సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకులు మధ్యాహ్నం 2 గంటల వరకే పనిచేస్తాయని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రకటించింది. దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బ్యాంకింగ్ వేళలు తగ్గించాలన్న ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) సూచనల మేరకు రాష్ట్రంలో బ్యాంకింగ్ వేళలను తగ్గిస్తూ ఎస్‌ఎల్‌బీసీ గురువారం ఆదేశాలు జారీచేసింది. బ్యాంకులు శుక్రవారం నుంచి (నేటినుంచి) మే 15వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు మాత్రమే పనిచేస్తాయని తెలిపింది.
బ్యాంకులు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, రెమిటెన్స్‌లు, ప్రభుత్వ లావాదేవీలను తప్పనిసరిగా కొనసాగించాలని, ఇతర సేవలను ప్రాధాన్యత, అవసరాన్ని బట్టి మాత్రమే కొనసాగించాలని స్పష్టం చేసింది. అత్యవసరమైన వారు మాత్రమే బ్యాంకుకు రావాలని, మిగిలిన వారు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించింది. రాష్ట్రంలోని బ్యాంకు ఉద్యోగులందరికీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి, వారి కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఎస్‌ఎల్‌బీసీ ఆదేశాల్లో మరికొన్ని..
►తక్కువ సిబ్బందితోనే బ్యాంకింగ్ సేవలు కొనసాగించండి. వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం ఉన్న వారికి అవకాశం కల్పించండి.
►పెన్షన్, డీబీటీ వంటి చెల్లింపులకు సంబంధించి ఇబ్బందులు లేకుండా నిధులు ఉంచుకోండి. ఏటీఎంలు, వాటికి సంబంధించిన ఇతర సేవలు సాధారణంగానే కొనసాగుతాయి.
►బ్యాంకులు ఇంటి వద్ద బ్యాంకింగ్ సేవలను కొనసాగించాలి.
►ఏటీఎంలు, బీసీలు, సీడీఎం వంటి కార్యకలాపాలకు ఆటంకాలు లేకుండా చూడాలి.
►డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోండి.
►బాం్యకులు, ఏటీఎంలు, బీసీల వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి
►కోవిడ్ నియంత్రణకు కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలను అందరూ పాటించాలి
►భౌతికదూరం పాటించడం, కార్యాలయాలను శానిటైజేషన్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలి.
►తగ్గించిన బ్యాంకు పనివేళలు తెలిసే విధంగా ముఖద్వారాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment