సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లపై సీబీఐ దర్యాప్తు | CBI probe into social media postings | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లపై సీబీఐ దర్యాప్తు

Published Tue, Oct 13 2020 4:54 AM | Last Updated on Tue, Oct 13 2020 4:54 AM

CBI probe into social media postings - Sakshi

సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై పోస్టులకు సంబంధించిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లన్నింటినీ సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది. ఆధారాలన్నీ సీబీఐకి అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఏదైనా కాగ్నిజబుల్‌ నేరం ఉందని భావిస్తే మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తును ఓ తార్కిక ముగింపునకు తీసుకురావాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ పోస్టుల వెనుక భారీ కుట్ర ఉన్నట్లు గమనిస్తే హోదా, స్థాయితో నిమిత్తం లేకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలో  పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని, ఆ యూజర్లను బ్లాక్‌ చేయాలని సీబీఐకి సూచించింది. తీర్పు కాపీ అందుకున్న నాటి నుంచి ఎనిమిది వారాల్లోపు దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని ఆదేశించింది. సీబీఐ కోరితే పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సూచిస్తూ తదుపరి విచారణను డిసెంబర్‌ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఏప్రిల్‌ నుంచి రాష్ట్రంలో కొత్త ఒరవడి మొదలైన విషయాన్ని ఈ న్యాయస్థానం గుర్తించింది. హైకోర్టు, న్యాయమూర్తులపై సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా ఇంటర్వ్యూలలో దూషణల పర్వం మొదలైంది. దూషించినా, తిట్టినా తమ నిష్పాక్షికత, నిజాయితీ గురించి చెప్పుకునే వేదిక న్యాయమూర్తులకు లేదు. ఈ అపరాధులను శిక్షించేందుకు కోర్టు ధిక్కార చట్టం సరిపోదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారు. అయితే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందన్న విషయాన్ని వీరు మర్చిపోయారు’ అని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.  

అప్పటికప్పుడు ఆదేశాలు.. 
సీఐడీతో పోలిస్తే మానవ వనరులు, సాధన సంపత్తి అధికంగా ఉండటం, విస్తృత పరిధి తదితర కారణాలతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు హైకోర్టు తన 20 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తరఫు న్యాయవాదులు కూడా సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం చెప్పకపోవడం మరో కారణమని పేర్కొంది. ఈ కేసు సోమవారం నాటి కేసుల విచారణ జాబితా (కాజ్‌ లిస్ట్‌)లో లేకున్నా భోజన విరామం అనంతరం ధర్మాసనం అప్పటికప్పుడు ఆదేశాలు వెలువరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement