సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధించి టాప్ –5 రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 2018లో కేవలం 64 పాయింట్లను మాత్రమే సాధించిన ఏపీ తాజాగా 72 స్కోర్ పాయింట్లను పొందడం, అగ్రశ్రేణి కోవలో నిలవడం, పలు అంశాల్లో టాప్ స్కోర్లను దక్కించుకోవడం రాష్ట్రం సత్తాను, అభివృద్ధి పథంలో పరుగులను రుజువు చేస్తోంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 75 శాతం స్కోర్‌తో కేరళ మొదటి స్థానంలో నిలవగా 74 శాతం స్కోర్‌తో హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. 72 శాతం స్కోర్‌తో ఏపీ మూడో స్థానంలో నిలిచింది.
మూడో విడత ఎస్డీజీ సూచీ నివేదికను నీతిఆయోగ్ గురువారం ఢిల్లీలో ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన, అసమానతలు తొలగింపు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ ఇతోధికంగా దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్ ప్రశంసించింది. ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ; డాష్ బోర్డ్ 2020–21 ః దశాబ్ద కాలపు కార్యాచరణలో భాగస్వామ్యాలు’ పేరుతో సూచీని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ ఆవిష్కరించారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకేపాల్, సీఈవో అమితాబ్ కాంత్, సలహాదారు సంయుక్త సమద్దార్ తదితరులు ఇందులో పాల్గొన్నారు.
పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా..
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాలు పేదరిక నిర్మూలనతో పాటు ఆహార భద్రతకు ఎంతో దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్ ప్రశంసించింది. పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా అవతరించే దిశగా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అడుగులు వేస్తోందని నివేదికలో పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిదైన పేదరిక నిర్మూలనలో ఆంధప్రదేశ్ 81 శాతం స్కోర్ సాధించి అగ్రగామి ఐదు రాష్ట్రాల సరసన నిలిచింది. ఆరోగ్యం, సంక్షేమంలో రాష్ట్రం 77 శాతం స్కోర్ సాధించింది. అగ్రవర్ణ పేదలకు కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పిస్తూ అసమానతలను రూపుమాపుతున్నారని నీతి అయోగ్ ప్రశంసించింది. పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తూ లింగ సమానత్వంలో రాష్ట్రం 58 శాతం స్కోర్‌తో అగ్రగామి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అసమానతలు రూపుమాపడంలో 74 శాతం స్కోర్‌తో దూసుకెళ్తోంది.
ఏపీలో 2020లో వృద్ధి కనిపించిన ఇండికేటర్లు
ఆకలి లేని స్థాయి లక్ష్యంలోని ‘వ్యవసాయ రంగంలో స్థూల అదనపు విలువ’లో పెరుగుదల నమోదు చేసుకుంది. ఆరోగ్యం, సంక్షేమం ఇండికేటర్‌లో ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటు తగ్గుదల, హెచ్‌ఐవీ కేసుల సంఖ్య తగ్గుదల నమోదైంది. ప్రతి పది వేల జనాభాకు వైద్య సిబ్బంది పెరుగుదలలో వృద్ధి కనిపించింది. లింగ సమానత్వం కేటగిరీలో మహిళలపై నేరాల సంఖ్య ఇండికేటర్‌లో తగ్గుదల నమోదైంది. పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వడం పెరిగింది. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత నీటి సరఫరా పెరిగింది. హత్యలు, వివిధ రకాల కేసుల సంఖ్య తగ్గింది.
సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌లో అగ్రగామి..
2019 డిసెంబరు 30న ఆవిష్కరించిన ఎస్డీజీ సూచీలో ఆంధ్రప్రదేశ్ 67 పాయింట్ల స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 2018 మొదటి ఎస్డీజీ సూచీలో 64 పాయింట్ల స్కోరుతో నాలుగో స్థానంలో ఉంది. తాజాగా మూడో విడత సూచీలో చౌక, సురక్షిత ఇంధన శక్తిలో వందకు వంద పాయింట్లు సాధించి టాప్‌లో నిలవడం గమనార్హం. సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో అగ్రగామిగా నిలిచింది.
అత్యున్నత ప్రమాణాలతో విద్య.. నాణ్యమైన వైద్యం
అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమంగా పనిచేస్తోందని నీతి అయోగ్ వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు ద్వారా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారు. ఆరోగ్యశ్రీతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడం, వైద్య సిబ్బందిని భారీ ఎత్తున నియమించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని.. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడమే అందుకు తార్కాణమని పేర్కొంది. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ.. సుపరిపాలన ద్వారా ప్రజలకు సామాజిక భద్రత చేకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబర్చుతోందని విశ్లేషించింది. 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధన వైపుగా ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని పేర్కొంది.
చదవండి: దేశ చరిత్రలోనే ప్రథమం.. కొత్త చరిత్రకు సీఎం జగన్ శ్రీకారం
సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రుల కృతజ్ఞతలు
Comments
Please login to add a commentAdd a comment