Chandrababu: బాబు మాటలన్నీ చిలక పలుకులే.. | Chandrababu Naidu Backward Class Cheating TDP Nara Lokesh | Sakshi
Sakshi News home page

Chandrababu: బాబు మాటలన్నీ చిలక పలుకులే..

Published Mon, Apr 11 2022 7:05 AM | Last Updated on Mon, Apr 11 2022 8:03 AM

Chandrababu Naidu Backward Class Cheating TDP Nara Lokesh - Sakshi

సాక్షి, అమరావతి: ఒడ్డు దాటే వరకే ఓడ మల్లన్న.. ఆ తరువాత బోడి మల్లన్న అనే సామెత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యవహార శైలికి అతికినట్లుగా సరిపోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీడీపీకి బీసీలే వెన్నెముక.. వారు లేనిదే పార్టీ లేదని ఆయన పలికే చిలుక పలుకులన్నీ కేవలం బలహీన వర్గాల ఓట్లతో అందలం ఎక్కడానికేనని అధికారంలో ఉండగా పలుమార్లు రుజువు చేసుకున్నారు. ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారా? అని తూలనాడి ఆ సామాజిక వర్గాన్ని అవమానించారు. తాత్కాలిక సచివాలయంలో నాడు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తా, తోలు తీస్తానంటూ వేలు చూపించి బెదిరించారు. పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు భాగస్వామ్యం కల్పించకుండా అణగదొక్కి సామాజిక న్యాయాన్ని అపహాస్యం చేశారు.

అధికారంలోకి రాగానే చంద్రబాబు ఏర్పాటు చేసిన తొలి మంత్రివర్గంలో 58 శాతం మంది అగ్రవర్ణాల వారే ఉండటం గమనార్హం. తరువాత మంత్రివర్గ విస్తరణలో ఓసీల ప్రాతినిథ్యం మరింత పెరిగింది. మరోవైపు ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు ఓట్ల కోసం ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కిడారి శ్రావణ్‌ కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని ఎమ్మెల్యే /ఎమ్మెల్సీని చేయకుండా తన కపట వైఖరిని మరోసారి ప్రదర్శించారు. ఇక మైనార్టీల పట్ల దారుణంగా వ్యవహరించారు. నాడు మంత్రివర్గం నుంచి బీజేపీ వైదొలగిన తరువాతే గత్యంతరం లేని పరిస్థితుల్లో ముంచుకొస్తున్న ఎన్నికల భయంతో ఎస్టీ, మైనార్టీలకు అవకాశమిచ్చారు.

అదే నారా లోకేష్‌ను మంత్రిని చేసేందుకు ఆగమేఘాలపై ఎమ్మెల్సీగా చేసి ఎస్సీ మంత్రులను తొలగించి మరీ అవకాశమివ్వడం గమనార్హం. ఓసీ, బీసీల నుంచి ఇద్దరికి ఉప ముఖ్యమంత్రులుగా చంద్రబాబు అవకాశం కల్పించినా వీరిలో ఒక్క మహిళ కూడా లేరని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు 1999లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా 42 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలోనూ 26 మంది అగ్రవర్ణాలకు చెందిన వారే ఉండటం గమనార్హం. అంటే 62 శాతం మంది ఓసీలకు ఆయన మంత్రివర్గంలో చోటు కల్పించారు. అప్పటి నుంచి సామాజిక న్యాయంపై ఆయన ఇదే ఫార్ములాను పాటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 

చదవండి: (సామాజిక మహా విప్లవం)

ఆది నుంచే సామాజిక అన్యాయం..
రాష్ట్ర విభజన అనంతరం బీజేపీ, జనసేనతో జట్టుకట్టిన టీడీపీ కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని దక్కించుకుంది. 2014 జూన్‌ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు అదే రోజు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. 11 మంది అగ్రవర్ణాలకు, ఇద్దరు ఎస్సీలకు, ఆరుగురు బీసీలకు స్థానం కల్పించారు. గిరిజనులకు, మైనార్టీలకు స్థానం కల్పించలేదు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కారు. దామాషా ప్రకారం బీసీలకు దక్కాల్సిన పదవుల కంటే అతి తక్కువగా ఆరు మాత్రమే కేటాయించారు. 

తనయుడి కోసం చట్టం అపహాస్యం..
నారా లోకేష్‌ను హడావుడిగా ఎమ్మెల్సీని చేసిన చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు 2017 ఏప్రిల్‌ 2న మొదటిసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టగా బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడంతో 2018 నవంబర్‌ 11న రెండోసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. లోకేష్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు ఇద్దరు ఎస్సీ మంత్రులు పీతల సుజాత, రావెల కిశోర్‌బాబులపై వేటు వేశారు. ఓసీలైన పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో పాటు బీసీ మహిళ కిమిడి మృణాళినిని మంత్రివర్గం నుంచి తప్పించారు. వారి స్థానంలో వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకుని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచారు. 25 మంది ఉన్న మంత్రివర్గంలో చంద్రబాబు ఏకంగా ఓసీ వర్గాలకు చెందిన 15 మందికి స్థానం కల్పించడం గమనార్హం. బీసీల నుంచి ఎనిమిది మందికి, ఎస్సీల నుంచి ఇద్దరికి మాత్రమే చోటిచ్చి సామాజిక న్యాయాన్ని నవ్వుల పాలు చేశారు. 

చదవండి: (ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..)

గిరిజనులు, మైనార్టీలపై కపట ప్రేమ
ఆ తరువాత రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఇద్దరు బీజేపీ మంత్రులు వైదొలగడంతో ఎన్నికలకు నాలుగు నెలల ముందు కేవలం ఓట్ల కోసం మైనార్టీ, గిరిజన వర్గాలకు స్థానం కల్పిస్తూ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొంది టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు(ఎస్టీ)ను మావోయిస్టులు హత్య చేయడంతో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌కుమార్‌ను ఎమ్మెల్యే/ఎమ్మెల్సీని చేయకుండా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2018 నవంబర్‌ 11న రెండోసారి విస్తరించాక 25 మందితో మంత్రివర్గం ఏర్పడింది. ఇందులో అగ్రవర్ణాల నుంచి 13 మంది (52 శాతం), బీసీల నుంచి ఎనిమిది మంది (32 శాతం), ఎస్సీల నుంచి ఇద్దరు (ఎనిమిది శాతం) ఎస్టీల నుంచి ఒకరు(నాలుగు శాతం), మైనార్టీల నుంచి ఒకరికి (నాలుగు శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు ద్రోహం చేసి సామాజిక న్యాయంపై చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు.

పెద్దల సభకు ఒక్కర్నీ పంపలేదు..
టీడీపీ అధికారంలో ఉండగా అగ్రవర్ణాలకు చెందిన వారినే రాజ్యసభ సభ్యులుగా చంద్రబాబు ఎంపిక చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఏ ఒక్కరినీ రాజ్యసభకు పంపకుండా ఆయా సామాజిక వర్గాలపై తీవ్ర వివక్ష ప్రదర్శించారు.

మహిళలపై చిన్నచూపు..
మహిళా సాధికారతపై అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే చంద్రబాబు పరిపాలనలో వారికి అన్యాయమే జరిగింది. 2014 జూన్‌ 8న తొలుత ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు (ఓసీ, బీసీ, ఎస్సీల నుంచి ఒక్కొక్కరు) స్థానం కల్పించగా మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ వర్గానికి పీతల సుజాతపై వేటు వేశారు. 

2017 ఏప్రిల్‌ 2న తొలిసారి మంత్రివర్గ విస్తరణ
ఇన్:
1.నారా లోకేష్‌ (ఓసీ)
2.పితాని సత్యనారాయణ (బీసీ)
3.కిమిడి కళా వెంకట్రావు (బీసీ)
4.కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ (ఎస్సీ)
5.సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి (ఓసీ)
6.నక్కా ఆనందబాబు (ఎస్సీ)
7.కాల్వ శ్రీనివాసులు (బీసీ)
8.ఎన్‌.అమర్‌నాథ్‌రెడ్డి (ఓసీ)
9.ఆర్వీ సుజయ కృష్ణరంగారావు (ఓసీ)
10.భూమా అఖిలప్రియ (ఓసీ)
11.సి.ఆదినారాయణరెడ్డి (ఓసీ)

ఔట్‌:
1.పల్లె రఘునాథరెడ్డి (ఓసీ)
2.బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (ఓసీ)
3.కిమిడి మృణాళిని (బీసీ)
4.పీతల సుజాత (ఎస్సీ)
5.రావెల కిశోర్‌బాబు (ఎస్సీ)

2018 నవంబర్‌ 11న రెండోసారి మంత్రివర్గ విస్తరణ
ఇన్‌
1.మహ్మద్‌ ఫరూఖ్‌ (మైనార్టీ)
2.కిడారి శ్రావణ్‌ కుమార్‌ (ఎస్టీ)
ఔట్‌ (రాజీనామాలు)
1.కామినేని శ్రీనివాస్‌ (ఓసీ)
2.పైడికొండల మాణిక్యాలరావు (ఓసీ) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement