సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఐసెట్–2020 పరీక్షా ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 51,991 మంది హాజరు కాగా 40890 ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 10, 11న పరీక్షలు నిర్వహించామని, రికార్డ్ టైంలో ఫలితాలు విడుదల చేశామన్నారు. టాప్-10 ర్యాంకుల్లో ఆరు ర్యాంకుల్లో వెనకబడిన కులాలు, షెడ్యూల్ కులాలకు చెందినవారే ఉన్నారన్నారు. 78.65 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని, తొలి పదిస్థానాల్లో నలుగురు అమ్మాయిలు చోటు దక్కించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇక నేటితో ఎంసెట్ పరీక్షల నిర్వహణ పూర్తైందన్న మంత్రి.. ఇంజనీరింగ్ విభాగంలో 156899 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. అదే విధంగా అగ్రికల్చర్, మెడిసిన్ విభాగాల్లో 75834 మంది హాజరయ్యారన్నారు. ఇక కరోనా వల్ల ఎంసెట్ లో 21 మంది, ఐసెట్‌లో ఆరుగురు అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదని తెలిపారు. వీరికి అక్టోబరు 7న పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐఐఐటీ అడ్మిషన్ల గురించి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా పదో తరగతి పరీక్షల ద్వారా ఐఐఐటి అడ్మిషన్స్ జరుగుతాయి. ఈసారి కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. కాబట్టి ఈ ఏడాది ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తాం. ఈ మేరకు ఆర్‌జీకేటీ తీర్మానం చేసింది.100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.
పార్ట్- 1లో 50 మార్కులకు మాథ్స్, పార్ట్- 2లో 59 మార్కులకు సైన్స్ ప్రశ్నలు ఉంటాయి. ప్రత్యేక్ష పద్దతిలోనే పరీక్షలు ఉంటాయి. ప్రతి మండలానికి ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు కు కసరత్తు చేస్తున్నాం. తెలంగాణలో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. 10 వ తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది’’అని తెలిపారు. నవంబర్ మొదటి, రెండు వారాల్లో పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment