జగన్‌ ఉన్నత లక్ష్యానికి బాబు ఉరి | Chandrababu Govt Neglect On Poor Students Medical Education | Sakshi
Sakshi News home page

జగన్‌ ఉన్నత లక్ష్యానికి బాబు ఉరి

Published Tue, Jul 16 2024 4:53 AM | Last Updated on Tue, Jul 16 2024 4:53 AM

Chandrababu Govt Neglect On Poor Students Medical Education

పేద, మధ్యతరగతి పిల్లల వైద్య విద్య కల సాకారానికి వైఎస్‌ జగన్‌ చర్యలు 

రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం  

పటిష్ట ప్రణాళికతో మహోన్నత ఆశయాన్ని ముందుకు నడిపించిన వైఎస్‌ జగన్‌ 

గత ఏడాది 5 కళాశాలలు ప్రారంభం 

అందుబాటులోకి 750 ఎంబీబీఎస్‌ సీట్లు.. ఈ ఏడాది మరో 5 కాలేజీల ప్రారంభానికి ఏర్పాట్లు 

తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతరత్రా ఏర్పాట్లు పూర్తి 

ఏపీవీవీపీ ఆస్పత్రులు అప్‌గ్రేడ్‌.. 90 శాతం సిబ్బంది నియామకం 

చంద్రబాబు ప్రభుత్వం రాకతో కాలేజీలకు గ్రహణం.. కొత్త కాలేజీలకు అనుమతులు నిరాకరించిన ఎన్‌ఎంసీ 

అప్పీలుకు వెళ్లే అవకాశమున్నా సర్కారు మౌనం 

పేదల అభ్యున్నతిపై బాబు వ్యతిరేకతకు ఇదే నిదర్శనం

రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాకు ఒక వైద్య కళాశాల మంజూరు చేయాలని అసెంబ్లీలో సభ్యులు కోరగా.. ‘రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఏమీ బాగోలేదు.ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు సాధ్యపడదు. ప్రైవేటు వైద్య కళాశాలలకు అనుమతులు ఇస్తున్నాం’ అంటూ అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ కరాఖండిగా తేల్చి చెప్పారు. ఒక్క వైద్య కళాశాలకే అప్పట్లో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బూచీగా చూపి చేతులెత్తేశారు. ప్రైవేటు కళాశాలల ద్వారా దోపిడీకి తెరలేపారు. అలాంటిది కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఆర్ధిక పరిస్థితి కుదేలైనప్పటికీ, ఆ సంక్షోభాన్ని అధిగమించి ఏకంగా 17 కళాశాలల నిర్మాణం ప్రారంభించిన ఘనత ఒక్క వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. వైఎస్‌ జగన్‌ దీక్ష, దక్షతలకు ఈ కళాశాలలు ఓ నిదర్శనం.

సాక్షి, అమరావతి: వైద్య విద్యనభ్యసించాలన్న అభిలాష ఉండి, ప్రైవేటు కాలేజీల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక తల్లడిల్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్యనందించి, వారి కలను సాకారం చేయాలన్నది వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆకాంక్ష. అందుకే 2019లో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.8,480 కోట్లతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. 

వీటి ద్వారా రాష్ట్రంలోని నిరుపేద, మధ్య తరగతి పిల్లల వైద్య విద్య కల నెరవేరుతుంది. అంతేకాదు.. పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందుబాటులోకి వస్తాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రీ సాహసం చేయలేని ఈ మహోన్నత లక్ష్యాన్ని సాధించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. మరోపక్క నాడు–నేడు ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు, ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది కొరతకు తావు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అసూయ, పేద వర్గాలపై ఆయనకున్న ద్వేషానికి రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య బలవుతోంది.

2,550 ఎంబీబీఎస్‌ సీట్లు సమకూర్చేలా 
2019 నాటికి రాష్ట్రంలో ఉన్నవి 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే. వీటిలో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండేవి. ఇవి పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు సరిపోవు. ఈ వర్గాల తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టలేక తమ పిల్లల్ని వేరే కోర్సుల్లో చేరి్పంచేవారు. వారి కలలను నిజం చేయడానికి వైఎస్‌ జగన్‌ కొత్తగా 2,550 సీట్లను సమకూర్చే లక్ష్యంతో 17 కొత్త కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నిధులు సమకూర్చారు. నిర్మాణాలూ వేగంగా చేశారు. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 2023–24 విద్యా సంవత్సరంలో ఒకేసారి 5 కళాశాలలను ప్రారంభించారు. 

విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల ద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన విజయనగరం జిల్లాకూ వైద్య కళాశాల రావడంతో ఆ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. 1979లో ఏర్పాటైన ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇదే తొలి ప్రభుత్వ వైద్య కళాశాల. దీంతో ఈ జిల్లా ప్రజలు మెరుగైన వైద్యం కోసం వ్యయప్రయాసలకోర్చి విశాఖపట్నంకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. 

ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పాడేరు కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం గత ఏడాది నుంచే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని చోట్లా ఏపీవీవీపీ ఆస్పత్రులను బోధనాస్పత్రులుగా అభివృద్ధి చేసింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్‌ విద్యార్థుల అకడమిక్‌ కార్యకలాపాల కోసం లెక్చర్‌ హాల్, ల్యాబ్, వసతి కోసం హాస్టల్స్, క్యాంటిన్‌ ఇలా వివిధ నిర్మాణాలు చేపట్టింది. ఎన్నికల ఫలితాలు వెలువడేనాటికి 80 శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి.  

క్రెడిట్‌ జగన్‌కే దక్కుతుందని
ఈ ఏడాది మరో 5 కొత్త కళాశాలలు ప్రారంభమైతే ఆ ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం చంద్రబాబు అధికారాన్ని చేపట్టగానే వైద్య కళాశాలల ఏర్పాటు అంశాన్నే విస్మరించారు. దీంతో గత నెల 25న ఎన్‌ఎంసీ ఐదు కళాశాలల్లో తనిఖీలు చేసి, అనుమతులు నిరాకరించింది. దీనివల్ల రాష్ట్ర విద్యార్థులకు అదనంగా రావాల్సిన 500 సీట్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఉన్నది కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం. పైగా, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ బీజేపీ నేతే. కేంద్రంలోనూ టీడీపీ అధికారాన్ని పంచుకుంటోంది. 

ఇలా ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కనీసం వైద్య కళాశాలలకు అనుమతులు కూడా రాబట్టలేకపోయింది చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే సీఎస్‌ మార్పు, ఇతర అధికారులను పక్కన పెట్టడంపై పెట్టిన శ్రద్ధ ప్రజారోగ్యంతో ముడిపడి ఉన్న వైద్య కళాశాలలపై ఇసుమంతైనా చూపలేదు. అన్ని వసతులను, 70 నుంచి 90 శాతం మేర వైద్య, వైద్యేతర సిబ్బందిని అందుబాటులో ఉంచింది. 

కొత్త ప్రభుత్వం మిగిలిన వైద్యులు, సిబ్బందిని నియమించి ఉంటే కళాశాలలకు తప్పనిసరిగా అనుమతులు లభించి ఉండేవని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాస్త పనినీ చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగా విస్మరించడం వల్ల రాష్ట్రానికి నష్టమే జరిగింది. ఎన్‌ఎంసీ అనుమతుల నిరాకరణపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఇప్పటికీ ఉంది. ఇందుకు వైద్య శాఖ సిద్ధంగానే ఉంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియా నిలిచిపోయింది. ప్రభుత్వ తీరు చూస్తే వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన మిగిలిన ఏడు కళాశాలలనూ అటకెక్కిస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ కళాశాలలపై చంద్రబాబు అసహనం 
ఎప్పుడూ ప్రైవేటు వైపే మొగ్గు చూపే సీఎం చంద్రబాబుకు పేద, మధ్య తరగతుల ఊసే పట్టదు. టీడీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఒక్క  వైద్య కళాశాలా నిర్మించిన దాఖలాలు లేవు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి చొరవతో రిమ్స్‌ల రూపంలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ పాలనలోనే ప్రభుత్వ రంగంలో  వైద్య విద్యకు అత్యంత ప్రాధాన్యం దక్కింది. 

ప్రభుత్వమే ఇన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు అప్పుడు, ఇప్పుడు కూడా జీర్ణించుకొలేరు. ఇటీవల వైద్య కళాశాలలపై జరిగిన సమీక్షలో ఆయన తీరు స్పష్టంగా ప్రదర్శితమైనట్లు సమాచారం. వైద్య కళాశాలల కోసం రూ.8 వేల కోట్లకు పైగా బడ్జెట్‌ ఏమిటంటూ చంద్రబాబు ఈ సమావేశంలో ఉన్నతాధికారులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అన్ని నిధులు ఎక్కడి నుంచి తీసుకుని వస్తారని రివర్స్‌లో సీఎం ప్రశ్నించడంతో అధికారులు విస్తుబోయారని సమాచారం. 

డబ్బున్నవారికే విద్య సొంతమయ్యేలా 
పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఉన్నత చదువులు దక్కకూడదనే విధంగానే టీడీపీ, చంద్రబాబు తీరు ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. డబ్బున్న వారికే వైద్య విద్య సొంతమయ్యేలా 2019కు ముందు టీడీపీ పాలనలో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనం. అప్పట్లో పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఎంబీబీఎస్‌ చదివిన వారు పీజీ కోర్సులు చేయడానికి వీల్లేని పరిస్థితులు సృష్టించారు. పీజీ కోర్సుల ఫీజులను అమాంతంగా పెంచేశారు. 

యాజమాన్య కోటా అటుంచితే కన్వీనర్‌ కోటా సీట్లు కూడా పేద, మధ్య తరగతికి దక్కకుండా ఫీజులను పెంచారు. అప్పటివరకూ కన్వీనర్‌ కోటాలో క్లినికల్‌ డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో ప్రైవేట్‌ కళాశాలల్లో రూ. 2.90 లక్షలుగా ఉన్న ఫీజును, 2017–18లో ఏకంగా రూ.6.90 లక్షలకు పెంచారు. యాజమాన్య కోటా ఫీజను రూ.5.25 లక్షల నుంచి రూ.24.20 లక్షలకు పెంచారు. దీంతో పేద విద్యార్థులకు కన్వీనర్‌ కోటా కూడా దక్కకుండా పోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ జగన్‌ ప్రైవేట్‌ కళాశాలల్లో పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజులను 40 నుంచి 50 శాతం వరకు తగ్గించారు. నిరుపేద, మధ్యతరగతి వారికి భారీ ఊరట కల్పించి అండగా నిలిచారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement