సాక్షి, అమరావతి: ప్రైవేట్ రంగానికి చెందిన పవన, సౌర విద్యుత్‌ను తీసుకోవడంలేదంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవంలేదని రాష్ట్ర విద్యుత్ శాఖ స్పష్టంచేసింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గుతున్నప్పటికీ పవన, సౌర విద్యుత్‌ను వచ్చినంతా తీసుకుంటున్నామని తెలిపింది. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలవల్ల కోత పెట్టలేని పరిస్థితి ఉందని వివరించింది. సాధ్యమైనంత వరకూ థర్మల్ విద్యుత్‌ను తగ్గించిన తర్వాతే వాటి వైపు వెళ్లాల్సి వస్తోందని పేర్కొంది. అదికూడా నిబంధనలకు అనుగుణంగా, గ్రిడ్ నిర్వహణను దృష్టిలో ఉంచుకునే కేవలం 4 శాతంలోపే కోత పెడుతున్నామని తెలిపింది. ఈ సందర్భంగా.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ విద్యుత్ లభ్యత, తీసుకున్నదీ గణాంకాలతో సహా ఇంధన శాఖ బుధవారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలు..
మా విద్యుత్ తీసుకోవాల్సిందే..
► సాధారణంగా సెప్టెంబర్‌లో రోజుకు 175 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుంది. కానీ, ఈ ఏడాది వర్షాలవల్ల ఒక్కసారిగా పడిపోయింది. 14న ఏకంగా 143 ఎంయూలకు.. 26న 146 ఎంయూలకు పడిపోయింది. నెలాఖరు వరకూ పెద్దగా మార్పులేదు.
► ఒక్కసారే రోజుకు 30 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ తగ్గితే.. ఉత్పత్తి తగ్గించడం తప్ప మరో మార్గంలేదని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ తెలిపింది. ఈ నిర్ణయం తీసుకోకపోతే గ్రిడ్‌కు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది.
► కేంద్ర నిబంధనల ప్రకారం రాష్ట్రంలో కేవలం 16 శాతం మాత్రమే సంప్రదాయేతర ఇంధన వనరులను అనుమతించాల్సి ఉంది. కానీ, గత ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ మొత్తంలో పీపీఏలు చేయడంవల్ల 26 శాతం ఈ విద్యుత్ వస్తోంది. డిమాండ్ లేకపోయినా తమ విద్యుత్ తీసుకోవాలని సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులు ఒత్తిడి చేస్తున్నారు.
ప్రజలపై భారం పడకూడదనే స్వల్పంగా ఉత్పత్తి తగ్గింపు
నిబంధనల ప్రకారం కేవలం 3.78 శాతం మాత్రమే పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని తగ్గించాం. దీనివల్ల ఆ సంస్థలకు ఎలాంటి నష్టం ఉండదు. ముందుగా జెన్‌కో థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించిన తర్వాతే.. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉండబట్టే అలా చేశాం. ఇది పీపీఏలకు ఏమాత్రం వ్యతిరేకం కాదు. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాన్ని ప్రైవేటు సోలార్, విండ్ ఉత్పత్తిదారులు అర్థం చేసుకోవాలి. అవసరం లేకున్నా తీసుకుంటే, ప్రజలపై భారం పడుతుంది.
– శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment