సాక్షి, భీమవరం: తొలకరి పలకరింపుతో వాతావరణం చల్లబడింది. నిన్నటి వరకూ వేడిగాలులు, ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు జల్లులతో సేదతీరారు. సోమవారం వేకువజాము నుంచి ఉమ్మ డి పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షం కురిసింది.
ఖరీఫ్‌కు ఊరట
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. దాళ్వాలో ఆశాజనకమైన పంట చేతికి రావడం.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ముమ్మరంగా ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు సార్వా సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు పొలాల్లో పశువుల ఎరువు వేసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఉపాధి హామీ పథకంలో పంట కాలువలు, బోదెల్లో పూడికతీత పనులు జరుగుతుండటంతో సార్వా నారుమడులు వేయడానికి రైతులు కసరత్తు ప్రారంభించారు.
4.50 లక్షల ఎకరాల్లో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా నూతన పశ్చిమగోదావరి జిల్లాలో 2.55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. సార్వా సీజన్‌కు ఎంటీయూ 1061, 1064, 7029, 1121 వంగడాలు అనువుగా ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు రైతులు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు.
విత్తనాలు, ఎరువులు సిద్ధం
సార్వా వరి విత్తనాల్లో దాదాపు 90 శాతానికిపైగా పైగా రైతులు సమకూర్చుకోనుండగా మిగిలిన విత్తనాల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పశ్చి మగోదావరి జిల్లాలో రైతు భరోసా కేంద్రాల ద్వారా 351 కింట్వాళ్ల విత్తనాలను విక్రయానికి సిద్ధం చేశా రు. సార్వా పంటకు సుమారు 68 వేల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటిని రైతులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో రైతులు ఉత్సాహంగా మందస్తు సాగుకు సిద్ధమవుతున్నారు.
త్వరితగతిన నారుమడులు
వర్షాలు ప్రారంభమైనందున రైతులు సార్వా నారుమడులు సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే కాలువలకు కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేశారు. వెంటనే సాగు ప్రారంభిస్తే మూడో పంటగా అపరాల సాగుకు వీలుంటుంది. శివారు భూములకు నీరు అందడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో రైతులు విత్తనాలు సిద్ధం చేసుకోవాలి.
– పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment