అనుమతులు తీసుకున్న తరువాతే కట్టారని మంత్రే చెప్పారు
వాటిని దేనికి ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఇష్టం
నిర్మాణంలో అవకతవకలు జరిగితే ఏ చర్యలైనా తీసుకోవచ్చు
చదరపు అడుగుకు రూ.25 వేలు ఖర్చు పెట్టారంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు
2015లోనే అసెంబ్లీ, సెక్రటేరియట్‌కు చదరపు అడుగుకు రూ.14 వేలు ఖర్చు పెట్టారు
శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ
వైఎస్సార్‌సీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాగ్వాదం
సాక్షి, అమరావతి: విశాఖలో రుషికొండపై నిర్మించిన భవనాలన్నీ ప్రభుత్వ భవనాలని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని నిర్మించినట్లు మంత్రే స్వయంగా చెప్పారని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. ఈ భవనాలను రాష్ట్రపతి, ప్రధాని వంటి అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గెస్ట్‌హౌస్‌లుగానో లేక వేరే విధంగా వినియోగించుకుంటారా... అన్నది ప్రభుత్వ ఇష్టమన్నారు. మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రుషికొండ భవనాలపై చర్చ జరిగింది.
ఈ చర్చలో బొత్స మాట్లాడుతూ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి నివాసం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రగతి భవన్‌ను నిర్మించారని, ఆ తర్వాత సీఎంలు ఆ భవనాలను వినియోగించుకుంటున్నారని, అదేవిధంగా రుషికొండ భవనాలను కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఒక పక్క అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతూనే, ప్రజల ఆమోదం లేకుండా నిర్మించారని మంత్రి దుర్గేష్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అసలు ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఉపన్యాసం చేస్తుండటంతో మధ్యలో కల్పించుకొని వివరణ ఇస్తున్నానని తెలిపారు.
మరో మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం చదరపు అడుగుకు వారు రూ.6,500 ఖర్చు చేస్తే, రుషికొండలో ఏకంగా రూ.25,000 ఖర్చు చేశారంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని బొత్స అన్నారు. 2015లో శాసనసభ నిర్మాణానికి ఫర్నిచర్‌తో కలిపి చదరపు అడుగుకు రూ.14,000 ఖర్చు చేశారన్నారు. ఉప ముఖ్యమంత్రి కూడా ఈ భనాలను చూసి తాజ్‌మహల్ కంటే చాలా బాగున్నాయని పొగిడిన సందర్భాన్ని గుర్తు చేశారు.
వాస్తవాలు ఇలా ఉంటే మంత్రులే çసంయమనం పాటించకుండా ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా చిత్రీకరిస్తూ రండి చూసుకుందాం.. దమ్ముంటే రండి... అంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని, ఈ పదాలను తక్షణం రికార్డుల నుంచి తొలగించాలంటూ బొత్స డిమాండ్ చేశారు. అంతకముందు మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అప్పటి మున్సిపల్ మంత్రి అయిన మిమ్మల్ని కూడా చూడనీయకుండా దాచిపెట్టి కట్టినందుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తారా.. అంటూ బొత్స సత్యనారాయణను ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సభలో వైఎస్సార్‌సీపీ సభ్యులు, మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది.
అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు ఎప్పుడిస్తారు?
రబీ అయిపోయి ఖరీప్ వచ్చినా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద కూటమి ప్రభుత్వం ఇస్తామన్న రూ.20వేల నగదు సాయంలో ఒక్కపైసా విడుదల కాలేదని, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని మండలిలో వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్, రామసుబ్బారెడ్డి ఈ అంశంపై మాట్లాడుతూ 52 లక్షల మంది రైతులకు రూ.10,500 కోట్లు అవసరమైతే బడ్జెట్‌లో కేటాయించిన రూ.4,500 కోట్లు ఎలా సరిపోతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇందులో కూడా రూ.3,500 కోట్లు పీఎం కిసాన్ కింద ఇచ్చే కేంద్ర నిధులని, కేవలం రూ1,000 కోట్లే రాష్ట్ర నిధులను కేటాయించారన్నారు.
కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇది మరింత పెరుగుతుందన్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం విధివిధానాలు తయారు చేస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే రూ.6,000కు రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 త్వరలోనే అందిస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ–క్రాప్ ఆధారంగా ఉచిత పంటల బీమా అందించి ఏ సీజన్‌లో నష్టపోయిన రైతులకు ఆ సీజన్‌లోనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చిందని, ఇప్పుడు జూలై, ఆగస్టు నెలల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం ఇంతవరకు ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ సభ్యుడు తోట త్రిమూర్తులు విమర్శించారు.
ఫైళ్ల దగ్ధం కేసు విచారణ జరుగుతుండగా పేర్లు ఎలా చెబుతారు?: బొత్స
మదనపల్లి ఫైళ్ల దగ్ధంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తప్పు జరిగితే విచారణ చేసి దోషులపై కఠిన చర్య తీసుకోవచ్చని, కానీ విచారణ జరుగుతుండగానే కొంతమంది పేర్లను నిబంధనలకు విరుద్ధంగా ఏ విధంగా ప్రస్తావిస్తారని నిలదీశారు. ఆ పేర్లను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో చినజీయర్ స్వామి, ఈషా ఫౌండేషన్లకు చంద్రబాబు ఇచ్చిన విధంగానే వేద పాఠశాల నిర్మాణం కోసం ధార్మిక సంస్థలకు భూ కేటాయింపులు చేశారని చెప్పారు. ఇందులో ఏమైనా తప్పులు జరిగి ఉంటే చట్టప్రకారం చర్య తీసుకోవడానికి తాము వ్యతిరేకం కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment