అనంతపురం: విద్యారంగ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన బడి ‘నాడు–నేడు ’ కార్యక్రమం పలు రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా సర్కారీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కలి్పంచేందుకు ‘పీఎం శ్రీ’ పేరుతో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మొత్తం 1,174 పాఠశాలలను ప్రాథమికంగా ఎంపిక చేశారు.
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, మండల పరిషత్, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఈ పథకం అమలు చేయనున్నారు. మొత్తం 42 అంశాల్లో ఎన్ని అమలు అవుతున్నాయో వాటి వివరాలను బట్టి 1,174 పాఠశాలల నుంచి తుది జాబితాను త్వరలో ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు 2022–23 విద్యా సంవత్సరం నుంచి 2026–27 వరకు దశల వారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
గ్రీన్ స్కూల్స్, పాఠశాల ఆవరణంలో ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటు, సేంద్రీయ విధానంలో తోటల పెంపకం, ప్లాస్టిక్ నిర్మూలన, నీటి యాజమాన్య పద్ధతులు, వాతావరణ మార్పుల గురించి విద్యార్థులకు వివరించడం, విద్యలో గుణాత్మకమైన మార్పులు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం, ప్రతి విద్యారి్థకీ మేథమేటిక్స్, సైన్స్ కిట్‌లు అందజేయడం చేస్తారు. అలాగే పాఠశాల వార్షిక నిధులు అందేలా చూడడం, స్మార్ట్ తరగతులు, డిజిటల్ శిక్షణ నిర్వహించడం, సైన్స్ ల్యాబ్‌లు, లైబ్రరీలు ఏర్పాటు చేయడం, నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం చేస్తారు.
తుది జాబితా ఎంపిక చేస్తాం
పీఎం శ్రీ పథకానికి సంబంధించి పాఠశాల వివరాలను పంపాలని విద్యాశాఖ కోరింది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ప్రాథమికంగా 1,174 పాఠశాలలను ఎంపిక చేశాం. ఇందులో 42 పాయింట్లను బట్టి పాఠశాలల తుది జాబితాను ఎంపిక చేస్తాం.
– కే. వెంకట కృష్ణారెడ్డి, ఇన్‌చార్జి డీఈఓ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment