సాక్షి, పశ్చిమగోదావరి: అత్తాకోడళ్లు అంటేనే జగడాలకు మారుపేరుగా మారిపోయింది నేటి కాలంలో. టివీ సీరియళ్లలో అత్తాకోడళ్ళ పోరాట సన్నివేశ దృశ్యాలే ముందుగా కళ్ల ముందుకొస్తాయి. చాలా కుటుంబాల్లో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ నిత్యం ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే స్థాయికి చేరింది. అయితే అత్తాకోడళ్ల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది చాలా తక్కువగా వింటుంటాం. అత్తాకోడళ్లు అనుబంధం బాగుంటే ఆ ఇల్లు ఆనందంగా కళకళలాడుతుంది. కోడలిని కూతురిగా, అత్తను కూడా తల్లిగా భావించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం అత్తకోడళ్ళ మధ్య ఉన్న ప్రేమను చాటే ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
అయితే ఇది జరిగింది ఎక్కడో పరాయి దేశం, పక్క రాష్ట్రంలో కాదు. మన ఆంధ్రప్రదేశ్‌లోనే. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబంలో అత్తగారి పుట్టిన రోజుకు కోడలు ఏకంగా 60 రకాల వంటకాలను తయారు చేసింది. వంటకాలను ప్లాస్టిటిక్ డబ్బాల్లో నింపి వాటిపై పేర్లు రాసి పెట్టింది. పులిహోర మొదలు, కొబ్బరి రైస్, మ్యాగీ నూడిల్స్, పెరుగు ఇడ్లీ, వంకాయ బజ్జీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తనపై ఉన్న కోడలి ప్రేమను ఇలా రకరకాల వంటకాలు చేసి చూపించడంతో అత్త ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇక కోడలి వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అత్తాకోడళ్ళ బంధమంటే ఇలాగే ఉండాలంటూ కోడలిని మెచ్చుకుంటున్నారు. మాకూ అలాంటి వంటకాలుచేసే కోడలు ఉంటే బాగుండేదని, చూస్తుంటేనే నోరూరిపోతుందని కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment