
వైఎస్ వివేకానందరెడ్డి( ఫైల్ ఫోటో)
సాక్షి ప్రతినిధి, కడప/అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న వాచ్‌మెన్ రంగన్న (65) వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేయించింది. పులివెందులలోని భాకరాపురానికి చెందిన ఇతను చాలా కాలంగా వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పని చేసేవాడు. విచారణలో భాగంగా ఇదివరకు ఇతనికి సిట్ బృందం నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా చేయించింది. తాజా విచారణలో భాగంగా ఈ నెల 6 నుంచి 16వ తేదీ వరకు విచారించిన సీబీఐ.. ఇదే నెలలో 21, 22, 23 తేదీల్లో వరుసగా మూడు రోజులపాటు విచారించింది. 22వ తేదీ ఉదయం 10 గంటలకు జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇతనికి కోవిడ్ టెస్ట్ చేయించారు.
నెగెటివ్ రిపోర్టు రావడంతో శుక్రవారం ఉదయం 11.45 గంటలకు జమ్మలమడుగు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. మధ్యాహ్నం 2.55 గంటల వరకు ఇతను మేజిస్ట్రేట్ సమక్షంలోనే ఉన్నాడు. ఈ సమయంలో మేజిస్ట్రేట్ ఇతని వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిసింది. 3 గంటలకు సీబీఐ బృందం తిరిగి రంగన్నను అదుపులోకి తీసుకొని రాత్రి 8.40 గంటలకు పులివెందుల బస్టాండులో వదిలిపెట్టింది. కోర్టులో ఇతని వాంగ్మూలం రికార్డు చేసే సమయంలో సీబీఐ అధికారులు బయటే ఉన్నారు.