
ప్రధానితో అరకు కాఫీ తాగించి ఆయన్నే బ్రాండ్ అంబాసిడర్ చేశా
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో చంద్రబాబు
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీలిచ్చానని, కానీ, రాష్ట్రానికి ఉన్న రూ.10 లక్షల కోట్ల అప్పులకు వడ్డీ కట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని, ప్రతి కులాన్ని అధ్యయనం చేస్తున్నానని, వారిని ఏ విధంగా పైకి తీసుకురావాలో ఆలోచిస్తున్నానని అన్నారు. ఆయన శుక్రవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్నారు. అడవి తల్లికి ఆదివాసీ చీరను సమర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశ ప్రధానితో అరకు కాఫీ తాగించి ఆయన్నే బ్రాండ్ అంబాసిడర్ చేశానని చెప్పారు.
దేశంలోని ప్రతి షాపులో అరకు కాఫీ అమ్మేలా చేస్తానన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి తగ్గుతోందని, గిరిజనుల్లో మాత్రం సంతానం పెరగడం శుభపరిణామమని అన్నారు. ఈ రోజుల్లో కూడా ఏజెన్సీలో డోలీ మోతలు విచారకరమని అన్నారు. డీఎస్సీకి పోటీ పడే గిరిజన అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. గిరిజన విద్యార్థుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. లంబసింగిలో మ్యూజియం, పాడేరులో మెడికల్ కళాశాల రూ.500 కోట్లతో పూర్తి చేస్తామని చెప్పారు.
పాడేరులో రూ.10 కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తామని, కుళాయి ద్వారా నీళ్లు అందిస్తామని, అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీల వర్షం కురిపించారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన సుడిగాలిలో జగన్ కొట్టుకుపోయాడని, ఇక తిరిగి రాడని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో తెచ్చిన 16 పథకాలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ద్వారా మీ భూములను దోచుకోవాలని చూశారని, అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చంద్రబాబు కసరత్తు
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీచేసే విషయంపై సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం ఆ జిల్లా నేతలతోపాటు పలువురు పార్టీ సీనియర్లతో మాట్లాడారు. పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.
నేతలు చెప్పిన లెక్కల ప్రకారం గెలవడానికి సరిపోయే సంఖ్య లేదని తెలిసింది. అందుకే అభ్యర్థిని ఖరారు చేయకుండా సాగదీస్తున్నట్లు సమాచారం. పోటీ చేయాల్సివస్తే అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment