అనంతపురం సప్తగిరి సర్కిల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తోందని చెప్పారు. శనివారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో ‘సుస్థిర అభివృద్ధి సూచికలు 2022–23’పై కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల విజయవంతంలో వైద్యాధికారుల పాత్ర చాలా కీలకమన్నారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు, చేరుకోవాల్సిన లక్ష్యాలపై నిర్దేశించారు. ప్రస్తుతం జిల్లాలో ‘ఫ్యామిలీ ఫిజీషియన్’ విధానం ట్రయల్ రన్ జరుగుతోందన్నారు. ప్రతి నెలా రెండు దఫాలు సచివాలయాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు, కౌమారదశ పిల్లలకు ఓపీ సేవలు, ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొంది డిశ్చార్జి అయిన రోగుల ఆరోగ్య పరిస్థితిపై ఫాలోఅప్, మంచాలకే పరిమితమైన రోగుల గృహాలను సందర్శించి చికిత్సలు అందజేస్తారన్నారు.
ట్రయల్ రన్‌ను విజయవంతం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు. జిల్లాలో సంక్రమిక, అసంక్రమిక వ్యాధుల సర్వే వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల ద్వారా సంక్రమించే జబ్బుల నివారణకు సర్పంచ్‌ల ద్వారా ఫాగింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మాతాశిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలన్నారు.
వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం వంద శాతం ఉండాలన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ విశ్వనాథయ్య మాట్లాడుతూ స్వచ్ఛభారత్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహార సమతుల్యత, నులిపురుగుల నివారణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇదిలా ఉండగా డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాకిన్ కూలర్లను కలెక్టర్ ప్రారంభించారు. ఇందులో ఎయిడ్స్, కుష్టు రోగుల మందులను భద్రపరచనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ కృష్ణవేణి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ యుగంధర్, ప్రోగ్రాం అధికారులు అనుపమ జేమ్స్, సుజాత, చెన్నకేశవులు, నారాయణస్వామి, డెమో భారతి, డిప్యూటీ డెమో త్యాగరాజు, మలేరియా అధికారి ఓబులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇంటి పట్టాల పంపిణీకి చకచకా ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు జగనన్న ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ‘పేదలందరికీ ఇల్లు పథకం’ కింద అర్హులైన పేదలకు ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణ కార్యక్రమం యజ్ఞంలా సాగుతోంది. అర్హులై ఉండీ అందులో లబ్ధిపొందని వారు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే ‘90 రోజుల్లో ఇంటి పట్టా పథకం’ కింద మంజూరు చేస్తుంది. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ పథకం కింద అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 7,155, గుంతకల్లు డివిజన్‌లో 2,573, కళ్యాణదుర్గం డివిజన్‌లో 1,820 చొప్పున 11,548 మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరికి ఇంటి పట్టా ఇచ్చేందుకు అవసరమైన భూ సేకరణ పూర్తికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జగనన్న లే అవుట్లలో ఖాళీగా ఉన్న ప్లాట్లను గుర్తించడం.. అవసరమైన చోట భూ సేకరణ చేపట్టడం వంటి అంశంపై అధికారులకు ఆదేశాలిచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment