26 నుంచి బస్సు యాత్ర  | Botsa Satyanarayana Dharmana Prasada rao On YSRCP Bus Yatra | Sakshi
Sakshi News home page

26 నుంచి బస్సు యాత్ర 

Published Fri, May 20 2022 3:53 AM | Last Updated on Fri, May 20 2022 3:06 PM

Botsa Satyanarayana Dharmana Prasada rao On YSRCP Bus Yatra - Sakshi

బస్సు యాత్ర పోస్టర్‌ను విడుదల చేస్తున్న మంత్రులు ధర్మాన, బొత్స, మేరుగ, చెల్లుబోయిన

సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో మంత్రివర్గంలో 77 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయమంటే ఇదీ అని చాటిచెప్పిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని రెవెన్యూ, విద్యా శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ తెలిపారు. సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలసి గురువారం వారిద్దరూ తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాల ద్వారా పేదల బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్దడం, సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసి రాజ్యాధికారం కల్పించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పించటాన్ని విపక్షాలు, ప్రధానంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓర్చులేకపోతున్నారని మండిపడ్డారు. అవాస్తవాలను వల్లె వేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే దుస్సాహసం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రంలో మూడేళ్లుగా అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రజలకు వివరించడంతోపాటు ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 26న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమై 29వ తేదీన అనంతపురంలో ముగుస్తుందని తెలిపారు. యాత్ర సందర్భంగా రోజూ ఒకచోట బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. తొలిరోజు 26న విజయనగరంలో, 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు బస్సు యాత్రలో పాల్గొంటారని, ఆయా ప్రాంతాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జెడ్పీ చైర్‌పర్సన్‌లు, మేయర్‌లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నామినేటెడ్‌ పదవులు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు పాల్గొని సీఎం వైఎస్‌ జగన్‌ చేకూర్చిన సామాజిక న్యాయం, సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తారన్నారు.  

మంత్రులు ధర్మాన, బొత్స ఇంకా ఏమన్నారంటే..
ఏనాడూ అధికారం, పాలన చూడని వర్గాలకు రాజ్యాధికారం స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు బండ చాకిరీకే పరిమితం అయ్యాయి. అధికారం, పాలన ఏనాడూ చూడని ఆయా వర్గాలు ఎంతో ఆవేదనతో ఉన్న నేపథ్యంలో రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తానని ఎన్నికలకు ముందు సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. మాట ప్రకారం అధికారంలోకి రాగానే ఆ వర్గాలకు రాజ్యాధికారం కల్పించారు. 

దేశ చరిత్రలో ఎక్కడైనా ఇచ్చారా? 
మంత్రివర్గంలో 70% పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎక్కడైనా ఇచ్చారా? గతంలో ఎక్కడో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి వస్తే గొప్ప. నేడు మంత్రివర్గంలో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా ఈ స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చినట్లు చూపించగలరా? 

హోంమంత్రిగా తొలిసారి ఎస్సీ మహిళ 
ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరితను గతంలో హోంమంత్రిగా సీఎం వైఎస్‌ జగన్‌ నియమించారు. దేశ చరిత్రలో ఎక్కడైనా హోంమంత్రిగా ఎస్సీ మహిళను ఎవరైనా నియమించారా? హోంమంత్రిగా మేకతోటి సుచరిత మూడేళ్లు పనిచేశారు. ఇలాంటి పదవులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అర్హత లేదనే భావన గతంలో సమాజంలో ఉండేది. నేడు మరో దళిత మహిళ తానేటి వనితను హోంమంత్రిగా సీఎం వైఎస్‌ జగన్‌ నియమించారు. 

బీసీల గొంతుకను పెద్దలసభకు పంపితే తప్పా? 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీ వర్గానికి చెందిన నలుగురిని సీఎం జగన్‌ రాజ్యసభకు పంపారు. తెలంగాణకు చెందిన బీసీకి ఇస్తే తప్పా? చంద్రబాబు హైదరాబాద్‌లో నివాసం ఉండొచ్చా? దేశవ్యాప్తంగా బీసీల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తికి సీఎం జగన్‌ రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పిస్తే దానిపై చంద్రబాబు తప్పుగా మాట్లాడటం సబబేనా? బీసీ వర్గాల ఆత్మఘోషను రాజ్యసభలో బలంగా వినిపించే వ్యక్తిని సీఎం జగన్‌ ఎంచుకోవడాన్ని చంద్రబాబు ఎందుకు హర్షించలేకపోతున్నారు? 

చంద్రబాబు దేన్ని హర్షిస్తారు..?: 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారం కల్పించే విప్లవాత్మక మార్పులను కూడా చంద్రబాబు హర్షించలేకపోతే మరి ఇక ఆయన దేన్ని హర్షించగలరు? ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇచ్చేస్తారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఇచ్చారా? కనీసం 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లలో ఒక్క రాజ్యసభ సీటైనా చంద్రబాబు బీసీలకు ఇచ్చారా?

విపక్షాల విమర్శలు అర్ధరహితం 
కరోనా విపత్తు కారణంగా ఆదాయం అడుగంటి కేంద్ర ప్రభుత్వంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అప్పులు చేస్తున్నాయి. ఏపీ ఆదాయం ఎక్కడా పెరగలేదు. అయినా సరే రాష్ట్ర  ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్నీ ఆపలేదు. ధరలు పెరిగాయని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు, చంద్రబాబు దేశంలో ఏ రాష్ట్రంలో ధరలు తక్కువగా ఉన్నాయో చెప్పాలి.

టీడీపీ హయాంలో ఎక్కడైనా గొప్ప పరిశ్రమలు వచ్చాయా? ప్రాజెక్టులు వచ్చాయా? మరి ఎందుకు ఈ సంక్షేమ ప్రభుత్వంపై అర్థరహిత విమర్శలు చేస్తున్నారు? ఏదైనా కులం, వర్గంలో  ఎవరైనా అసంతృప్తితో ఉన్నారా? వారికి పథకాలు అందడం లేదా? పథకాల అమలులో ఎక్కడైనా అవినీతి చోటు చేసుకుందని చెప్పే సాహసాన్ని ప్రతిపక్షాలు చేయగలవా?

ఒక్క రూపాయైనా అవినీతి జరిగినట్లు కనీసం ఆరోపించగలిగారా?
వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ(డీబీటీ)తో ప్రభుత్వం అందచేస్తున్న డబ్బులు సుమారు 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతున్నాయి. అర్హతే ప్రామాణికంగా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.40 లక్షల కోట్లను ప్రభుత్వం జమ చేసింది.

ఇందులో ఒక్క రూపాయైనా అవినీతి జరిగినట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు కనీసం ఆరోపించగలిగారా? ఇదీ పరిపాలన సంస్కరణల ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ తెచ్చిన విప్లవాత్మక మార్పు. ఐదేళ్ల టీడీపీ పాలనలో వృద్ధాప్య పెన్షన్‌ నుంచి గృహాల మంజూరు వరకూ అన్నీ జన్మభూమి కమిటీలకు అప్పగించారు. జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తేగానీ  కరుణించని విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement