వంపై భారం పడుతోంది. పైగా వీటిని నెలల తరబడి నిల్వ చేసి టెండర్ల ద్వారా విక్రయించడం వల్ల నాణ్యత తగ్గి నష్టం కలుగుతోంది. ఇలా గత ఏడాది సుమారు రూ.600 కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం కలిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేయడం వల్ల రైతులు పండించిన పంటకు విలువను జోడించి మంచి ధర వచ్చేలా చూడటంతోపాటు ప్రభుత్వానికి కూడా నష్టాలు తప్పుతాయి.
దేశంలోనే ఓ గొప్ప ప్రయోగం
పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల ఏర్పాటు చేయడమనేది దేశంలోనే తొలి ప్రయోగం. వీటివల్ల పంటలకు కనీస మద్దతు ధర రాదేమో అనే బెంగ రైతులకు ఉండదు. ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా వందలాది పరిశ్రమలు వస్తాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
– భరత్‌కుమార్ తోట, కన్సల్టెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ
రైతుకు నిజంగా ఎంతో మేలు
పండించిన పంటను ప్రాసెసింగ్ చేసే అవకాశం లేకపోవడం వల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఆరుగాలం శ్రమించి పండించే పంటను ప్రాసెస్ చేసే కంపెనీలు రూ.కోట్ల లాభాలను ఆర్జిస్తుంటే రైతులకు దక్కేది అంతంత మాత్రమే. సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇలా రైతుల కోసం పరితపించే ముఖ్యమంత్రి మరొకరు ఉండరు.
– ఎంవీఎస్ నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు, ఏపీ అగ్రిమిషన్
పండిన చోటే ప్రాసెస్
పంట పండించిన చోటే ప్రాసెస్ చేసి మార్కెట్‌లోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన, డెయిరీ, ఆక్వా ఉత్పత్తులు వృథా కాకుండా వాటినుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నది ప్రభుత్వ సంకల్పం. కనీస మద్దతు ధరతో పాటు వాటిని ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చే లాభాల్లో రైతులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. వీటి ఏర్పాటు ద్వారా కనీసం లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నాం.
– ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈవో,ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ
Comments
Please login to add a commentAdd a comment