
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్న వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ వల్ల మహిళల ఆరోగ్యానికి భరోసా లభిస్తోందని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటున్న మహిళలకు ఏ విధంగా భరోసా కల్పించాలనే అంశంపై జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ దేశంలోని అన్ని రాష్ట్రాల మహిళా కమిషన్లతో గురువారం వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళల ఆరోగ్యాన్ని కాపాడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నట్టు వివరించారు.
జాతీయ మహిళా కమిషన్ హెల్ప్‌లైన్‌ను దేశ వ్యాప్తంగా 900 మంది గర్భిణులు సహాయం కోరగా అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 50 మంది ఉన్నారని, వారికి తక్షణ వైద్య సహాయం అందే విధంగా ఏపీ మహిళా కమిషన్ కృషి చేసిందని తెలిపారు. ఏపీ మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్.సూయజ్ మాట్లాడుతూ మహిళల శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రభుత్వంతోపాటు మహిళా కమిషన్, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వెబినార్‌లో జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ మాట్లాడుతూ గర్భిణులకు వైద్యసహాయం అందించడంలో హెల్ప్‌లైన్ ద్వారా కృషి చేసిన ఏపీ మహిళా కమిషన్‌ను అభినందించారు.