ఏది నిజం ?: బాబూ.. జవాబుందా ?  | Chandrababu and Yellow Media Fake News On YS Viveka Case | Sakshi
Sakshi News home page

ఏది నిజం ?: బాబూ.. జవాబుందా ? 

Published Sun, Feb 12 2023 3:48 AM | Last Updated on Sun, Feb 12 2023 9:03 AM

Chandrababu and Yellow Media Fake News On YS Viveka Case - Sakshi

అధికారం కోసం ఎంతకైనా తెగించడం... ఎవరితోనైనా చేతులు కలపటం చంద్రబాబు నైజం. సొంత మామ ఎన్‌టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినపుడు గానీ... ఆగర్భ శత్రువైన కాంగ్రెస్‌తో గత ఎన్నికల్లో జతకట్టడం కానీ ఈ నైజానికి ఓ రెండు మేలిమి ఉదాహరణలు మాత్రమే.వంగవీటి రంగాను పట్టపగలు నడిరోడ్డుపై హతమార్చిన నారాసుర రక్త చరిత్ర ఎవరికి తెలియదని? టీడీపీలో ఈయనకు పోటీగా ఎదిగిన ప్రతి నాయకుడూ... రోడ్డు ప్రమాదంలోనో, నక్సల్స్‌ చేతుల్లోనో ప్రాణాలు కోల్పోయారంటే ఆ రక్తపు మరకలకు కారకులెవరో తెలియదా? 

అలాంటి చంద్రబాబు... మాటకు కట్టుబడే... మనుషులకు అత్యంత విలువిచ్చే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సైతం తన రక్తపు చేతులు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. వివేకా హత్యకేసుకు సంబంధించి ‘జగనాసుర రక్త చరిత్ర’ అంటూ తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన పుస్తకం ఈ కోవలోనిదే!!. మొదటి నుంచీ సీబీఐ దర్యాప్తు ఎలా సాగాలోతన రాతలతో చెబుతున్న ఎల్లో మీడియా... షరా మామూలుగా ఈ టీడీపీ కరపత్రాన్ని కూడా పతాక శీర్షికల్లో అచ్చేసింది. కానీ ఈ కేసులో చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. మరి ఆయన గానీ... ఆయన తరఫున రామోజీరావు గానీ వాటికి సమాధానం చెబుతారా?  

 వివేకా పీఏ కృష్ణారెడ్డికి అక్కడో లేఖ దొరికింది. డ్రైవర్‌ తనను తీవ్రంగా కొట్టాడంటూ వివేకా రాసిన లేఖను, ఆయన ఫోన్‌ను... కృష్ణారెడ్డి ఎవ్వరికీ ఇవ్వలేదు. వివేక కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశాలతోనే లేఖను దాచిపెట్టారు. ముందే లేఖ ఇస్తే అది సహజ మరణం కాదని తెలిసి ఎవ్వరూ మృత దేహాన్ని తాకేవారే కాదు. ఆ లేఖ తన తండ్రి రాసిందేనని సాక్షాత్తూ డీఐజీకి సునీత చెప్పారు. ఆ లేఖను ముందే ఇవ్వకపోవటంపై గానీ... వాట్సాప్‌ మెసేజీలతో సహా ఫోన్లో సగం డేటాను డిలీట్‌ చేయటంపై గానీ ఎందుకు ప్రశ్నించటం లేదు?  ఆ లేఖను దాచిపేట్టిన కృష్టారెడ్డిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. కానీ ఆ లేఖ దాచిపేట్టమన్న వారిని ఎందుకు అరెస్ట్‌ చేయలేదు?

 వైఎస్‌ వివేకాను గొడ్డలితో నరికి హత్య చేశానని నిందితుడు దస్తగిరి అంగీకరించాడు. కానీ తనను ఈ కేసులో అప్రూవర్‌గా చేసుకుని... తనచేత వేరేవాళ్ల పేర్లు చెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారెందుకు? దస్తగిరి బెయిల్‌ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించకపోవడమేంటి? హత్య చేసిన వ్యక్తి జైల్లో కాకుండా... దర్జాగా బయట తిరుగుతున్నాడెందుకు?  

హత్య జరిగిన రోజు నిరంతరం స్థానిక పోలీసులతో నాటి ఇంటలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు ఏం మాట్లాడారు? నిమిష నిమిషానికీ చంద్రబాబుతో
ఏం చెప్పారు? ఈ కోణంలో చంద్రబాబును విచారించలేదెందుకు?  

ఈ కేసులో దర్యాప్తును మొదటి నుంచీ నడిపిస్తున్నది ఎల్లో మీడియానే. పోలీసులు, సీబీఐ ఏం చేయాలో కూడా ఎల్లో మీడియానే చెబుతోంది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి... వివేకా అనుచరులే డబ్బు లావాదేవీల్లో భాగంగా ఆయన్ను హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేసింది ‘ఈనాడు’. ఇప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ప్లేటు ఫిరాయించింది. బాబుకు లబ్ధి కలిగేలా ఎంపీ అవినాశ్‌ను టార్గెట్‌ చేస్తూ కథనాలు వండి వారుస్తోంది. వీరి వల్ల ఈ కేసులో దర్యాప్తు ఎలా పక్కదోవ పడుతోందో వివరించే కొన్ని అంశాలివిగో... 

► అవినాశ్‌ రెడ్డికి వివేకా మృతి గురించి తెలిసిందెప్పుడు? ఉదయం 6.30 ప్రాంతంలో... అది కూడా వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాశ్‌ రెడ్డి ఫోన్‌ చేసి చెబితేనే!!. దీంతో జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికి వెళుతూ అవినాశ్‌ తిరిగి వెనక్కొచ్చారు. అప్పటికే అక్కడ జనం పోగయి ఉన్నారు. వచ్చాక విషయం తెలుసుకుని ఆయన తొలుత సీఐ శంకరయ్యకి, తరవాత కొందరు బంధువులకు ఫోన్లు చేశారు.

ఏ ఫోన్‌ అయినా 6.30 తరవాతే. కానీ అర్ధరాత్రే ఫోన్‌ చేసినట్లు నిరాధార ఆరోపణలెందుకు చేస్తున్నారు? జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జిగా ఉన్న వైఎస్‌ వివేకానందరెడ్డి... మార్చి 10నే ఎన్నికల షెడ్యూలు రావటంతో హత్యకు ముందురోజు రాత్రి కూడా (మార్చి 15) ఎంపీ అవినాశ్‌ కోసం ప్రచారం చేశారు కదా? ఇందులో అవినాశ్‌–వివేకా మధ్య రాజకీయ వైరుధ్యాలకు అవకాశమెక్కడుంది? మృతి గురించి శివప్రకాశ్‌రెడ్డే్డ తనకూ చెప్పారన్నది జమ్మలమడుగు టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి మాట.

గుండెపోటుతో మృతి చెందారని, సిగరెట్లు ఎక్కువ తాగటం వల్ల కావచ్చునని చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. మరి అందరికీ శివప్రకాశ్‌ రెడ్డే చెప్పినపుడు అవినాశ్‌నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నట్టు? 

చంద్రబాబూ నిరాధార ఆరోపణలు కట్టిపెట్టు... ఇవిగో నిజాలు...
అవాస్తవ ఆరోపణలతో టీడీపీ విడుదల చేసిన పుస్తకం పూర్తిగా కట్టుకథల పుట్టని ఇట్టే తేలిపోయింది. ఆ పుస్తకంలో టీడీపీ చేసిన నిరాధార ఆరోపణలకు సమాధానాలు ఇవిగో...

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తోంది సీబీఐనా...!?  చంద్రబాబా..!?
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన రాత్రి 3గంటలకు ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి వైఎస్‌ భారతి పీఏ నవీన్‌కు ఎందుకు ఫోన్‌ చేశారని టీడీపీ ఓ అవాస్తవ విషయాన్ని ప్రచారంలోకి తేవడం విడ్డూరంగా ఉంది.

అసలు ఆ రోజు రాత్రి 3గంటలకు ఎంపీ అవినాశ్‌ రెడ్డి నవీన్‌కు ఫోన్‌ చేశారని ఎవరు చెప్పారు చంద్రబాబూ...? ఎంపీ అవినాశ్‌ రెడ్డి కాల్‌ డేటా మీ దగ్గర ఉందా... ఉంటే మీ పుస్తకంలో ఎందుకు ప్రచురించలేదు? ఎందుకంటే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన అర్ధ రాత్రి 3గంటల సమయంలో వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఎవరికీ ఫోన్‌ చేయనే లేదు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, అప్పటి రాష్ట్ర ఇంటలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావే ఈ కేసు దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించారు. మరి అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు ఆ కేసు రికార్డులన్నీ కూడా కరకట్ట మీదున్న చంద్రబాబు నివాసానికి తరలించారా...?ఈ కేసులో టీడీపీ నేతల పాత్రను కప్పిపుచ్చేందుకే అలా చేశారా?

మతి భ్రమించిందా చంద్రబాబూ...!
అధికారం కోల్పోవడంతో చంద్రబాబుకు మతిభ్రమించినట్టు ఉంది.  వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య గురించి ముందు రోజు రాత్రే తెలిసినా వైఎస్‌ జగన్‌ పులివెందులకు సాయంత్రం వరకు ఎందుకు వెళ్లలేదంటూ టీడీపీ ప్రశ్నించడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. 2019 మార్చి 15 ఉదయం 6.10గంటలు అయినా సరే  వివేకానందరెడ్డి నిద్ర లేవకపోవడంతో పీఏ కృష్ణారెడ్డి చాలాసేపు బయటే వేచి ఉన్నారు.

ఆ తరువాత వాచ్‌మ్యాన్‌ రంగన్న, వంటమనిషి కుమారుడు ప్రకాశ్‌లతో కలసి వెనక ద్వారం నుంచి వెళ్లి చూడగా బాత్రూమ్‌లో వివేకానందరెడ్డి  మృతిచెంది ఉండడాన్ని గుర్తించారు.  

ఆ వెంటనే  హైదరాబాద్‌లో ఉన్న వివేకానందరెడ్డి భార్య, కుమార్తె, అల్లుడికి సమాచారం అందించారు. వారు హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో పులివెందుల వచ్చే సరికి మధ్యాహ్నం 1గంట అయ్యింది.

హైదరాబాద్‌లో ఉన్న అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన భద్రతా సిబ్బంది అనుమతించిన తరువాత రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రంలోపు పులివెందుల చేరుకున్నారు. కానీ ఈ అంశానికి కూడా మసిపూసి మారేడు కాయ చేయాలని చూడటం చంద్రబాబు రాజకీయ నైచ్యమే..

సీబీఐ అధికారులపై కేసు పేరిట మరో అబద్ధం
అంతఃపుర ఆదేశాలతోనే అంటే ముఖ్యమంత్రి నివాసం నుంచి వచ్చిన ఆదేశాలతోనే సీబీఐ అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారని టీడీపీ మరో నిరాధారణ ఆరోపణ చేసింది. సీబీఐ అధికారులపై పోలీసులు తమకు తాముగా కేసు నమోదు చేయలేదు. ఉదయ్‌కుమార్‌ అనే వ్యక్తిని సీబీఐ అధికారులు విచారణ పేరిట పదే పదే పిలిచి తీవ్రంగా కొడుతుండడంతో ఫిర్యాదుచేసినా పోలీసులు స్పందించకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  

న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీబీఐ అధికారులను ఒక్క రోజు కూడా విచారణకు పిలవనే లేదు. సీబీఐ అధికారులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ కేసులో స్టే మంజూరైంది. ఇక ఈ కేసు విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం ఎక్కడ ఉంది?.. 

సీబీఐ విచారణకు సహకరిస్తున్న ప్రభుత్వం
ప్రతిపక్ష నేతగా సీబీఐ విచారణ కోరిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాను సీఎం అయ్యాక ఎందుకు వద్దనుకున్నారని టీడీపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది.  ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకే వైఎస్‌ జగన్‌ సీబీఐ విచారణను కోరారు. తాను ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వాధినేతగా తమ పోలీసు శాఖపై ముఖ్యమంత్రి నమ్మకం ఉంచారు.

పోలీసులకు పూర్తి స్వేచ్ఛ నిచ్చి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా పూర్తి సహకారం అందిస్తోంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో సీబీఐని నిషేధించారు.అలాంటి చంద్రబాబు అధికారం కోల్పోగానే మళ్లీ సీబీఐపై నమ్మకం ప్రదర్శిస్తుండటం రాజకీయ అవకాశవాదమే.

వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టకూడదని  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించి ఉంటే ఆయన కూడా సీబీఐకి రాష్ట్రంలో నిషేధించి ఉండేవారు కదా. ఆయన అలా చేయలేదు. అంటే వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేసినా తనకు అభ్యంతరంలేదని చెప్పినట్టే కదా.
 
ఎంపీ టికెట్‌ అవినాశ్‌కే ఖరారు చేశారు బాబూ 
వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఎంపీ టికెట్‌ కోసమే వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేయించినట్టు సీబీఐ సందేహం వ్యక్తం చేస్తూ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసిందని ఆరోపించడం టీడీపీ కుతంత్రాలకు పరాకాష్ట. సీబీఐ అఫిడవిట్‌ మీరు చూశారా చంద్రబాబు..! అసలు 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగానే ఖరారు చేశారు.  

కడప లోక్‌సభ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్‌గా వైఎస్‌ వివేకానందరెడ్డిని నియమించారు. అవినాశ్‌ రెడ్డి గెలుపు  కోసం వివేకానందరెడ్డి అప్పటికే ప్రచారం ప్రారంభించారు కూడా. వివేకాందరెడ్డి హత్య తరువాత కూడా ఆయన కుమార్తె వైఎస్‌ సునీత అదే విషయాన్ని మీడియా సమావేశంలో చెప్పారు కూడా. 

చార్జ్‌షీట్‌కు సీబీఐ 17 నెలల సమయం ఎందుకు తీసుకుంది? 
ఈ కేసులో ఏ–1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్‌ ఎందుకు వచ్చింది... పోలీసులు ఆయనపై చార్జ్‌షీట్‌ ఎందుకు వేయలేదని టీడీపీ సంధించిన ప్రశ్న హాస్యాస్పదంగా ఉంది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురైనప్పటి నుంచి 75రోజులపాటు చంద్రబాబే అధికారంలో ఉన్నారు.

మరి అప్పుడు ఎందుకు చార్జ్‌షీట్‌వేయలేదు?  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితులను గుజరాత్‌లోని న్రార్కో అనాలిసిస్‌ ల్యాబరేటరీకి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహించింది.

కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతుండగానే న్యాయస్థానం ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తును 2020, జూలై 9న సీబీఐకి అప్పగించింది. సీబీఐ 2021, అక్టోబరు 26న తొలి చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. తొలి చార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు సీబీఐ 17 నెలల సమయం తీసుకుంది. చార్జ్‌షీట్‌ దాఖలకు 17 నెలల సమయం తీసుకున్న సీబీఐనిగానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీనిగానీ టీడీపీ ఎందుకు ప్రశ్నించడం లేదు? 

వ్యక్తిగత కారణాలతోనే డిప్యుటేషన్‌పై వెళ్లిన అభిషేక్‌ మహంతి
చంద్రబాబు గాలిపోగేసి చేసిన మరో ఆరోపణ... ఈ కేసులో గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని అప్పటి కడప ఎస్పీ అభిషేక్‌ మహంతి విచారణకు తీసుకువెళ్తుంటే హఠాత్తుగా నవీన్‌ నుంచి ఫోన్‌ వచ్చింది...దాంతో ఆయన్ని విచారించకుండా విడిచిపెట్టారని అవాస్తవ ఆరోపణలు చేశారు. పైగా అభిషేక్‌ మహంతి సుదీర్ఘ సెలవుపై ఎందుకు వెళ్లారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది.

ఏమయ్యా చంద్రబాబూ... ఎస్పీ అభిషేక్‌ మహంతికి నవీన్‌ నుంచి ఫోన్‌ రావడం నువ్వు చూశావా...? పోనీ ఆయన కాల్‌ డేటా నీ దగ్గర ఉందా?  ఇక అభిషేక్‌ మహంతి తన కుటుంబపరమైన కారణాలతోనే ఆయన తెలంగాణకు డిప్యుటేషన్‌ కోరుకునివెళ్లారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదన్నది రెండు రాష్ట్రాల్లోని పోలీసు శాఖలకు తెలుసు.

రెండేళ్ల ఐదు నెలలు సస్పెన్షన్‌లోనే సీఐ శంకరయ్య
సీఐ శంకరయ్య వాంగ్మూలం ఇచ్చి వెనక్కితగ్గారని ... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తివేసిందని టీడీపీ ఆరోపించడం విడ్డూరంగా ఉంది. తాను  చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని శంకరయ్య తప్పుబట్టారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిన మర్నాడే శంకరయ్య సస్పెండ్‌ అయ్యారు. 2019 మేలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఆ తరువాత కూడా రెండేళ్ల ఐదు నెలలపాటు శంకరయ్య సస్పెన్షన్‌లోనే ఉన్నారు. కుటుంబ పోషణ కోసం తనకు పోస్టింగ్‌ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శంకరయ్యపై అభియోగాలు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగానే ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి పోస్టింగ్‌ ఇచ్చారు. ఆయనకు ఏమీ ప్రాధాన్యమున్న పోస్టింగ్‌ ఇవ్వ లేదు. దాంతో కేసు దర్యాప్తు ప్రభావితమయ్యేది ఏముంది? టీడీపీ తప్పుబట్టాల్సింది ఏముంది...?

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ అంశంపై టీడీపీ అసత్య ఆరోపణలు చేసింది. ఎర్రగంగిరెడ్డి వైఎస్‌  వివేకానందరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితుడు.  ఎర్ర గంగిరెడ్డి జైలులో ఉన్నప్పుడు కూడా వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తరచూ ఆయన్ని కలిసేవారు.

ఎర్ర గంగిరెడ్డికి న్యాయవాదులను కూడా సునీతే ఏర్పాటు చేశారు. ఆయనకు బెయిల్‌ రావాలని సునీత, ఆమె భర్త ఎన్‌.రాజశేఖరరెడ్డి కోరుకున్నారు. తీరా ఇప్పుడు ఆయనకు బెయిల్‌ రావడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హస్తముందని టీడీపీ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది.

తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని గంగాధర్‌రెడ్డిపై టీడీపీ నేతల ఒత్తిడి
వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు కె.శ్రీనివాసరెడ్డి, గంగాధర్‌ రెడ్డి అనుమానాస్పదంగా మృతిచెందారంటూ వక్రీకరిస్తూ టీడీపీ ఆరోపణలు చేయడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఈ కేసులో కె.శ్రీనివాసరెడ్డి అసలు సాక్షి కాదు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టడానికి ముందే శ్రీనివాసరెడ్డి మృతి చెందారు.

ఆయన సోదరుడు పరమేశ్వరరెడ్డి ఈ కేసులో అనుమానితుడు. అతను టీడీపీ నేత బీటెక్‌ రవికి సన్నిహితుడు కూడా. వివేకానందరెడ్డి హత్యకు ముందు పరమేశ్వరరెడ్డి తనకు ఎలాంటి అనారోగ్యం లేనప్పటికీ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న అతను బయటకు వచ్చి టీడీపీ నేత బీటెక్‌ రవితో సమావేశమయ్యారు.

వివేకానందరెడ్డి ఉన్నంతవరకు తాను పులివెందులలో పట్టు సాధించలేనని బీటెక్‌ రవికి తెలుసు. తాను ఎంపీగా గెలవలేనని ఆదినారాయణ రెడ్డికి తెలుసు. ఇక పరమేశ్వరెడ్డికి వివేకానందరెడ్డితో ఆర్థిక వివాదాలు ఉన్నాయి. అందుకు  బీ.టెక్‌ రవి, ఆదినారాయణరెడ్డి, పరమేశ్వరరెడ్డి కలసి వివేకానందరెడ్డి హత్యకు కుట్రపన్ని ఉండొచ్చని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి చెబుతోంది.  

ఈ విషయాలన్నీ శ్రీనివాసరెడ్డికి తెలుసు. అతను జీవించి ఉంటే బీ.టెక్‌ రవి, ఆదినారాయణ రెడ్డిలకే ముప్పు. అందుకే అతన్ని అంతం చేసే అవకాశం వారికే ఉంది. ఇప్పటికైనా సీబీఐ వారిని విచారించాలి. అలానే గంగాధర్‌ రెడ్డి మృతి విషయంలోనూ టీడీపీ అసత్య ఆరోపణలతో కేసును తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది.

వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని వైఎస్‌ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, టీడీపీ నేతలు బీటెక్‌ రవి, ఆదినారాయణ రెడ్డి, సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని గంగాధర్‌రెడ్డి ఆరోపించారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదుచేశారు కూడా.

ఆ తరువాత అనా­రోగ్య కారణాలతో ఆయన మృతి చెందారు. గంగాధర్‌రెడ్డి వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. ఆయన వాంగ్మూలం టీడీపీ నేతలకు వ్యతిరేకంగా ఉంది. మరి ఆయన అనుమాస్పదంగా మృతిచెందితే...అందుకు టీడీపీ నేతలనే శంకించాల్సి ఉంటుంది కదా.  

నారాసుర రక్తచరిత్రలో ప్రతిపేజీ హత్యలు,కుట్రలే... 
1 వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడే కదా? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్‌ చేసినా చంద్రబాబు నో చెప్పారెందుకు? ‘సిట్‌’తో సరిపెట్టారెందుకు? 

2 ముఖ్యమంత్రి కుటుంబానికి ఎంపీ అవినాశ్‌ నుంచి అర్ధరాత్రే ఫోన్‌ వెళ్లినట్లు తెలుగుదేశం ఓ అభూత కల్పనను సృష్టించింది. ఎవరు చెప్పారిది సీబీఐ కూడా చెప్పలేదుగా? పోనీ... అప్పుడు అధికారంలో ఉన్నది మీరే కదా? దీన్ని నిరూపించే కాల్‌ డేటాను చూపించగలరా? ఉదయం 6.10కి వివేకా పనిమనిషి ఇంటి తలుపు తీసేదాకా ఆయన మృతి గురించి ఎవ్వరికీ తెలియదన్నది పచ్చి నిజం కాదా? ఆమె చెప్పాకే బంధువులకు, బయటి ప్రపంచానికి తెలిసిందన్నది వాస్తవం కాదా?  

3 అవినాశ్‌రెడ్డి అప్పటికే ఎంపీ. కడప లోక్‌సభ ఇన్‌చార్జి కూడా. వివేకానందరెడ్డిని జమ్మలమడుగు అసెంబ్లీ ఇన్‌చార్జిగా ప్రకటించారు జగన్‌. ఎన్నికల షెడ్యూలు వెలువడటంతో అవినాశ్‌ గెలుపు కోసం వివేకా ప్రచారాన్ని ప్రారంభించారు. ముందురోజు రాత్రి జమ్మలమడుగులో ప్రచారం చేశారు కూడా. అలాంటిది ఎంపీ సీటు కోసం ఆయనపై కుట్ర పన్నాల్సిన అవసరం అవినాశ్‌కు ఎందుకుంటుంది?  

4 మార్చి 15, 2019న ఉదయాన్నేజమ్మలమడుగు ప్రచారానికి వెళుతుండగా అవినాశ్‌కు వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేసి వివేకా మరణించినట్లు చెప్పటంతో ఆయన హడావుడిగా అక్కడకు చేరుకున్నారు. ఆ ఫోన్‌ రాకపోయి ఉంటే ఆయన వచ్చి ఉండేవారే కాదు. వచ్చిన వెంటనే ఆయన విషయం తెలుసుకుని మొదట సీఐకి ఫోన్‌ చేశారు. అప్పుడున్నది తెలుగుదేశం సర్కారు. సీఐ కూడా టీడీపీ నేతలు కోరి తెచ్చుకున్న వ్యక్తి. అలాంటిది సీఐకి ఫోన్‌ చేశాక.. బంధువులకు ఫోన్లు చేశారు అవినాశ్‌రెడ్డి. ఇందులో ఆయన చేసిన తప్పేంటి?  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement