సాక్షి, అమరావతి: ఓ యువతిని ఆమె సమ్మతికి విరుద్ధంగా భర్త వద్దకు పంపించాలని తొలుత ఉత్తర్వులిచ్చిన హైకోర్టు.. ఆ తర్వాత దాన్ని సవరించింది. భర్త వద్దకు వెళ్లడం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని ఆ యువతి చెప్పడంతో న్యాయస్థానం.. తన ఉత్తర్వులను సవరించుకుంటూ ఆదేశాలిచ్చింది. తన భార్యను తన వద్దకు రాకుండా తాడిపత్రి ఎస్‌హెచ్‌వో నియంత్రిస్తున్నారంటూ పిటిషనర్ ఆరోపించినందున.. దీనిపై నిష్పాక్షిక విచారణ జరిపి ఈ నెల 14కల్లా నివేదిక ఇవ్వాలని అనంతపురం ఎస్పీ సత్య యేసుబాబుకు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను 15న చేపడతామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.(చదవండి: ఆధారాల్లేకుండా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు )
తన భార్య శ్రావణిని ఆమె తండ్రి రఘువీరా అక్రమంగా నిర్బంధించారని, ఆమెను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కేతిరెడ్డి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన కోర్టు.. ఆ యువతిని తీసుకుని న్యాయస్థానం ముందు హాజరుకావాలని అనంతపురం ఎస్పీని ఆదేశించింది. దీంతో ఆయన గురువారం శ్రావణితో పాటు హైకోర్టు ముందు హాజరయ్యారు. ప్రభుత్వ న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ.. ప్రేమ వివాహం తర్వాత ప్రవీణ్ వేధింపులు భరించలేక శ్రావణి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయిందని చెప్పారు. ఇందులో పోలీసుల పాత్ర లేదని తెలిపారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ.. ఈ కేసులో తాడిపత్రి ఎస్‌హెచ్‌వోపై ఆరోపణలు వచ్చాయని వ్యాఖ్యానించింది.(చదవండి: నక్సల్స్‌కు మద్దతుగా పిటిషన్లా?)
వసతి గృహంలో ఉంచాలి
అనంతరం శ్రావణిని ఆమె భర్త వద్ద విడిచిపెట్టాలని ఎస్పీని ఆదేశిస్తూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఆమెను వేధింపులకు గురి చేయరాదని భర్త ప్రవీణ్‌ను హెచ్చరించింది. ఈ క్రమంలో న్యాయవాది వివేకానంద జోక్యం చేసుకుంటూ.. భర్త వద్దకు వెళ్లడం శ్రావణికి ఇష్టం లేదన్నారు. దీంతో ధర్మాసనం.. శ్రావణితో మాట్లాడగా, భర్త వద్దకు వెళ్లడం ఇష్టం లేదని తేల్చిచెప్పింది. అయితే మరో న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి ఆ యువతితో తెలుగులో మాట్లాడారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు, భర్తతో ఉండేందుకు ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. పెళ్లి చేసుకున్నప్పుడు భర్తతో ఉండాలని సూచించారు.
అయితే ఆ యువతి మాత్రం భర్త వద్దకు వెళ్లనని రెండోసారి కూడా తేల్చిచెప్పింది. దీంతో ఆ యువతి తన ఇష్టమొచ్చిన చోటుకు వెళ్లేందుకు అనుమతినిచ్చేందుకు ధర్మాసనం సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రవీణ్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. తల్లిదండ్రులు ఆమెను ప్రభావితం చేశారని, అందువల్ల ఈ కేసు తేలే వరకు వసతి గృహంలో ఉంచాలని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరిస్తూ కృష్ణా లేదా గుంటూరు జిల్లాల్లో ఏదైనా ప్రభుత్వ వసతి గృహంలో ఉంచాలని పోలీసులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment