సాక్షి, విజయవాడ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత, వంటి వివిధ వర్గాల ప్రజలు పొందిన ప్రయోజనాలపై ఆయా వర్గాల ప్రజలకు, మీడియాకు సమగ్ర సమాచారం ఇవ్వడం కోసం రాష్ట్రవ్యాప్తంగా తాము పర్యటించనున్నామని సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిశ్రమలు వంటి అంశాలపై పూర్తి సమాచారం కూడా అందచేస్తామని ఆయన వెల్లడించారు. "మళ్ళీ జగనే ఎందుకు రావాలి" అనే అంశంపై ప్రజలకు, మీడియాకు పూర్తి వివరాలు అందుబాటులోకి తెచ్చేందుకు తమ పర్యటన దోహద పడుతుందని ఆయన తెలిపారు. దీని గురించి వీలైనంత వరకు పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. ఈ నెల 16 నుంచి రాయల సీమ జిల్లాల్లో పర్యటించనున్నట్టు వెల్లడించారు. తొలి దశలో కర్నూలు, పుట్టపర్తి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో పర్యటించి పాత్రికేయులకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గత ఏడాది నవంబర్ 10న తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రెస్ అకాడమీ పేరును "మీడియా" అకాడమీగా మార్పు చేయాలన్న తమ సూచనను పరిగణన లోకి తీసుకుని సంస్థ పేరును " ఆంధ్ర ప్రదేశ్ సి.ఆర్. మీడియా అకాడమీ" గా మార్చినందుకు సీఎం వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. అన్ని వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్‌లతోనూ సత్సంబంధాలు నిర్వహిస్తూ, అందరినీ కలుపుకు పోయే ప్రయత్నం చేస్తూ గత ఏడాది కాలంలో సుమారు 100 కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించుకోగలిగామని చైర్మన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అన్నిటిలోనూ తమకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలు ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. వివిధ జర్నలిస్టుల యూనియన్లు తమ దృష్టి కి తెచ్చిన పలు సమస్యల పై సంబంధిత శాఖల అధికార్లతో ఎప్పటికప్పుడు చర్చించి తగు పరిష్కారాలు సాధించడం జరిగిందన్నారు.
వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కేర్ స్కీం అమలులో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వాహణాధికారితో చర్చించడం జరిగిందన్నారు. ఈ సమస్యలు త్వరితంగా పరిష్కరించేందుకు వీలుగా 104 హెల్ఫ్‌లైన్‌లో ఒక ప్రత్యేక లైన్ (నెంబర్.4)ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ అధికారి లిఖిత పూర్వకంగా తమకు తెలిపారని ఆయన వివరించారు.
వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రత్యేకంగా 6 నెలల జర్నలిజంలో డిప్లమో కోర్సును రూపొందించి, అతి సాధారణ ఫీజుతో నాగార్జున యూనివర్సిటీ తో కలిసి నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కోర్సు పూర్తయి విద్యార్థులంతా పరీక్షలు కూడా పూర్తి చేశారన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంచడంలో భాగంగా ప్రతి శనివారం ప్రత్యేక అంశాలపై ప్రముఖులతో "ఆన్ లైన్ క్లాసులు" నిర్వహించడం జరిగిందన్నారు. 28 వారాల పాటు వివిధ అంశాల పై ప్రముఖ రచయితలు, ప్రొఫెసర్లు, ఉన్నత అధికారులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ పాత్రికేయులు ఆన్ లైన్ క్లాసుల్లో ప్రత్యేక ప్రసంగాలు చేశారని ఆయన వెల్లడించారు. వర్కింగ్ జర్నలిస్టులకు ఉపయోగపడే అంశాలైన, పర్యావరణం, వృత్తి నైపుణ్యం, ఒత్తిడిని అధిగమించడంపై జిల్లాల్లో శిక్షణా తరగతులు, సెమినార్లు నిర్వహించడం జరిగిందన్నారు.
జర్నలిస్టులుగా పనిచేసి రిటైర్ అయి కాలం గడుపుతున్న సీనియర్ జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం తరపున వారిని సన్మానిస్తూ వారిని గౌరవించడం జరుగుతోందని ఆయన వివరించారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ద్వారా జర్నలిస్టు మిత్రులు రచించిన పుస్తకాలు కొనుగోలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలకు సరఫరా చేసే ఉత్తర్వులు వెలువడేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
వివిధ జిల్లాల్లో తాము పర్యటించిన సందర్భాల్లో జర్నలిస్టు యూనియన్లు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు కోరుతూ ఇచ్చిన విజ్ఞాపనలు ప్రభుత్వానికి అందించామని, ఆయా అంశాల పై ప్రభుత్వం స్పందించి తగు నిర్ణయాలు తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీఎం జగన్ నిర్ణయించడం జర్నలిస్టులందరికీ మేలు చేస్తుందని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
చదవండి: ఈనాడు కథనంపై ఏపీ గనుల శాఖ ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment