దారి తప్పిన దర్యాప్తు | CBI ignores key developments after YS Viveka Assassination | Sakshi
Sakshi News home page

దారి తప్పిన దర్యాప్తు

Published Fri, Mar 4 2022 3:33 AM | Last Updated on Fri, Mar 4 2022 9:35 AM

CBI ignores key developments after YS Viveka Assassination - Sakshi

► హతుడు ఏమైనా లేఖ రాశారా...? సెల్‌ఫోన్‌ ఎక్కడ ఉంది...?
► ఎక్కడైనా హత్యగానీ ఆత్మహత్యగానీ జరిగితే పోలీసులు, దర్యాప్తు అధికారులు వెంటనే దృష్టిసారించే అంశాలు ఇవీ.
► లేఖ, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేయకపోతే దానివెనుక కుట్ర కోణం ఏమై ఉంటుంది...?
► హత్యాస్థలిలో ఆధారాలు తుడిచివేయాలని ఎవరైనా ఆదేశిస్తే... కారణాలు ఏమై ఉంటాయి?
► ఇక గతానికి భిన్నంగా స్వరం మార్చి ఆరోపణలు చేస్తుంటే దాని వెనుక ఏమైనా ప్రలోభాలు, ఒత్తిళ్లు దాగి ఉన్నాయా?
► ఒక కేసు దర్యాప్తులో ప్రాథమికంగా దృష్టి సారించే కీలక అంశాలు ఇవీ.
– సాక్షి, అమరావతి

దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ చిన్న లాజిక్‌లను ఉద్దేశపూర్వకంగానే ఉపేక్షించడం విస్మయపరుస్తోంది. సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అంశాలను విస్మరించడంతో సీబీఐ దర్యాప్తు దారితప్పింది. టీడీపీ నేతల రాజకీయ కోణంలో సాగుతూ ఏకపక్ష దర్యాప్తుతో కేసును తప్పుదారి పట్టిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సహజ మరణం కాదని అప్పుడే తెలిసినా..
వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి చెందారని 2019 మార్చి 15న ఉదయం మొదట ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన లేఖ, సెల్‌ఫోన్‌లను ఆయనే స్వాధీనం చేసుకున్నారు. సహజంగానే ఆ లేఖను ఆయనే తొలుత చదివి ఉంటారు. తనపై డ్రైవర్‌ ప్రసాద్‌ తీవ్రంగా దాడి చేశాడని ఆ లేఖలో వివేకానందరెడ్డి రాసినట్టుగా ఉంది. అంటే వివేకాది సహజ మరణం కాదు... ఎవరో దాడి చేశారని అప్పుడే స్పష్టమైంది. ఆ లేఖ, సెల్‌ఫోన్‌ విషయాన్ని కృష్ణారెడ్డి వెంటనే వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తెలియజేశారు. అయితే తాము వచ్చే వరకు వాటి గురించి ఎవరికీ చెప్పొద్దని రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు ఆదేశించారు. దీంతో కృష్ణారెడ్డి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అనంతరం అక్కడకు చేరుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డికిగానీ ఇతరులకుగానీ చెప్పకుండా గోప్యంగా ఉంచారు. 

ఎందుకా గోప్యత?
ఆ లేఖ గురించి అప్పుడు చెప్పి ఉంటే వివేకానందరెడ్డిని ఎవరో హత్యచేశారని వెంటనే స్పష్టత వచ్చే ది. పోలీసులకూ చెప్పేవారు. మృతదేహాన్ని బాత్‌రూమ్‌ నుంచి బయటకు తీసుకురాకుండా, రక్తపు మరకలు తుడవకుండా అడ్డుకునేవారు. కానీ ఆ లే ఖ, సెల్‌ఫోన్‌ విషయాన్ని పోలీసులతో సహా ఎవరికీ చెప్పొద్దని వివేకా అల్లుడు, ఆయన సోదరుడు ఎం దుకు చెప్పారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వారు మధ్యాహ్నం పులివెందుల చేరుకున్నాక ఆ లేఖ, సెల్‌ఫోన్‌లను తీసుకున్నారు. సాయంత్రం వాటిని పోలీసులకు కృష్ణారెడ్డి ద్వారా అప్పగించారు. 

ఆ మెస్సేజ్‌ల వెనుక కథ ఏమిటి...?
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వివేకా సెల్‌ఫోన్‌లోని మెస్సేజ్‌లు, ఇతర కీలక సమాచారాన్ని వారు డిలీట్‌ చేశారా...? చేస్తే ఎందుకు చేశారన్నది ఈ కేసులో కీలకం. అంతటి కీలకమైన అంశాలపై సీబీఐ అధికారులు ఇప్పటివరకు దృష్టి సారించనే లేదు. హత్య జరిగిన ముందు రోజు రాత్రి వివేకా సెల్‌ఫోన్‌కు ఓ మహిళ నుంచి వచ్చిన మెస్సేజ్‌లు తరువాత బయటపడ్డాయి. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఆమె దూషించి ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ మెస్సేజ్‌ల్లో ఉండటం గమనార్హం. అంటే వివేకా కుటుంబంలో తీవ్ర అంతర్గత విభేదాలు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. మరి ఆ అంశాలపై సీబీఐ ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌ రెడ్డిలను విచారించి నమోదు చేసిన వాంగ్మూలాల్లో ఆ విషయాలపై స్పష్టత లేదు. 

గుండెపోటని టీడీపీ మంత్రితో ఎందుకు చెప్పారు?
వివేకా పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి సూచనలతో ఆయన అనుచరుడు ఇనయతుల్లా  మార్చి 15న ఉదయం ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహం ఫొటోలు, వీడియోలను శివప్రకాశ్‌రెడ్డికి వాట్సాప్‌ చేశారు. ఆ ఫొటోలు చూస్తే అది హత్యేనని స్పష్టమవుతుంది. కానీ ఆయన వాటిని చూసిన తరువాత కూడా అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో మరణించినట్లు చె ప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. శివప్రకాశ్‌రెడ్డి అలా ఉద్దేశపూర్వకంగా గుండెపోటని ఎందుకు చెప్పారో సీబీఐ ఇంతవరకు దృష్టిసారించ లేదు. శివప్రకాష్‌రెడ్డి వాంగ్మూలం నమోదు సమయంలోనూ ఆ విషయంపై ప్రశ్నించలేదు. 

తుడవమని ఎందుకు చెప్పారు?
వివేకా మృతదేహం వద్ద రక్తపు మరకలను తుడవాలని ఆయన సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డికి శివప్రకాష్‌రెడ్డి ఫోన్‌ చేసి చెప్పారు. అదే విషయాన్ని ఎర్ర గంగిరెడ్డి కూడా వెల్లడించాడు. అలా రక్తపు మరకలు తుడవమని ఎందుకు చెప్పారు? సాక్ష్యాధారాలు  లేకుండా చేయాలని ఎందుకు భావించారు? ఈ విషయంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేయలేదు. ఆయన్ను ప్రశ్నించనూ లేదు.

శాస్త్రీయ ఆధారాలతో విచారిస్తే...
గతంలో టీడీపీ ఏ ఆరోపణలు చేసిందో ప్రస్తుతం అవే అభియోగాలతో సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం, సాక్షులు చెప్పని విషయాలను కూడా వారు చెప్పినట్లుగా వాంగ్మూలాలు నమోదు చేస్తుండటం ఈ కేసు దారి మళ్లిందనేందుకు స్పష్టమైన నిదర్శనమని పరిశీలకులు పేర్కొంటున్నారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ తన స్థాయికి తగ్గట్టుగా శాస్త్రీయంగా, హేతుబద్ధంగా దర్యాప్తు చేస్తున్నట్లు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. కీలక ఆధారాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ . ఊహాజనిత, రాజకీయ ప్రేరేపిత ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేయడం వెనుక ఒత్తిళ్లు దాగి ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. మాట మార్చిన సునీత దంపతులు, టీడీపీ రాజకీయ ఆరోపణలు, తాము బలవంతంగా అప్రూవర్‌గా మార్చిన నిందితుల కోణం నుంచి కాకుండా శాస్త్రీయ ఆధారాలను బట్టి కేసును దర్యాప్తు చేయాలని సూచిస్తున్నారు.

మాట మార్చటానికి కారణాలేమిటి?
వివేకా హత్య అనంతరం ఆయన కుమార్తె సునీత పులివెందుల, హైదరాబాద్‌లలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దాదాపు 700 మంది ఉన్న తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి గెలుపు కోసం పనిచేసిన తన తండ్రి వివేకానందరెడ్డి ప్రస్తుతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఎంపీ ని చేసేందుకు చివరివరకూ కృషిచేశారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి తమ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆమె ధ్వజమెత్తారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా తమ కుటుంబ సభ్యులపైనే సునీత ఎందుకు ఆరోపణలు చేస్తున్నారనే అంశంపై సీబీఐ అధికారులు ఏ మాత్రం ఆరాతీయలేదు. సునీత మాట మార్చ డం వెనుక ప్రలోభాలు, ఒత్తిళ్లు, రాజకీయ కారణాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యంగా మారినా సీబీఐ ఈ అంశాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement