జనం సొమ్ముతో హైదరాబాద్‌లో ఇల్లా? | AP High Court Remarks On AP Election Commissioner | Sakshi
Sakshi News home page

జనం సొమ్ముతో హైదరాబాద్‌లో ఇల్లా?

Published Fri, Oct 23 2020 4:06 AM | Last Updated on Fri, Oct 23 2020 4:10 PM

AP High Court Remarks On AP Election Commissioner - Sakshi

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రెండు ఇళ్లా?.. ఎందుకు?.. హైదరాబాద్‌లో అధికార నివాసం ఏమిటి?.. ఆయన విధులు నిర్వర్తించాల్సింది ఎక్కడ నుంచి?.. అక్కడొక అధికార నివాసం, ఇక్కడొక అధికార నివాసం అంటే అందుకు ఎంత ఖర్చవుతున్నట్లు?.. ఆ డబ్బంతా ఎవరిది?.. ప్రజలదే కదా?.. మనమంతా పన్నుల రూపంలో చెల్లించే డబ్బే అంతిమంగా ఇలా దుర్వినియోగం అవుతోంది..  – నిమ్మగడ్డపై హైకోర్టు వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: ఎన్నికల నిర్వహణ విషయంలో తనకు ఆర్థిక, ఆర్థికేతర సహాయ, సహకారాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యంపై హైకోర్టు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహాయ, సహకారాలపై అనుబంధ అఫిడవిట్‌ను దాఖలు చేసిన నిమ్మగడ్డ అందులో ప్రధానంగా నిధుల గురించే ప్రస్తావించారు. న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజులు పెద్ద మొత్తంలో బకాయి ఉన్నాయని వెల్లడించారు. ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయాల్సి ఉందన్నారు.

సాయం కావాలంటూ కేసుల ప్రస్తావన ఏమిటి?
అనుబంధ వ్యాజ్యంపై తాజా విచారణ సందర్భంగా నిమ్మగడ్డ తరఫు న్యాయవాది డీవీ సీతారామమూర్తి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్‌ సిబ్బందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారని ప్రస్తావించడంతో న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ స్పందిస్తూ.. సహాయ, సహకారాల కోసం పిటిషన్‌ వేసి, ఈ కేసుల గురించి ఎందుకు చెబుతున్నారని, ఈ వ్యాజ్యంలో అవి అవసరమా? అని ప్రశ్నించారు. 

పోస్టుల భర్తీకి ప్రభుత్వాన్ని కోరారా?
ఆర్థికేతర సాయం అంటే ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించడంతో సిబ్బంది ఖాళీల భర్తీ అని సీతారామమూర్తి పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కావాలా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనుమతి అవసరమని, ఖాళీలను ప్రత్యక్ష పద్ధతిలో లేదా, డిప్యుటేషన్‌లో భర్తీ చేయవచ్చని సీతారామమూర్తి తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎప్పుడు కోరారని న్యాయమూర్తి ప్రశ్నించడంతో సీతారామమూర్తి జవాబు చెప్పలేకపోయారు.

ఆ డబ్బంతా న్యాయవాదుల ఫీజులకే..!
విచారణ సందర్భంగా పిటిషన్‌తోపాటు జత చేసిన పలు బిల్లులను పరిశీలించిన న్యాయమూర్తి అవన్నీ ఏమిటని ప్రశ్నించారు. అవి న్యాయవాదులకు చెల్లించాల్సిన బిల్లులని సీతారామమూర్తి పేర్కొనగా, అలా అయితే నిన్న ప్రభుత్వం విడుదల చేసిన రూ.39 లక్షలు ఈ బిల్లులు చెల్లించేందుకు అయిపోతాయని న్యాయమూర్తి నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘ఈ డబ్బంతా ప్రజలదే. ఎంతోమంది పన్నుల రూపంలో చెల్లించిన డబ్బు ఇలా న్యాయవాదుల ఫీజులకు వెళుతుంది.. చాలా బాగుంది..’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సీతారామమూర్తి కేసుల గురించి చెప్పేందుకు ప్రయత్నించడంతో.., కేసుల గురించి అవసరం లేదని, సహాయ, సహకారాల అంశానికే పరిమితం కావాలని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. 

ఎన్నికల నిర్వహణకు రూ.117 కోట్లు ఇచ్చాం...
ఎన్నికల కమిషన్‌కు ఏ రకమైన సహకారం కావాలో ప్రభుత్వాన్ని ఎన్నడూ కోరలేదని ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ నివేదించారు. సిబ్బంది ఖాళీల భర్తీ విషయాన్ని కమిషనర్‌ ప్రభుత్వ దృష్టికి తీసుకురాలేదన్నారు. రూ.40 లక్షలు అడిగితే ఇచ్చేశామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ ఏడాది జనవరి 21న రూ.95 కోట్లు ఇచ్చామని, గత ఏడాది జూన్‌లో రూ.9.52 కోట్లు ఇచ్చామని, ఇలా వివిధ సందర్భాల్లో ఎన్నికల నిర్వహణకు రూ.117 కోట్లు ఇచ్చామని సుమన్‌ తెలిపారు. 

ప్రజల డబ్బును ఇలా ఖర్చు చేయడం దురదృష్టకరం...
ఈ సమయంలో ఎన్నికల కమిషనర్‌ వ్యక్తిగత సిబ్బంది అంశం ప్రస్తావనకు వచ్చింది. నిమ్మగడ్డ రమేశ్‌కు హైదరాబాద్‌లో అధికార నివాసం ఉన్న విషయం కూడా న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. దీనిపై జస్టిస్‌ దేవానంద్‌ ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్‌ అధికార నివాసం హైదరాబాద్‌లో ఉండటం ఏమిటన్నారు. హైదరాబాద్‌లో అధికార నివాసం, విజయవాడలో మరో నివాసం అంటే ఎంత ఖర్చు అవుతున్నట్లని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇదంతా ప్రజాధనమని గుర్తు చేశారు. పన్నుల రూపంలో చెల్లించిన డబ్బంతా ఇలా దుర్వినియోగం అవుతోందని, అంతిమంగా ప్రజలే పరాజితులని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. న్యాయవాదులకు ఎన్నికల కమిషన్‌ చెల్లించాల్సిన ఫీజు రూ.5.61 కోట్లు ఉందని, ఇదంతా పన్నుల రూపంలో ప్రజలు చెల్లిస్తున్న డబ్బని, ఆ డబ్బును ఇలా ఖర్చు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement