విద్యుత్ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిన బుడమేరు
రూ.4.61 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా
వరద వల్ల 1.5 లక్షల సర్వీసులకు నిలిచిన సరఫరా
సగానికిపైగా ఇళ్లకు ఇంకా రాని కరెంట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీవినీ ఎరుగని రీతిలో ముంచెత్తిన బుడమేరు వరద.. విద్యుత్ సరఫరా వ్యవస్థనూ తీవ్రంగా దెబ్బతీసింది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) పరిధిలోని విజయవాడ, గుంటూరు, ఒంగోలు జిల్లాలు, సీఆర్‌డీఏ ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. వరద వల్ల 1.5 లక్షల సర్వీసులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకూ దాదాపు 70 వేల సర్వీసులకు విద్యుత్ పునరుద్ధరించినట్లు ఇంధన శాఖ వెల్లడించింది.
ఆ లెక్కన చూసుకున్నా ఇంకా సగానికిపైగా సర్వీసులకు కరెంటు లేదు. 15 సబ్ స్టేషన్లు దెబ్బతినగా, ఇప్పటి వరకూ 12 సబ్‌స్టేషన్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. 33కేవీ సబ్ స్టేషన్లు 78 దెబ్బతినగా, వాటిలో 48 పునరుద్ధరించారు. 33 కేవీ ఫీడర్లు 44 పాడవ్వగా, వాటిలో 43 ఫీడర్లు, 11కేవీ ఫీడర్లు 543 ప్రభావితమవ్వగా 477 ఫీడర్లు బాగుచేశారు.
ఈ మొత్తం వ్యవస్థను సరిచేయడానికి ఏపీజెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నుంచి దాదాపు 1800 మంది సిబ్బంది బృందాలుగా ఏర్పడి పనులు చేస్తున్నారు. మొత్తం రూ.4.61 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. అజిత్‌సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, వాంబే కాలనీల్లో ఇంకా వరద నీరు ఉండటం వల్ల సరఫరా ఇవ్వలేకపోతున్నామని విద్యుత్ పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తున్న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ‘సాక్షి’కి వెల్లడించారు.
నేటికీ తేరుకోని ఎన్టీటీపీఎస్
బుడమేరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్మించిన యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జల విద్యుత్ ఉత్పత్తి (మినీ హైడల్) ప్లాంటు వల్ల దెబ్బతిన్న ఎన్టీటీపీఎస్ ఇంకా తేరుకోలేదు. జల విద్యుత్ కేంద్రం బుడమేరు వరద ప్రవాహానికి అడ్డుపడటంతో ఆ వరద నీరు వెనక్కి ఎగదన్ని వీటీపీఎస్‌ను ముంచెత్తింది. దీంతో వీటీపీఎస్‌లో 1,260 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఆటంకం కలిగింది. ఇదే వీటీపీఎస్‌లో రోటర్ దెబ్బతినడంతో యూనిట్–8లో పదిహేను రోజుల క్రితం 800 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది.
తమిళనాడులోని ఉప్పూరు నుంచి కొత్త రోటర్ తీసుకువచ్చారు. అయినా ఈ నెల 10కిగానీ ఈ యూనిట్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. రెండేళ్లకోసారి చేసే నిర్వహణలో భాగంగా యూనిట్–7లో 500 మెగావాట్ల ఉత్పత్తిని 21 రోజుల పాటు నిలిపివేశారు. అది కూడా ఇంకా పూర్తవ్వలేదు. ఈ మొత్తం 1300 మెగావాట్లకు తోడు ఇప్పుడు బొగ్గు నిర్వహణ వ్యవస్థలను వరద ముంచెత్తడం వల్ల మరో 1,260 మెగావాట్లు ఆగిపోయింది.
మొత్తం ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడగా ఇప్పటికి మూడు యూనిట్లను మాత్రమే పునరుద్ధరించగలిగారు. వీటీపీఎస్‌లోని యూనిట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఏపీజెన్‌కో ఎండీ కె.విఎన్. చక్రధర్ బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment