సమావేశంలో మాట్లాడుతున్న సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తగిన కృషి చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణ సీఎస్‌లు, ఇతర అధికారులతో విభజన అంశాలకు సంబంధించిన సమస్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న వివిధ విభజన అంశాలను అజయ్ భల్లా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు(సివిల్), ఎస్పీలు(నాన్ కేడర్), షెడ్యూల్ 9లో పేర్కొన్న సంస్థల ఆస్తులు, అప్పుల విభజన, సింగరేణి కాలరీస్ కంపెనీ విభజన అంశాలపై చర్చించారు. అలాగే విభజన చట్టంలోని సెక్షన్లు 50, 51, 56 ప్రకారం ట్యాక్సేషన్ ప్రావిజన్స్ కల్పించడం, కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, ఏపీ జెన్కోకు బకాయిల చెల్లింపు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల అధికారులతో అజయ్ భల్లా సమీక్షించారు. సమస్యల పరిష్కారానికి కేంద్రం తన వంతు తోడ్పాటును అందిస్తుందని స్పష్టం చేశారు.
షీలా బిడే కమిటీ సిఫార్సులను గౌరవించాలి
ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ.. కేంద్రం నియమించిన షీలా బిడే కమిటీ సిఫార్సుల ప్రకారం విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విభజన జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ జెన్కో ద్వారా తెలంగాణ డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి సుమారు రూ.7 వేల కోట్ల వరకు తెలంగాణ ఇవ్వాల్సి ఉందని హోం శాఖ కార్యదర్శి దృష్టికి సీఎస్ తీసుకెళ్లారు. అజయ్ భల్లా స్పందిస్తూ ఏపీ, తెలంగాణ అధికారులు చర్చించుకొని.. ఒక పరిష్కారానికి రావాలని సూచించారు. ఇందుకు సీఎస్ అంగీకరించి.. ఈ సమస్య పరిష్కారానికి ఒక నిర్దిష్ట సమయం పెట్టాలని కోరారు. సమావేశంలో ఏపీ ఉన్నతాధికారులు రజత్ భార్గవ, అనంతరాము, ఎస్‌ఎస్ రావత్, ప్రేమచంద్రారెడ్డి, అనురాధ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment